మందుపాతర పేల్చిన మావోయిస్టులు
సీఆర్‌పీఎఫ్ జవాన్‌కు గాయాలు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
పోలీసుల కాల్పులు.. తప్పించుకున్న మావోయిస్టులు
పెదబయలు/ముంచంగిపుట్టు: కొద్దికాలంగా ప్రశాంతంగా ఉన్న ఏవోబీలో మళ్లీ యుద్ధ వాతావరణం అలుముకుంది. మావోయిస్టులు బుధవారం మందుపాతర పేల్చిన సంఘటనతో మన్యం ఉలిక్కిపడింది. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దు కర్రి ముక్కిపుట్టు పంచాయతీ దూలిపుట్టు గ్రామ సమీపంలో అడ్డతీగల మలుపు వద్ద బుధవారం ఉదయం 8.15 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఒక జవాన్ గాయపడగా మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కూడా కాల్పులు జరిపినప్పటికీ మావోయిస్టులు తప్పించుకుని పారిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం రూడకోట గ్రామంలో నెల రోజులుగా పోలీస్‌ఔట్ పోస్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోజూ ముంచంగిపుట్టు నుంచి రూడకోటకు పీఆర్‌పీఎఫ్ బలగాలు వచ్చి విధులు నిర్వహించి తిరిగి వెళుతుంటాయి. వీరంతా రోజూ నడిచి వెళుతుండటం గమనించిన మావోలు మందుపాతర పేల్చేందుకు ఏర్పాట్లుచేసుకున్నారు. తారు రోడ్డుకు గోతులు ఏర్పడిన ప్రదేశంలో అక్కడ మెటల్ తొలగించి ఐఈడీ (ఇంప్రొవైజ్డ్‌ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) పేలుడు పదార్థాలు అమర్చారు. పోలీసుల రాక కోసం మాటువేసిన మావోలు వాటిని పేల్చారు. పేలుడు పదార్థాలు ఎడవ పక్కన అమర్చడం, తాము కుడివైపున నడుచుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, లేకుంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని జవాన్లు తెలిపారు. 20 మంది జవాన్లు ఒక గ్రూపుగా, కిలోమీటర్ దూరంలో మరో 20 మంది జవాన్లు మరో గ్రూపుగా నడిచి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ఈ సంఘటనలో పెదబయలు సీఆర్‌పీఎఫ్ 198 బెటాలియన్ జవాను శ్రీనివాస్ సాహు కుడి భుజానికి తీవ్ర గాయం కావడంతో అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, పాడేరు ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి విశాఖపట్నానికి తరలించారు. కొండమీద ఉన్న మావోయిస్టులపై 10 రౌండ్లు కాల్పులు జరపగా, సుమారు 10 మంది సాయుధులైన మావోలు బ్యాగులు, తినుబండారాలు వదిలి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూడకోట గ్రామంలో నిర్మిస్తున్న ఔట్ పోస్టుకు కేవలం రెండు కిలోమీటర్లు దూరంలో ఈ సంఘటన జరగడం విశేషం.
15 రోజుల నుంచి రెక్కీ
రూడకోట ఔట్ పోస్టు నిర్మాణానికి సంబంధించి నెల రోజుల నుంచి పోలీసులు ప్రతీ రోజు పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల నుంచి వచ్చి విధులు నిర్వహించి వెళుతున్నారు. ప్రతీ రోజు ముంచంగిపుట్టు నుంచి రూడకోట వరకు 11 కిలోమీటర్లు నడిచి వెళ్లి రావడం గమనించిన మావోయిస్టులు మందుపాతరకు వ్యూహం రచించారు. దూలిపుట్టు అడ్డతీగల మలుపును సేఫ్ పాయింట్‌గా ఎంచుకుని 15 రోజుల నుంచి ఐఈడీ బ్లాస్టింగ్ సామగ్రి అమర్చారు. మొత్తం ఐదు మందుపాతరలు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతంలో రెండు వైపులా కొండలు ఉండడం, కింది నుంచి పోలీసులు కాల్పులు జరిపినా తప్పించుకునే అవకాశం ఉండటతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. ఈ సంఘటనలో 10 మంది మావోలు పాల్గొన్నట్లు సమాచారం. పోలీసులు నడిచి కాకుండా వాహనంపై వెళ్లి ఉంటే పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఐఈడీ పేలుడు సామగ్రి అమర్చడం ఇదే ప్రథమం. ఏవోబీలో పోలీసు ఔట్ పోస్టుల ఏర్పాటును మావోలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఏవోబీలో జల్లెడ
మందుపాతర పేలుడు ఘటనతో పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. నర్సీపట్నం ఓఎస్డీ అట్టాడ బాబూజీ, పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఆధ్వర్యంలో మావోల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. రెండు మండలాల ఏవోబీ సరిహద్దు, సంఘటన ప్రాంతానికి సమీపంలో ఉన్న దూలిపుట్టు, వెచ్చంగి, గొర్రెలమెట్ట, గిద్దులమామిడి గ్రామాల్లో మావోల ఆచూకీ కోసం పోలీసులు అదనపు బలగాలతో గాలిస్తున్నారు. మావోలు వదలివెళ్లిన బ్యాగుల్లో ఏమైనా సమాచారం లభించే అవకాశం ఉందని, నిపుణుల పరిశీలన అనంతరత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఓఎస్డీ తెలిపారు. మందుపాతర ఎన్ని రోజుల వ్యవధిలో అమార్చారు.. ఎవరైనా సహకారం అందించారా.. తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పారు.