గురితప్పిన మందుపాతర
గురితప్పిన మందుపాతర
Published Mon, Feb 27 2017 11:53 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
పోలీసులకు సవాల్‌గా మారిన కూంబింగ్
చింతూరు(రంపచోడవరం) : శత్రువును మట్టుబెట్టాలని మావోయిస్టుల పథక రచన గురితప్పి వారికే చేటు తెచ్చింది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర అమర్చేందుకు వెళ్తున్న క్రమంలో సోమవారం ప్రమాదవశాత్తూ అది వారి చేతుల్లోనే పేలిపోయింది. ఈ ఘటనలో చత్తీస్‌గఢ్‌కు చెందిన కోటేష్ (35) అనే మిలీషియా దళ సభ్యుడు మృత్యువాత పడగా కొంతకాలంగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా వున్న కాకి కన్నయ్య అనే మిలీషియా కమాండర్ తీవ్రంగా గాయపడ్డాడు. తమను మట్టుబెట్టేందుకు ప్రయత్నించిన మావోయిస్టులు వారు తీసుకున్న గోతిలోనే వారే పడ్డారని పోలీసులు అంటున్నారు.
అడుగడుగునా మందుపాతర్లే
రాష్ట్ర విభజన అనంతరం విలీన మండలాల్లో బాధ్యతలు చేపట్టిన ఆంధ్రా పోలీసులకు ఆది నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కిరణ్‌ను అరెస్టు చేయడంతో పాటు శబరి ఏరియా కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్ నగేష్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. దీనిపై ప్రతీకారంతో వున్న మావోయిస్టులు ఆంధ్రా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ చేపట్టే ఆంధ్రా పోలీసులను టార్గెట్ చేసుకుని అడుగడుగునా మందుపాతర్లు అమర్చుతున్నారు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, పేగ,మల్లంపేట, కలి గుండం ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఏడు సార్లు సుమారు 10 మందు పాతర్లను పోలీసులు వెలికి తీసి నిర్వీర్యం చేశారు. ప్రధానంగా ఏడుగురాళ్లపల్లి, పేగ రహదారిలో ఓసారి డమ్మీ మందు పాతర్లను అమర్చి పోలీసులను కవ్వించారు. మరోసారి నిజమైన మందుపాతర్లను అమర్చారు. పోలీసులు వాటిని ముందుగానే పసిగట్టి మావోయిస్టుల కుతంత్రాలను తిప్పికొట్టడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. పోలీసులను గాయపర్చే క్రమంలో గతంలో సరిహద్దుల్లో బూబీ ట్రాప్‌లను అమర్చే మావోయిస్టులు గత రెండేళ్లుగా ప్రాణ నష్టమే లక్ష్యంగా నేరుగా మందుపాతర్లనే అమర్చుతుండడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. మావోయిస్టుల నియంత్రణే లక్ష్యంగా సరిహద్దుల్లో కూంబింగ్ చేపడుతున్న పోలీసులకు వరుసగా లభ్యమవుతున్న మందుపాతర్లు భారీ సవాల్‌గా మారాయి.
సరిహద్దుల్లో టెన్షన్
మందుపాతర అమర్చే క్రమంలో దళ సభ్యుడు మృతి చెందడం, మరో మిలీషియా కమాండర్ గాయపడి పోలీసులకు పట్టుబడడంతో ఆంధ్రా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటన అనంతరం సరిహద్దుల్లో అదనపు బలగాలతో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేసే అవకాశముంది. మరోవైపు మావోయిస్టులు సైతం ఈ ఘటనపై పోస్ట్‌మార్టం నిర్వహించే అవకాశముండడంతో సరిహద్దు పల్లెల ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.
Advertisement