అన్నలు’ రాలేదు | annalu raledu | Sakshi
Sakshi News home page

అన్నలు’ రాలేదు

Published Sat, Oct 29 2016 11:40 PM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM

annalu raledu

జంగారెడ్డిగూడెం :
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా పోలీస్‌ శాఖ ‘రెడ్‌ అలర్ట్‌’ను కొనసాగిస్తోంది. ఈ ఘటనల నుంచి తప్పించుకున్న మావోయిస్టులు షెల్టర్‌ జోన్‌గా ఉన్న జిల్లాలోని అటవీ ప్రాంతానికి తలదాచుకునేందుకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఏజెన్సీ ప్రాంత పోలీస్‌ బలగాలు అటవీ ప్రాంతంపై డేగకన్ను వేశాయి. ఇక్కడ తలదాచుకునేందుకు ఇప్పటివరకూ ఒక్కరూ రాలేదని పోలీస్‌ యంత్రాంగం చెబుతోంది. 
ఇంకెందరున్నారో!
ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల్లో దేవరపల్లి మండలం పల్లంట్లకు చెందిన అయినపర్తి దాస్‌ అలియాస్‌ మధు(45), గెడ్డం సువర్ణరాజు అలియాస్‌ కిరణ్‌ (26) ఉండటంతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం కంగుతింది. సహజంగా మావోయిస్టుల వైపు గిరిజన యువతలో కొందరు మావోయిస్ట్‌ ఉద్యమం వైపు ఆకర్షితులవుతుంటారు. అయితే మైదాన ప్రాంతానికి చెందిన మధు, కిరణ్‌ ఇక్కడి నుంచి వెళ్లి.. ఏవోబీ దళాల్లో కీలక పాత్ర పోషించారన్న సమాచారం వారిని ఆశ్చర్యపరిచింది. జిల్లాకు చెందిన ఎంతమంది దళాల్లో ఉన్నారోనన్న దానిపై దృష్టి సారించింది. ఈ విషయంపై నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వెళ్లారు, దళాల్లో ఎవరు ఉన్నారు అనే దానిపై సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. 
కొనసాగుతున్న నిఘా
కాగా, పొరుగు జిల్లాల్లో ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా మావోయిస్టులు పశ్చిమ ఏజెన్సీని షెల్టర్‌ జోన్‌గా వాడుకునే వారు. దీంతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ మన జిల్లాకు దూరంగా ఉండటంతో ఎన్‌కౌంటర్‌నుంచి ఎవరైనా తప్పించుకున్నా తలదాచుకునేందుకు ఇక్కడకు వచ్చే అవకాశం లేదనేది పోలీస్‌ వర్గాల వాదన. అయినప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేసిన నిఘాను కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు , ఏజెన్సీ గ్రామాల్లో విజిబుల్‌ పోలీసింగ్, గ్రామాల సందర్శన కార్యక్రమాలు చేపట్టారు. పోలవరం ప్రాజెక్‌ సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement