demining
-
భద్రాద్రి జిల్లాలో మందుపాతర నిర్వీర్యం
చర్ల: పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ మందుపాతరను గుర్తించిన పోలీసులు శుక్రవారం దాన్ని నిర్విర్యం చేశారు. దీంతో పోలీసు బలగాలకు పెనుప్రమాదం తప్పినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కలివేరు–పెదమిడిసిలేరు ప్రధాన రహదారిపై బీ కొత్తూరు వద్ద వంతెనకు సమీపాన మావోయిస్టులు 30 కిలోల మందుపాతర ఏర్పాటు చేశారు. ఈ రహదారి మీదుగా సరిహద్దు అటవీప్రాంతానికి నిత్యం బలగాలు కూంబింగ్‌కు వెళ్లివస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెళ్లే పోలీసులను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు ఈ మందుపాతరను అమర్చగా, తనిఖీల్లో భాగంగా గురువారం ఉదయం గుర్తించారు. ఓ పక్క పోలింగ్ జరుగుతున్నందున దాన్ని నిర్వీర్యం చేస్తే వచ్చే శబ్దంతో ఓటర్లు భయబ్రాంతులవుతారని భావించిన పోలీసులు మందుపాతరకు ఉన్న ఎలక్ట్రిక్ వైర్లు తొలగించారు. శుక్రవారం ఉదయం బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆధ్వర్యాన నిర్వీర్యం చేశారు. కాగా, ఈ మందుపాతరను మావోలు పేల్చినట్లయితే బస్సు లేదా లారీ వంటి భారీ వాహనం కనీసం 20 నుంచి 30 అడుగుల మేర ఎత్తు ఎగిరిపడి తునాతునకలయ్యేదని చెబుతున్నారు. మరోపక్క ఈ మార్గంలో ఇంకా మందుపాతరలు ఉండొచ్చనే భావించిన పోలీసులు నిశితంగా తనిఖీలు చేపడుతున్నారు. -
గురితప్పిన మందుపాతర
పోలీసులకు సవాల్‌గా మారిన కూంబింగ్ చింతూరు(రంపచోడవరం) : శత్రువును మట్టుబెట్టాలని మావోయిస్టుల పథక రచన గురితప్పి వారికే చేటు తెచ్చింది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర అమర్చేందుకు వెళ్తున్న క్రమంలో సోమవారం ప్రమాదవశాత్తూ అది వారి చేతుల్లోనే పేలిపోయింది. ఈ ఘటనలో చత్తీస్‌గఢ్‌కు చెందిన కోటేష్ (35) అనే మిలీషియా దళ సభ్యుడు మృత్యువాత పడగా కొంతకాలంగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా వున్న కాకి కన్నయ్య అనే మిలీషియా కమాండర్ తీవ్రంగా గాయపడ్డాడు. తమను మట్టుబెట్టేందుకు ప్రయత్నించిన మావోయిస్టులు వారు తీసుకున్న గోతిలోనే వారే పడ్డారని పోలీసులు అంటున్నారు. అడుగడుగునా మందుపాతర్లే రాష్ట్ర విభజన అనంతరం విలీన మండలాల్లో బాధ్యతలు చేపట్టిన ఆంధ్రా పోలీసులకు ఆది నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కిరణ్‌ను అరెస్టు చేయడంతో పాటు శబరి ఏరియా కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్ నగేష్‌ను ఎన్కౌంటర్ చేశారు. దీనిపై ప్రతీకారంతో వున్న మావోయిస్టులు ఆంధ్రా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ చేపట్టే ఆంధ్రా పోలీసులను టార్గెట్ చేసుకుని అడుగడుగునా మందుపాతర్లు అమర్చుతున్నారు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, పేగ,మల్లంపేట, కలి గుండం ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఏడు సార్లు సుమారు 10 మందు పాతర్లను పోలీసులు వెలికి తీసి నిర్వీర్యం చేశారు. ప్రధానంగా ఏడుగురాళ్లపల్లి, పేగ రహదారిలో ఓసారి డమ్మీ మందు పాతర్లను అమర్చి పోలీసులను కవ్వించారు. మరోసారి నిజమైన మందుపాతర్లను అమర్చారు. పోలీసులు వాటిని ముందుగానే పసిగట్టి మావోయిస్టుల కుతంత్రాలను తిప్పికొట్టడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. పోలీసులను గాయపర్చే క్రమంలో గతంలో సరిహద్దుల్లో బూబీ ట్రాప్లను అమర్చే మావోయిస్టులు గత రెండేళ్లుగా ప్రాణ నష్టమే లక్ష్యంగా నేరుగా మందుపాతర్లనే అమర్చుతుండడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. మావోయిస్టుల నియంత్రణే లక్ష్యంగా సరిహద్దుల్లో కూంబింగ్ చేపడుతున్న పోలీసులకు వరుసగా లభ్యమవుతున్న మందుపాతర్లు భారీ సవాల్‌గా మారాయి. సరిహద్దుల్లో టెన్షన్ మందుపాతర అమర్చే క్రమంలో దళ సభ్యుడు మృతి చెందడం, మరో మిలీషియా కమాండర్ గాయపడి పోలీసులకు పట్టుబడడంతో ఆంధ్రా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటన అనంతరం సరిహద్దుల్లో అదనపు బలగాలతో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేసే అవకాశముంది. మరోవైపు మావోయిస్టులు సైతం ఈ ఘటనపై పోస్ట్‌మార్టం నిర్వహించే అవకాశముండడంతో సరిహద్దు పల్లెల ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. -
మందుపాతర అమర్చిన మావోలు
పెద్దబయలు : విశాఖపట్నం జిల్లా పెద్దబయలు మండలం జిలుగులపట్టు మలుపు వద్ద మావోయిస్టులు మందు పాతర అమర్చారు. పోలీసులను టార్గెట్ చేసుకుని ఈ మందుపాతర పెట్టినట్లు తెలుస్తోంది. మందుపాతరను గుర్తించిన పోలీసులు దానిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం సంభవించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేలిన మందుపాతర : ఆటో డ్రైవర్‌కు గాయాలు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం - జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని వెంకటాపురం మండలంలో మావోరుుస్టులు ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఓ ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈనెల 2 నుంచి 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన మావోరుుస్టు పార్టీ బుధవారం రాత్రి చర్ల-శబరి ఏరియా కమిటీ వారు వెంకటాపురం మండలంలోని విజయపురికాలనీ సమీపంలోని ప్రధాన రహదారిపై వాల్‌పోస్టర్లు వేసి, బ్యానర్లు కట్టారు. అరుుతే చర్ల నుంచి వెంకటాపురం వైపునకు సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్న వెంకటాపురానికి చెందిన ఆటో డ్రైవర్ గుగ్గిళ్ల కార్తీక్ అక్కడ ఆగి వాల్ పోస్టర్‌ను గమనిస్తున్న సమయంలో మందుపాతర పేలి తీవ్ర గాయాలపాల య్యాడు. దీంతో క్షతగాత్రుడిని స్థానికులు వెంకటాపురం ప్రభుత్వ వైద్య శాలకు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. గురువారం హైదరాబాద్‌కు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టర్లను తొలగించేందుకు కార్తీక్‌ను కూడా పోలీసులే పంపించారనే ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు. క్షతగాత్రుడితో సైతం తానే స్వయంగా వెళ్తూ మార్గమధ్యంలో పోస్టర్లు, బ్యానర్లు కనిపించడంతో ఆగి చూస్తుండగా మందుపాతర పేలిందని పోలీసులు చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. -
తవ్వుకున్న గొయ్యిలో పడి నక్సల్స్ మృతి
చింతూరు: 'తాము తవ్విన గోతిలో తామేపడ్డ' చందంగా పోలీసులను హతమార్చేందుకు మందుపాతర అమర్చుతూ అది పేలడంతో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 15న దండకారణ్యం బంద్ పిలుపులో భాగంగా తమ ప్రభావిత ప్రాంతమైన కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. రహదారుల పొడవునా కందకాలు తవ్వడంతోపాటు చెట్లు నరికి దారికి అడ్డంగా పడేశారు. ఇదే క్రమంలో కూంబింగ్ నిర్వహించడానికి వచ్చే పోలీసులను లక్ష్యం చేసుకుని.. కొయిలీబేడా పోలీస్‌స్టేషన్ పరిధిలోని మర్కానార్ గ్రామ రహదారి మందుపాతరను అమర్చేప్రయత్నం చేశారు. అయితే ప్రమాదవశాత్తు మందుపాతర పేలిపోవడంతో ముగ్గురు నక్సల్స్ మందుపాతరకోసం తవ్విన గోతిలోనేపడి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెప్పారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కమాండర్ అర్జున్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. -
మన్యంలో మళ్లీ అలజడి
మందుపాతర పేల్చిన మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం పోలీసుల కాల్పులు.. తప్పించుకున్న మావోయిస్టులు పెదబయలు/ముంచంగిపుట్టు: కొద్దికాలంగా ప్రశాంతంగా ఉన్న ఏవోబీలో మళ్లీ యుద్ధ వాతావరణం అలుముకుంది. మావోయిస్టులు బుధవారం మందుపాతర పేల్చిన సంఘటనతో మన్యం ఉలిక్కిపడింది. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దు కర్రి ముక్కిపుట్టు పంచాయతీ దూలిపుట్టు గ్రామ సమీపంలో అడ్డతీగల మలుపు వద్ద బుధవారం ఉదయం 8.15 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఒక జవాన్ గాయపడగా మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కూడా కాల్పులు జరిపినప్పటికీ మావోయిస్టులు తప్పించుకుని పారిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం రూడకోట గ్రామంలో నెల రోజులుగా పోలీస్ఔట్ పోస్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోజూ ముంచంగిపుట్టు నుంచి రూడకోటకు పీఆర్పీఎఫ్ బలగాలు వచ్చి విధులు నిర్వహించి తిరిగి వెళుతుంటాయి. వీరంతా రోజూ నడిచి వెళుతుండటం గమనించిన మావోలు మందుపాతర పేల్చేందుకు ఏర్పాట్లుచేసుకున్నారు. తారు రోడ్డుకు గోతులు ఏర్పడిన ప్రదేశంలో అక్కడ మెటల్ తొలగించి ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ఎక్స్ప్లోజివ్ డివైజ్) పేలుడు పదార్థాలు అమర్చారు. పోలీసుల రాక కోసం మాటువేసిన మావోలు వాటిని పేల్చారు. పేలుడు పదార్థాలు ఎడవ పక్కన అమర్చడం, తాము కుడివైపున నడుచుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, లేకుంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని జవాన్లు తెలిపారు. 20 మంది జవాన్లు ఒక గ్రూపుగా, కిలోమీటర్ దూరంలో మరో 20 మంది జవాన్లు మరో గ్రూపుగా నడిచి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ఈ సంఘటనలో పెదబయలు సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ జవాను శ్రీనివాస్ సాహు కుడి భుజానికి తీవ్ర గాయం కావడంతో అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, పాడేరు ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి విశాఖపట్నానికి తరలించారు. కొండమీద ఉన్న మావోయిస్టులపై 10 రౌండ్లు కాల్పులు జరపగా, సుమారు 10 మంది సాయుధులైన మావోలు బ్యాగులు, తినుబండారాలు వదిలి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూడకోట గ్రామంలో నిర్మిస్తున్న ఔట్ పోస్టుకు కేవలం రెండు కిలోమీటర్లు దూరంలో ఈ సంఘటన జరగడం విశేషం. 15 రోజుల నుంచి రెక్కీ రూడకోట ఔట్ పోస్టు నిర్మాణానికి సంబంధించి నెల రోజుల నుంచి పోలీసులు ప్రతీ రోజు పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల నుంచి వచ్చి విధులు నిర్వహించి వెళుతున్నారు. ప్రతీ రోజు ముంచంగిపుట్టు నుంచి రూడకోట వరకు 11 కిలోమీటర్లు నడిచి వెళ్లి రావడం గమనించిన మావోయిస్టులు మందుపాతరకు వ్యూహం రచించారు. దూలిపుట్టు అడ్డతీగల మలుపును సేఫ్ పాయింట్‌గా ఎంచుకుని 15 రోజుల నుంచి ఐఈడీ బ్లాస్టింగ్ సామగ్రి అమర్చారు. మొత్తం ఐదు మందుపాతరలు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతంలో రెండు వైపులా కొండలు ఉండడం, కింది నుంచి పోలీసులు కాల్పులు జరిపినా తప్పించుకునే అవకాశం ఉండటతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. ఈ సంఘటనలో 10 మంది మావోలు పాల్గొన్నట్లు సమాచారం. పోలీసులు నడిచి కాకుండా వాహనంపై వెళ్లి ఉంటే పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఐఈడీ పేలుడు సామగ్రి అమర్చడం ఇదే ప్రథమం. ఏవోబీలో పోలీసు ఔట్ పోస్టుల ఏర్పాటును మావోలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఏవోబీలో జల్లెడ మందుపాతర పేలుడు ఘటనతో పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. నర్సీపట్నం ఓఎస్డీ అట్టాడ బాబూజీ, పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఆధ్వర్యంలో మావోల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. రెండు మండలాల ఏవోబీ సరిహద్దు, సంఘటన ప్రాంతానికి సమీపంలో ఉన్న దూలిపుట్టు, వెచ్చంగి, గొర్రెలమెట్ట, గిద్దులమామిడి గ్రామాల్లో మావోల ఆచూకీ కోసం పోలీసులు అదనపు బలగాలతో గాలిస్తున్నారు. మావోలు వదలివెళ్లిన బ్యాగుల్లో ఏమైనా సమాచారం లభించే అవకాశం ఉందని, నిపుణుల పరిశీలన అనంతరత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఓఎస్డీ తెలిపారు. మందుపాతర ఎన్ని రోజుల వ్యవధిలో అమార్చారు.. ఎవరైనా సహకారం అందించారా.. తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పారు. -
మందుపాతర కలకలం
ఏవోబీలో తెగబడ్డ మావోయిస్టులు అవుట్‌పోస్ట్‌పై మందుపాతరతో దాడి భయాందోళనలో మన్యం వాసులు సీలేరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు తెగబడ్డారు. ఎన్నో ఏళ్లుగా బీఎస్ఎఫ్ బలగాలపై ప్రతీకారంతో రగులుతున్న దళసభ్యులు అదను చూసి దెబ్బతీశారు. బుధవారం నాటి ఈ ఘటనలో ముగ్గురు జవాన్లతో పాటు, ఓ గిరిజనుడి ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు నిరసన దినాలు, వారోత్సవాలప్పుడు స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు మందుపాతరతో దాడికి పాల్పడ్డారు. దీంతో సరిహద్దులోని మారుమూల గ్రామాల గిరిజనులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఒడిశాలో సీఆర్పీఎఫ్ బలగాల స్థానంలో బీఎస్ఎఫ్ బలగాలతో గాలింపు చేపట్టినప్పటి నుంచి మావోయిస్టుల దూకుడుకు కళ్లెం పడింది. ఇది మింగుడుపడని మావోయిస్టులు ఒడిశా మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరుకుబంద అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జాన్బై అవుట్‌పోస్ట్(104 బీఎస్ఎఫ్ బెటాలియన్)ను మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో ఏఎస్ఐ ఆర్.సిద్ధయ్యతో పాటు హెడ్‌కానిస్టేబుళ్లు ఎం.రవిచంద్ర, జి. అవినాష్ అనే ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. అలాగే గుంటువాడ కాట్మన్ గూడెం పంచాయతీకి చెందిన కిల్లో హరి ఈ దాడిలో మృతి చెందాడు. పొలంలో పనిచేసుకుంటున్న ఇతడు పేలుడు ప్రభావంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకుంటున్న ప్రాంతాల్లో భద్రత బలగాలు మూడు నెలలుగా గాలిస్తున్నాయి. హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే చేపడుతున్నాయి. ఈ విధానం కొనసాగితే మున్ముందు ఉద్యమం దెబ్బతింటుందని గ్రహించిన దళసభ్యులు పక్కా సమాచరంతో దాడి చేశారు. ఒడిశాలో బీఎస్ఎఫ్ బలగాలు స్థావరం ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి మావోయిస్టులు ఇన్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. ఈ తరుణంలో ఈ సంఘటనతో గిరిజనులు తీవ్రభయాందోళనలకు గురవుతున్నారు. దీంతో సరిహద్దు పోలీసు స్టేషన్లను జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. చిత్రకొండ, సీలేరు, డొంకరాయి, జీకేవీధి పోలీసు స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. -
కేసీఆర్ ఇలాకాలో మందుపాతరల కలకలం!
జగదేవ్‌పూర్: ‘మందుపాతరలు పెట్టాం’ అనే సమాచారం శుక్రవారం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టించింది. అది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ కావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉరుకులు పరుగులు తీశారు. వివరాలు.. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్ సీఐ శంకర్‌గౌడ్‌కు జగదేవ్‌పూర్ సమీపంలోని గొల్లపల్లికి వెళ్లే రోడ్డు పక్కన స్త్రీ శక్తి భవనం వెనుక నక్సల్స్ గతంలో మందు పాతరలు పెట్టినట్లు శుక్రవారం సమాచారం అందింది. దీంతో ఆయన స్థానిక ఎస్ఐ వీరన్నకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించిన ఆయన.. సుమారు 30 మంది సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం జేసీబీతో తవ్వకాలు జరిపారు. చివరికి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పాములవయ్యా గ్రామం వద్ద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు బుధవారం పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సీఆర్పీఎఫ్ బలగాలు 70 మంది గంగులూరు నుంచి అటవీ ప్రాంతానికి కూంబింగ్‌కు బయలుదేరారు. ఈ రహదారి నుంచి బస్సులో పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు మందుపాతర పేల్చడానికి పథకం రచించారు. అయితే, పోలీసుల బస్సు మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు 20 నిమిషాల ముందుగానే పేలింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.