మన్యంపై పట్టు కోసం...
సంచలనం కోసం మావోయిస్టులు...
ఎదురుదాడే వ్యూహంగా పోలీసులు
వేడెక్కుతున్న మన్యం
డిసెంబర్ 2 నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు
{V>Ò$× ప్రాంతాల్లో పర్యటించొద్దు :
{పజాప్రతినిధులకు పోలీసుల సూచన
విశాఖపట్నం : మన్యం మరోసారి వేడెక్కుతోంది. 15వ పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో అటు మావోయిస్టులు ఇటు పోలీసు బలగాలు ఏజెన్సీపై పట్టు కోసం వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టులు డిసెంబర్ 2 నుంచి 9వరకు పీఎల్‌జీఏ 15వ వారోత్సవాలు నిర్వహించనున్నారు. 2001-03 మాదిరిగా పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా సంచలనం సృష్టించేందుకు మావోయిస్టులు సిద్ధపడుతున్నారన్న సమాచారం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ఛత్తీస్‌గఢ్ నుంచి గుత్తికోయలలను అడ్డంపెట్టుకుని యాక్షన్ బృందాలు మన్యంలోకి ప్రవేశించాయన్న సమాచారం కొంత కలవరపరుస్తోంది. దాంతో ఎదురదాడే సరైన వ్యూహమని పోలీసు ఉన్నతాధికారులు కార్యాచరణకు సంసిద్ధమవుతున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ త్రిముఖ వ్యూహానికి తెరతీశారు. మన్యంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నందున మైదాన ప్రాంతాల్లో కూడా పర్యటించవద్దని ప్రజాప్రతినిధులకు సూచిస్తుండటం గమనార్హం.
మూడంచెల వ్యూహంతో పోలీసులు..
ఏదైనా సంచలనం కోసం మావోయిస్టులు సిద్ధపడేలోగా తామే ఎదురుదాడి చేయాలన్నది పోలీసుల వ్యూహంగా ఉంది. అందుకోసం గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ, సీఆర్‌పీఎఫ్ బలగాలను భారీగా ఏజెన్సీలో మొహరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3వేల మందిని ఏజెన్సీలోకి దింపినట్లు సమాచారం. ఈ నెలాఖరుకు మరికొన్ని బలగాలను కూడా ఏజెన్సీలోకి పంపించాలని భావిస్తున్నారు. మావోయిస్టు కీలక నేతలు, యాక్షన్ బృందాలు ఉండొచ్చని భావిస్తున్న జెర్రెల, కన్నవరం, గన్నవరం, కోరుకొండ, బలపం, సీలేరు తదితర కీలక ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఖమ్మం, తూర్పుగోదావరి, ఒడిశా, చత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతాన్ని పూర్తిగా గ్రేహౌండ్స్ దళాలు జల్లెడపడుతున్నాయి. గుత్తికోయలను అడ్డుపెట్టుకుని మావోయిస్టులు చొచ్చుకురాకుండా కట్టడిచేయాలన్నది పోలీసుల వ్యూహంగా ఉంది. మరోవైపు ఏపీఎస్పీ బలగాలు ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో మొహరించాయి. మావోయిస్టులు మెరుపుదాడులు చేస్తే ఎదుర్కొనేందుకు పోలీస్‌స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలను వినియోగిస్తున్నారు.
సంచలనం సృష్టిస్తారా!?
పీఏల్‌జీఏ వారోత్సవాలను పురష్కరించుకుని ఉనికి చాటేందుకు మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. 2001 - 03 మధ్యకాలంలో పీఎల్‌జీఏ వారోత్సవాల్లో మావోయిస్టులు విరుచుకుపడిన సంఘటనలను పోలీసులు ప్రస్తావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గుత్తికోయలలను అడ్డంపెట్టుకుని యాక్షన్ బృందాలు ఏజెన్సీలోకి ప్రవేశించాయని ఉన్నతాధికారులే అంగీకరించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. బాక్సైట్ తవ్వకాలను మావోయిస్టులు వ్యతిరేకిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
భద్రత కల్పించలేం.. పర్యటనలు వద్దు - ప్రజాప్రతినిధులకు పోలీసుల సూచన
బలగాలు మొత్తం మన్యంలో మోహరించడంతో మైదాన ప్రాంతాల్లో భద్రతపై పోలీసు అధికారులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా మావోయిస్టులు ఏదైనా సంచలనానికి పాల్పడే అవకాశం ఉందని కూడా సందేహిస్తున్నారు. కాబట్టి పీఏజీఏ వారోత్సవాలు ముగిసేంతవరకు మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటనపై అనధికారికంగా ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఎవ్వరూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్యటించవద్దని సూచించారు. వీలైనంతవరకు జిల్లా కేంద్రానికే పరిమితం కావాలని చెప్పారు. ఈమేరకు ఓ పోలీసు ఉన్నతాధికారే స్వయంగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి పరిస్థితి తీవ్రతను స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.