jangareddy gudem
-
నిమజ్జనంలో అపశ్రుతి
కొయ్యలగూడెం: ఏలూరు జిల్లాలో వినాయక నిమజ్జనంలో ప్రమాదవశాత్తు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలోని పోతన చెరువులో వినాయక విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షేక్ రియాజ్ (25), ఉక్కుర్తి దొరబాబు (45), దొరబాబు కొడుకు కార్తీక్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయారు. వెంటనే మత్స్యకారుడు పి.రమణ స్పందించి కార్తీక్‌ను కాపాడాడు. పూర్తిగా నీటమునిగిన రియాజ్, దొరబాబులను బయటకు తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్న వారిని జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలిచ్చారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రియాజ్ అవివాహితుడు కాగా, దొరబాబుకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. -
‘పొట్లం’ యువకుడి కథ.. ఏటా రూ.6 కోట్ల టర్నోవర్.. 200 మందికి ఉపాధి
ఆ యువకుడిది.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక సామాన్య రైతు కూలీ కుటుంబం. చిన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయినా, తల్లి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ అతడిని పెంచి పెద్ద చేసింది. పేదరికంతో విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే సాగింది. బీఏ మాత్రమే చదివినా పట్టుదలతో ఐటీ కోర్సులు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. యాక్సెంచర్, విప్రో వంటి ప్రతిష్టాత్మక కంపెనీల్లో పనిచేశాడు. అంతటితో ఆగని ఆ యువకుడు ‘పొట్లం’ పేరుతో ఆహారం, సరుకులను డోర్ డెలివరీ చేసే యాప్‌కు శ్రీకారం చుట్టాడు. చదువుకునేటప్పుడే ఖర్చుల కోసం కిరాణా కొట్టులో పనిచేస్తూ ‘పొట్లం’ కట్టిన ఆ యువకుడు ఇప్పుడు తన సొంత ఊరు జంగారెడ్డిగూడెం కేంద్రంగా 200 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. పొట్లం యాప్ ద్వారా ఐదు పట్టణాల్లో ఆహార పదార్థాలను, నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలను డోర్ డెలివరీ చేస్తున్నాడు. తన వ్యాపారం ద్వారా ఏటా రూ.6 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం... అనే మాటను రుజువు చేస్తున్న ఆ యువకుడే.. శ్రీనివాస్ అలమండ. అతడి స్ఫూర్తిదాయక విజయగాథ ఇది.. సాక్షి, అమరావతి: పేదరికం కారణంగా అలమండ శ్రీనివాస్ ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే సమయంలో ఖర్చుల కోసం అనేక పనులు చేశాడు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ నెలకు రూ.1,500 జీతంతో ఉద్యోగం చేశాడు. ఇంగ్లిష్, అమీర్‌పేటలో ఐటీ కోర్సులు నేర్చుకుని యాక్సెంచర్, విప్రో కంపెనీల్లో 17ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్, కెనడాల్లోనూ కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. అయితే, సొంత ఊరు జంగారెడ్డిగూడెంపై మమకారంతో తిరిగి వచ్చేశాడు. ఏదైనా మొబైల్ యాప్ తయారు చేయాలనే లక్ష్యంతో తన స్నేహితులు హరికృష్ణ, రఘు, సోదరుడు పవన్‌లతో కలిసి జంగారెడ్డిగూడెం కేంద్రంగా 2020లో పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ‘పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్’కు శ్రీకారం చుట్టాడు. లక్ష మందికిపైగా వినియోగదారులు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్‌కు ప్రస్తుతం లక్ష మందికిపైగా వినియోగదారులు ఉన్నారు. పొట్లం యాప్ ద్వారా జంగారెడ్డిగూడెం, ఏలూరు, తణుకు, నర్సీపట్నం, సత్తుపల్లి పట్టణాల్లో వినియోగదారులకు నిత్యం ఘుమఘుమలాడే ఆహార పదార్థాలు, కిరాణా సరుకులు, కూరగాయలు, పండ్లు, మాంసాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. పొట్లం యాప్ ద్వారా శ్రీనివాస్ ఏటా రూ.6 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. పొట్లంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2020లోనే పొట్లం మొదటి డార్క్ స్టోర్ పొట్లం యాప్ ద్వారా వినియోగదారుల నుంచి వచ్చే ఆర్డర్‌కు అనుగుణంగా సరుకులు అందించేలా 2020 ఆగస్టులో జంగారెడ్డిగూడెంలో మొదటి డార్క్స్టోర్ను శ్రీనివాస్ ఏర్పాటు చేశాడు. వినియోగదారులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా పొట్లం ఆన్లైన్ యాప్, ఆఫ్‌లైన్ (ఫోన్ ద్వారా)లో ఆర్డర్ ఇస్తే సరుకులు డార్క్‌స్టోర్ నుంచి సిబ్బంది డోర్ డెలివరీ చేస్తున్నారు. రైతుకి వెన్నుదన్ను.. వ్యవసాయ కూలీ కుటుంబ నేపథ్యం కలిగిన శ్రీనివాస్ పొట్లం యాప్ ద్వారా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా అక్కడికక్కడే మంచి ధర దక్కేలా చేస్తున్నాడు. దీనిద్వారా ఓవైపు రైతులకు దళారీల బాధ లేకుండా మంచి ధర దక్కుతుంటే.. వినియోగదారులకు తాజా కూరగాయలు, పండ్లు తక్కువ ధరకే అందుతున్నాయి. మార్కెట్ ధరల కంటే కనీసం 20 నుంచి 50 శాతం వరకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లను డోర్ డెలివరీ చేస్తున్నాడు. బయట మార్కెట్లో దాదాపు రూ.400 విలువ చేసే 17 రకాల కూరగాయలను కేవలం రూ.199కే డోర్ డెలివరీ ఇస్తున్నాడు. నిరక్షరాసులు సైతం.. ఆన్లైన్ కొనుగోళ్లు చేయాలంటే స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్, చదువు తప్పనిసరి. ప్రస్తుతం బహుళజాతి సంస్థల యాప్‌లన్నీ ఈ కోణంలోనే ఉన్నాయి. కానీ పొట్లం యాప్ మాత్రం వీటికి భిన్నంగా ఆఫ్‌లైన్ విధానంలోనూ సేవలు అందిస్తోంది. పొట్లం వినియోగదారుల్లో చాలామంది స్మార్ట్ ఫోన్ లేనివారే అంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే నేరుగా ఇంటికి సరుకులు పంపే ఏర్పాటు ‘పొట్లం’ ప్రత్యేకత. కరోనా సమయంలోనూ ఉపాధి 2020లో కరోనా సమయంలో పొట్లం యాప్‌ను ప్రారంభించా. ఆ సమయంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల టీచర్లు చాలామంది ఉపాధి కోల్పోయి పొట్లం యాప్‌లో డెలివరీ బాయ్స్‌గా చేరారు. కరోనా కష్టకాలంలో ఏ ఉద్యోగం లేక రోజు గడవడం కష్టమైన చాలామందికి ఉపాధి కల్పించా. ఔత్సాహిక యువతకు మొదటి పది బ్రాంచ్‌లకు పొట్లం ఫ్రాంచైజీ ఉచితంగా ఇస్తా. ఫుల్లీ ఆటోమేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ద్వారా మొత్తం 14 యాప్‌ల అనుసంధానంతో పొట్లం యాప్ పనిచేస్తోంది. పొట్లం ఫ్రాంచైజీని ఉచితంగా ఎవరైనా తమ ప్రాంతంలో తీసుకోవడానికి యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 నాటికి రాష్ట్రంలో ఐదు వేల కేంద్రాలకు పొట్లం యాప్‌ను విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నా. అధునాతన మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లను జోడించి వినియోగదారులకు సేవలందిస్తున్నా. – శ్రీనివాస్ అలమండ, ఎండీ, పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. -
టీడీపీ నేతలు శవాలపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కొడాలి నాని
సాక్షి, అమరావతి: జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సహజ మరణాలను మద్యం మరణాలుగా దుష్రచారం చేయడం తగదని, ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మూడో తేది చనిపోతే ఇప్పుడు రాద్దాంతాం చేస్తున్నారని, ఇదంతా టీడీపీ నాయకులు శవాలపై చిల్లర ఏరుకునే నీచ రాజకీయాలేనని ధ్వజమెత్తారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, ఘాటుగా బదులిస్తామని ఆయన అన్నారు. -
సర్వేలో ఎలాంటి మిస్టీరియస్ మరణాలు నమోదు కాలేదు
-
రెప్పపాటులో 'ఘోరం'.. జల్లేరు వాగులో బస్సు బోల్తా
సమయం మధ్యాహ్నం 12 గంటలు.. పల్లె వెలుగు బస్సు ఓ వంతెనపై వెళుతోంది.దాదాపు నాలుగు గంటలుగా ప్రయాణం.. సాఫీగానే సాగుతోంది... మరో పావు గం టలో గమ్యస్థానం చేరుకోనుండటంతో ప్రయాణికులంతా సిద్ధంగా ఉన్నారు.. అంతలో.. హఠాత్తుగా పెద్ద కుదుపు.. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి బ్రిడ్జిపైనే ఓవర్టేక్ చేసి బస్సు ముందుకు దూసుకొచ్చాడు.. అదుపు తప్పిన బస్సు డివైడర్‌ను ఎక్కి వంతెన ఎడమ వైపు రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టింది.. తేరుకునేలోపే బస్సు వాగులో పడిపోయింది.. పది ప్రాణాలు నీటిలో కలిశాయి.. పశ్చిమ గోదావరి జిల్లా వేగవరం వద్ద జల్లేరు వాగులో చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. ప్రముఖుల దిగ్భ్రాంతి బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. జంగారెడ్డిగూడెం/జంగారెడ్డిగూడెం రూరల్, ఏలూరు టౌన్: కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకోవాల్సిన బస్సు ప్రయాణం కొన్ని కుటుంబాలకు అంతిమయాత్రగా మారింది. మృతుల కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఒక ప్రాణాన్ని రక్షించే క్రమంలో పది ప్రాణాలు పోయాయి. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివారు జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. అక్కడున్న స్థానికులు తక్షణమే స్పందించగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను కాపాడటంతోపాటు వెంటనే ఆస్పత్రులకు తరలించి వైద్య సాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మరో రూ.2.5 లక్షల చొప్పున అదనంగా పరిహారాన్ని అందించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న పల్లె వెలుగు బస్సు (ఏపీ 37 జడ్ 0193) జల్లేరు వాగు వంతెనపై ఓ ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ప్రమాదానికి గురైంది. ఉదయం 8 గంటలకు బయల్దేరిన ఈ బస్సులో 47 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో వాగులో నీరు నిండుగా ప్రవహిస్తోంది. క్షతగాత్రుల హాహాకారాలతో స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వీఆర్ ఎలీజా, తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జేసీ హిమాన్షు శుక్లా, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు సహాయ చర్యలను పర్యవేక్షించారు. జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు వద్ద సహాయక చర్యల్లో స్థానికులు ఆర్టీసీ తరఫున రూ.2.50 లక్షలు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన సేవలు అవసరమైతే తక్షణమే ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. తీవ్ర గాయాలైన బాధితులకు మెరుగైన వైద్యాన్ని ఆర్టీసీ పర్యవేక్షణలోనే అందిస్తామని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి మృతులకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారని, ఆర్టీసీ తరపున మరో రూ.2.50 లక్షలు అందచేస్తామని చెప్పారు. తొలుత వారిద్దరూ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రి వద్ద విలపిస్తున్న బాధితులు నిమిషాల వ్యవధిలో... ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 20 నిమిషాల్లోనే రెస్క్యూ అక్కడకు చేరుకుంది. క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎస్పీలు డాక్టర్ రవికిరణ్ తదితరులు ఆగమేఘాలపై అక్కడకు వెళ్లారు. సుమారు 4 గంటలకుపైగా శ్రమించిన రెస్క్యూ టీం వాగులో పడిన బస్సును మూడు భారీ క్రేన్ల సాయంతో వెలికి తీసింది. క్షతగాత్రులకు తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుల వివరాలు.... పసుపులేటి రాజారావు (సూర్యారావుపాలెం–ఉండ్రాజవరం), కె.హరినాథ్‌బాబు (నల్లజర్ల), కవ్వాడి కామరాజు (గోపన్నగూడెం–అశ్వారావుపేట), సత్తెనపల్లి కృష్ణవేణి (తాళ్లపూడి), సత్తెనపల్లి పద్మారావు (తాళ్లపూడి), చోడేదేవి (పూసర్ల–వేలేరుపాడు), చోడే సీతమ్మ (పూసర్ల–వేలేరుపాడు), మల్లిడి సోమశేఖర్‌రెడ్డి (రామవరం–అనపర్తి), కోట మనీషా(కుక్కునూరు), కోట ముత్యాలు (కుక్కునూరు), ఎం.లక్ష్మి (జంగారెడ్డిగూడెం), కె.నాగమ్మ (దేవులపల్లి), పంపన శకుంతలదేవి (గొల్లగూడెం–ద్వారకాతిరుమల), కె.కీర్తి (నాగిగూడెం–కుక్కునూరు), కోట ప్రశాంతి (కుక్కునూరు), తాటి సుబ్బలక్ష్మి (తోటపల్లి–బుట్టాయగూడెం),కె.సులోచన (నాయుడుగూడెం– కుక్కునూరు), పాయం శివ (భద్రాచలం), పాయం రమేష్ (పండువారిగూడెం), ఉమ్మడి దుర్గ (టి.నర్సాపురం), జి.రవిశేఖర్ (కరిచెర్లగూడెం), పసుపులేటి మంగ (సూర్యారావుపాలెం), కేత వరలక్ష్మి, కండెల్లి స్వప్న (గోపాలపురం), ఉండ్రాజవరపు గీతికాన్షి (జి.కొత్తపల్లి–ద్వారకాతిరుమల). ఈత రావడంతో.. బస్సు ముందు సీట్లల్లో కూర్చున్నాం. హఠాత్తుగా వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం వేగంగా రావడంతో తప్పించే క్రమంలో వంతెనను ఢీకొని బస్సు వాగులో పడిపోయింది. ఈత రావడంతో వాగులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాం. స్థానికులు, మత్స్యకారులు వెంటనే స్పందించి నాటు పడవలు, తాళ్ల సాయంతో గాయపడ్డ వారిని రక్షించారు. – శివ, రమేష్, భద్రాచలం (ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షులు) ఆర్డీవోతో విచారణ కమిటీ క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే ఆయన వెంటనే జంగారెడ్డిగూడెం చేరుకుని గాయపడ్డవారిని పరామర్శించారు. స్వల్ప గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ 9 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై ఆర్డీవో స్థాయి అధికారితో కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 9 మంది ప్రయాణికులు మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. సీఎం జగన్ సానుభూతి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాకు ఆదేశం సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోదీ బాసట సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నట్లు పేర్కొన్నారు. బాధాకరం: మండలి చైర్మన్ సాక్షి,అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ శాసనమండలి చైర్మన్ మోషెన్ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు వెనువెంటనే ప్రభుత్వం స్పందించి సత్వరంగా రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సకోసం జంగారెడ్డిగూడెం, ఏలూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారని పేర్కొన్నారు. ఘటనపై సత్వరమే స్పందించి, విచారణకు ఆదేశించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ: పొగాకు రైతుకు ప్రభుత్వ దన్ను
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతుకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఏళ్ల తరబడి పంట అమ్ముకోవడంలో ఇబ్బందులు పడుతూ.. ఏటా నష్టపోతున్న పొగాకు రైతులకు ఈ సంవత్సరం ఉపశమనం లభించింది. దర్జాగా పంటను అమ్ముకున్నారు. రెక్కలుముక్కలు చేసుకుని పండించినా.. వ్యాపారుల చేతుల్లో మోసపోతున్న రైతుకు అండగా నిలవాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. వ్యాపారులతో పోటీపడి పొగాకును కొనుగోలు చేయించారు. దీంతో వ్యాపారులు కూడా ధరపెంచి కొనక తప్పలేదు. మార్క్‌ఫెడ్ దాదాపు రూ.128.65 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేలం గతనెల 29న పూర్తయింది. లోగ్రేడ్ పొగాకు లక్ష్యంగా.. 1977లో పొగాకు బోర్డు ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు వేలం కేంద్రాల్లో వ్యాపారులు, ఎగుమతిదారులు చెప్పిందే ధరగా నడిచేది. లోగ్రేడ్ పేరిట ధరలను మరింత తగ్గించేవారు. వారు చెప్పిన ధరకే.. రైతుకు అమ్ముకోక తప్పేదికాదు. రైతు కష్టాలు తెలిసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వ్యాపారులు కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి ఆగస్టు ఒకటిన మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. మొత్తం 18 వేలం కేంద్రాల్లోనూ రంగంలోకి దిగిన మార్క్‌ఫెడ్ అధికారులు.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలో రూ.85 వంతున లోగ్రేడ్ పొగాకు కొనుగోలును లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో వ్యాపారుల్లో కలవరం మొదలైంది. లోగ్రేడ్ బేళ్లన్నీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తే చివరకు తమ వ్యాపారమూలాలు కదులుతాయని తాము కూడా పోటీపడి లోగ్రేడ్ బేళ్ల కొనుగోలు మొదలుపెట్టారు. దీంతో లోగ్రేడ్ పొగాకు ధరలకు రెక్కలొచ్చాయి. కొందరు వ్యాపారులు, ఐటీసీ, పీఎస్ఎస్, జీపీఐ తదితర కంపెనీల ప్రతినిధులు పోటీపడి లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేశారు. మార్క్‌ఫెడ్ రూ.128.65 కోట్ల విలువైన 12.93 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసింది. దీన్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలోని వెల్లంపల్లి వేలం కేంద్రంలోనే రూ.13.30 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది. తగ్గిన నో బిడ్లు.. గతంలో వేలం కేంద్రాల్లో కొన్ని బేళ్లను వ్యాపారులు తిరస్కరించేవారు (నో బిడ్). గతంలో ప్రతి వేలం కేంద్రంలో 100 నుంచి 150 బేళ్ల వరకు నో బిడ్ పేరిట తిరస్కరించేవారు. అంటే మొత్తం వచ్చిన బేళ్లలో 35 నుంచి 40 శాతం బేళ్లు తిరస్కరణకు గురయ్యేవి. దీంతో ఏటా బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల మేర రైతుకు నష్టం వచ్చేది. ఈ ఏడాది నో బిడ్ల శాతం పదికన్నా తగ్గింది. దీంతో పొగాకు రైతులు ఈ ఏడాది నష్టాలు లేకుండా బయటపడ్డారు. (చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్) రాష్ట్రంలో 18 పొగాకు వేలం కేంద్రాలు రాష్ట్రంలో ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగాకు పండిస్తారు. ఈ పంట కొనుగోలుకు నాలుగు జిల్లాల్లో 18 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఇవి ప్రకాశం జిల్లాలో 10 (ఒంగోలు, టంగుటూరు, కందుకూరుల్లో రెండేసి, కొండపి, వెల్లంపల్లి, పొదిలి, కనిగిరి), పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు (జంగారెడ్డిగూడెంలో రెండు, దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రెండు (డీసీ పల్లి, కలిగిరి), తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి (తొర్రేడు) ఉన్నాయి. -
‘నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు’
సాక్షి, జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి) : మంచి సినిమాని, నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘నిను వీడని నీడను నేనే’ చిత్ర నిర్మాత, హీరో సందీప్ కిషన్ అన్నారు. ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం విజయోత్సవంలో భాగంగా బుధవారం చిత్ర యూనిట్ జంగారెడ్డిగూడెం వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక జెట్టి గురునాథరావు అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం నిర్మాతగా తనకు తొలి చిత్రం అని, ఏడాది గ్యాప్ తరువాత హీరోగా చేశానన్నారు. సినిమా పోస్టర్‌ను చూసి ప్రేక్షకులు హర్రర్ సినిమా అనుకున్నారని, సినిమాలో చాలా సందర్భాల్లో భయపడ్డామని, కాని చివర్లో కన్నీళ్లు వచ్చాయని వారు పేర్కొనడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఆంజనేయస్వామి అంటే చాలా సెంటిమెంట్ అని సందీప్ కిషన్ అన్నారు. మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్నానని, ఇకపై ప్రతి సినిమాకు ఇక్కడకు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తన తర్వాత చిత్రం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో హన్సిక హీరోయిన్గా ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా తర్వాత పూర్తి కామెడీ చిత్రంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. హీరోయిన్ అన్యాసింగ్ మాట్లాడుతూ నిను వీడని నీడను నేనే చిత్ర కథ, కథనం విభిన్నంగా ఉంటాయన్నారు. మరో నిర్మాత దయ పన్నెం మాట్లాడుతూ చిత్రానికి మంచి ఆదరణ వస్తోందన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుప్రియ కంచర్ల మాట్లాడుతూ చిత్రం కొత్త కథ అని, దర్శకుడు కార్తీక్ రాజ్ చిత్రాన్ని చాలా బాగా తీశారన్నారు. చిత్ర బృందానికి మద్దాల ప్రసాద్, వలవల తాతాజీ, మైరెడ్డి పవన్, వసంతాటి మంగరాజు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివచెర్రి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
జనసేన నాయకులు టిక్కెట్లు అమ్ముకుంటున్నారు
జంగారెడ్డిగూడెం: జనసేన పార్టీ నాయకులు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని, అవినీతిపరులకు టిక్కెట్లు కేటాయిస్తున్నారని జనసేన పార్టీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కమిటీ ఏపీ, తెలంగాణ వైస్ ఛైర్మన్ దువ్వెల సృజన ఆరోపించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె నివాస గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం అసెంబ్లీ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో రూ.2 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అతనికి టిక్కెట్ ఇచ్చారని ఆరోపించారు. జనసేన అభివృద్ధికి కష్టపడిన తనను కాదని, కరాటం సాయి అనే అవినీతి పరుడికి టిక్కెట్ ఇప్పించారని ఆరోపించారు. ఈ విషయమై తాను ప్రశ్నిస్తే టికెట్‌కు రూ.50 లక్షలు అడిగారని పేర్కొన్నారు. డమ్మీ అభ్యర్థిని తెర మీదకు తీసుకురావడానికి గల కారణమేమిటని ప్రశ్నించారు. కష్టపడి పోలవరంలో జనసేన పార్టీని నిలబెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పవన్‌కల్యాణ్‌కు చెప్పటానికి 20 రోజుల నుంచి పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్థానిక నాయకులు అవకాశం ఇవ్వలేదన్నారు. -
రేపు కొయ్యలగూడెంలో జగన్ బహిరంగ సభ
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సభ మంగళవారం కొయ్యలగూడెంలో నిర్వహించనున్నట్టు పార్టీ ఏలూరు లోక్‌సభా స్థానం అభ్యర్థి కోటగిరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు జంగారెడ్డిగూడెం పట్టణం, మండలం నుంచి అ«ధికంగా పార్టీ శ్రేణులు వచ్చి ఆయనకు స్వాగతం పలకాలని కోరారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని, కార్యకర్తలు గ్రామాల్లో చురుగ్గా పర్యటిస్తూ వైఎస్సార్ నవరత్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ 20 రోజులు పార్టీ కార్యకర్తలు కష్టించి పనిచేసి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలన్నారు. జగన్ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. కల్లబొల్లి హామీలతో మోసం చేస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎవరికి ఎటువంటి అవసరమొచ్చినా తాను అందుబాటులో ఉంటానని, తనను ఎప్పుడైనా కలవవచ్చని శ్రీధర్‌బాబు చెప్పారు. జగన్మోహన్రెడ్డి సభకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మండవల్లి సోంబాబు, పాశం రామకృష్ణ. పట్టణ అధ్యక్షుడు పీపీఎన్ చంద్రరావు, మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చనమాల శ్రీనివాస్, ఏలూరు పార్లమెంటరీ జిల్లా సంయుక్త కార్యదర్శులు రాఘవరాజు ఆదివిష్ణు, కొయ్య లీలాధరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థిగా శ్రీధర్‌ను ప్రకటించటంపై హర్షం వైఎస్సార్ సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్‌ను పార్టీ అధిష్టానం ప్రకటించటంపై పార్టీ శ్రేణులు జంగారెడ్డిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వందనపు సాయిబాలపద్మ స్వీట్లు పంపిణీ చేశారు. -
తెరచుకోని జలాశయం గేటు.. కరకట్టకు బీటలు!
సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్రకాల్వ జలాశయానికి వరదనీరు పోటెత్తింది. దీంతో అధికారులు జలాశయం నాలుగు గేట్లు ఎత్తి.. 27వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. అయితే, కొంగవారిగూడెం వద్ద ఉన్న ఎర్రకాల్వ జలాశయం మూడో గేటు తెరచుకోలేదు. దీంతో నీటి ప్రవాహం పెరిగి జలాశయం ఎడమ కరకట్ట బీటలు వారుతోంది. ఎడమ కరకట్టకు బీటలు రావడంతో దిగువన ఉన్న లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జలాశయానికి వరద పోటెత్తడంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లోని పంటపొలాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. పొంగిపొర్లుతున్న జల్లేరు..! జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో భారీగా వర్షం కురవడంతో జల్లేరు వాగు పొంగింది. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి హైద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఏలూరు రూట్ మీదుగా మళ్లించారు. కొవ్వూరు నుండి వచ్చే వాటిని దేవరపల్లి వద్దనే ఆపి గుండుగోలు, ఏలూరు మీదుగా విజయవాడ పంపిస్తున్నారు. దీనివల్ల ఈజీకే రోడ్డులో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. గుడిలో చిక్కుకున్న 700 మంది భక్తులు జంగారెడ్డిగూడెం గుబ్బల మంగమ్మగుడికి వెళ్లిన భక్తులు వర్షాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఆలయ కమిటీకి చెందిన వారితోపాటు భక్తులు మొత్తం 700 మందికిపైగా గుడి వద్ద ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాగులు ఒక్కసారిగా పొంగడంతో వారు బయటకు రావడం సాధ్యం కాలేదు. గుడి దగ్గర చిక్కుకున్న వారిని పోలీసులు సురక్షితంగా కొండపైకి తరలించారు. స్థానిక ఏఎస్ఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా వారి దగ్గరుండి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నారు. అతికష్టం మీద దేవాలయం వద్దకు చేరుకున్న బుట్టాయిగూడెం పోలీసులు.. ఇప్పటివరకు 200 మందిని సురక్షితంగా కాపాడారు. ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యల్లో పోలీసులతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, రెవెన్యూ, రవాణాశాఖ సిబ్బంది పాల్గొంటున్నారు. బుట్టాయగూడెంలో వరదల్లో చిక్కుకున్న భక్తుల క్షేమసమాచారంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. భక్తులు అందరూ సురక్షితంగా ఉన్నారని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ తెలిపారు. గుబ్బల మంగమ్మ భక్తుల వెంట పోలీసులు ఉన్నారని చెప్పారు. తప్పిపోయిన భక్తుడిని కూడా అగ్నిమాపక సిబ్బంది కాపాడారన్నారు. అలాగే కొండవాగు ఉధృతిపై ముఖ్యమంత్రికి వివరించారు. వరద బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. బాధితులకు ఆహారం, మందులు పంపిణీ చేయాలన్నారు -
నీ భార్య నేనూ పెళ్లి చేసుకుంటాం.. వదిలేయ్
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: ఒక వివాహితతో ఒక యువకుని ప్రేమ వ్యవహారం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఫేస్బుక్ పరిచయంతో యువతిపై ప్రేమను పెంచుకున్న ఆ యువకుడు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందే ఆ యువతి, ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మూడు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పోలీస్ క్వార్టర్లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ కంపా వెంకటరమణ కుమారుడు కంపా వెంకటేష్ (23) క్వార్టర్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంపా వెంకటేష్‌కు ఫేస్బుక్లో తూర్పుగోదారి జిల్లా రాజమహేంద్రవరం వాంబే కాలనీకి చెందిన ఓ వివాహితతో పరిచయమైంది. ఆమె రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు వద్ద ఒక బ్యూటీ పార్లర్లో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కంపా వెంకటేష్ ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. వివాహిత అమ్మమ్మది జంగారెడ్డిగూడెం కావడంతో వెంకటేష్‌కు, వివాహితకు మధ్య స్నేహం పెరిగింది. దీంతో వెంకటేష్ ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వివాహిత భర్తకు వెంకటేష్ ఫోన్ చేసి ‘నీ భార్య నేను పెళ్లి చేసుకుంటామని, ఆమెను వదిలివేయాలని’ చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె భర్త గత నెలలో రాజమహేంద్రవరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వివాహిత వెంకటేష్‌కు ఫోన్ చేసి తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని, నువ్వే కారణమని చెప్పి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని వెంకటేష్‌కు తెలిపింది. గత నెలలో వివాహిత జంగారెడ్డి గూడెం వచ్చింది. తర్వాత వెంకటేష్ వివాహితను తన స్కూటీపై ఎక్కించుకుని రాజమహేంద్రవరం వెళ్లారు. కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో వివాహిత కొవ్వూరు బ్రిడ్జి మీద నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై అప్పట్లో కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేష్‌ను విచారించారు. అప్పటి నుంచి అన్యమనస్కుడైన వెంకటేష్ చివరికి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై అల్లు దుర్గారావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితతో ప్రేమ వ్యవహారం ముగ్గురు ఆత్మహత్య
-
వివాహితతో ప్రేమ వ్యవహారం: ముగ్గురు బలి
సాక్షి, పశ్చిమ గోదావరి: జంగారెడ్డి గూడెంలో విషాదం చోటుచేసుకుంది. వివాహితతో ప్రేమ వ్యవహారం ముగ్గురి చావులకు కారణమైంది. పచ్చని సంసారంలో చిచ్చురేపింది. ఇప్పటికే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోగా తాజాగా.. ఈ వ్యవహారానికి బాధ్యుడిగా భావిస్తున్న యువకుడు కూడా శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. జంగారెడ్డి గూడేనికి చెందిన మురళికి రాజమండ్రికి చెందిన బిందుతో కొన్నాళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయమైంది. బిందు లక్కవరంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన క్రమంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మరికొంత కాలానికి బిందు భర్త సాయికి ఫోన్ చేసిన మురళి.. బిందు తనను ప్రేమిస్తోందనీ, ఆమెను తనకు వదిలేయాలని చెప్పాడు. మురళి మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన సాయి గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక బిందు గోదారిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మరణాలపై పోలీసులు మురళిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో మురళి శుక్రవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మురళి తండ్రి కానిస్టేబుల్ కావడం గమనార్హం. -
కాళ్లీడ్చాలిందే
పింఛను సొమ్ముల కోసం పండుటాకుల పాట్లు గత నెలలో బ్యాంకుల చుట్టూ.. ఇప్పుడు జన్మభూమి సభల చుట్టూ ప్రదక్షిణలు జంగారెడ్డిగూడెం : ఈ నెలలోనూ పింఛను బాధలు తప్పడం లేదు. ప్రభుత్వం జన్మభూమిమా ఊరు పేరిట పేరిట నిర్వహించే గ్రామ సభల్లో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించడంతో ఈనెల 11వ తేదీ వరకు పింఛనుదారులకు సొమ్ము అందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఈ నెలలోనూ పింఛను కోసం అవస్థలు ఎదుర్కోవాల్సిన దుస్థితి దాపురించింది. డిసెంబర్ నెల పింఛను సొమ్ముల కోసం వారంతా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చాలామందికి నేటికీ ఆ నెల పింఛను అందలేదు. తాజాగా, జనవరి నెల పింఛను సొమ్మును జన్మభూమి సభల్లో ఇవ్వనుండటంతో కష్టాలు తప్పడం లేదు. ఎక్కడిస్తారు.. ఎప్పుడిస్తారు పింఛను సొమ్మును ఏ వార్డులో, ఎప్పుడు ఇస్తారనేది లబ్దిదారులకు స్పష్టంగా తెలియజేయకపోవడంతో వారంతా ఎక్కడ జన్మభూమి సభ జరిగితే అక్కడకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. వృద్ధులైతే నడవలేని స్థితిలో కాళ్లీడ్చుకుంటూ జన్మభూమి సభలు నిర్వహించే ప్రాంతాలకు వెళుతున్నారు. తీరా అక్కడికి వెళితే మీ వార్డులో జరిగే జన్మభూమి సభలో సొమ్ములిస్తారంటూ వెనక్కి పంపేస్తున్నారు. గతంలో ప్రతినెలా 5వ తేదీలోగా పింఛన్‌దారులందరికీ ప్రభుత్వ సిబ్బంది సొమ్ములు పంపిణీ చేసేవారు. నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన అనంతరం పింఛన్‌దారుల పరిస్థితి మారిపోయింది. నవంబర్ నెలకు పింఛన్ అందడంతో పెద్ద నోట్ల రద్దు ప్రభావం కనిపించకపోయినా.. డిసెంబర్ నెలలో లబ్దిదారులు నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. వారి ఖాతాల్లో పింఛను సొమ్ము జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. పెన్షనర్లంతా బ్యాంకుల నుంచి సొమ్ము తీసుకోవచ్చని భావించారు. చాలామందికి ఖాతాలు లేకపోవడంతో, ఉన్నా లావాదేవీలు నిర్వహించకపోవడంతో రద్దు కావడం.. బ్యాంకుల చుట్టూ తిరిగినా ఖాతాల పునరుద్ధరించకపోవడం.. ఖాతా ఒక బ్యాంకులో ఉంటే మరో బ్యాంకులో సొమ్ము జమ చేయడం వంటి సమస్యలతో సతమతమయ్యారు. ఖాతాలు ఉన్న లబ్దిదారులకు సొమ్ములు జమ కాలేదు. దీంతో అనేకమంది వృద్ధులు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ నెలంతా కాళ్లరిగేలా తిరిగారు. అయినా చాలా మందికి నేటికీ పింఛను డబ్బు అందలేదు. నడవలేని వారికి గ్రామసభలు ముగిశాకే.. లబ్దిదారుల్లో చాలామందికి ఈ నెల 11వ తేదీ వరకు పింఛను సొమ్ము అందదు. గతంలో 5వ తేదీలోగా పింఛను సొమ్ము తీసుకునేందుకు రాలేని వారిని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారిని, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారిని గుర్తించి.. 5వ తేదీ తరువాత సిబ్బంది ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి జన్మభూమి సభలు పూర్తయ్యాక అయినా ఇళ్లకు వెళ్లి సొమ్ములు అందిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలావుంటే.. జన్మభూమి సభలకు పింఛనుదారులు మాత్రమే వస్తున్నారు. చాలాచోట్ల 50 నుంచి 100 మంది పింఛనుదారులతో గ్రామసభలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. -
అన్నలు’ రాలేదు
జంగారెడ్డిగూడెం : ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా పోలీస్ శాఖ ‘రెడ్ అలర్ట్’ను కొనసాగిస్తోంది. ఈ ఘటనల నుంచి తప్పించుకున్న మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా ఉన్న జిల్లాలోని అటవీ ప్రాంతానికి తలదాచుకునేందుకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఏజెన్సీ ప్రాంత పోలీస్ బలగాలు అటవీ ప్రాంతంపై డేగకన్ను వేశాయి. ఇక్కడ తలదాచుకునేందుకు ఇప్పటివరకూ ఒక్కరూ రాలేదని పోలీస్ యంత్రాంగం చెబుతోంది. ఇంకెందరున్నారో! ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల్లో దేవరపల్లి మండలం పల్లంట్లకు చెందిన అయినపర్తి దాస్ అలియాస్ మధు(45), గెడ్డం సువర్ణరాజు అలియాస్ కిరణ్ (26) ఉండటంతో జిల్లా పోలీస్ యంత్రాంగం కంగుతింది. సహజంగా మావోయిస్టుల వైపు గిరిజన యువతలో కొందరు మావోయిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షితులవుతుంటారు. అయితే మైదాన ప్రాంతానికి చెందిన మధు, కిరణ్ ఇక్కడి నుంచి వెళ్లి.. ఏవోబీ దళాల్లో కీలక పాత్ర పోషించారన్న సమాచారం వారిని ఆశ్చర్యపరిచింది. జిల్లాకు చెందిన ఎంతమంది దళాల్లో ఉన్నారోనన్న దానిపై దృష్టి సారించింది. ఈ విషయంపై నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వెళ్లారు, దళాల్లో ఎవరు ఉన్నారు అనే దానిపై సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. కొనసాగుతున్న నిఘా కాగా, పొరుగు జిల్లాల్లో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా మావోయిస్టులు పశ్చిమ ఏజెన్సీని షెల్టర్ జోన్‌గా వాడుకునే వారు. దీంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆంధ్రా ఒడిశా బోర్డర్ మన జిల్లాకు దూరంగా ఉండటంతో ఎన్కౌంటర్నుంచి ఎవరైనా తప్పించుకున్నా తలదాచుకునేందుకు ఇక్కడకు వచ్చే అవకాశం లేదనేది పోలీస్ వర్గాల వాదన. అయినప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసిన నిఘాను కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు , ఏజెన్సీ గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్, గ్రామాల సందర్శన కార్యక్రమాలు చేపట్టారు. పోలవరం ప్రాజెక్ సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. -
మద్ది ఆలయ హుండీ ఆదాయం రూ.17 లక్షలు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. 52 రోజులకు ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.17,06,268 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. నోట్ల రూపంలో రూ.15,78,406, నాణేల రూపంలో రూ.1,27,862, 3 విదేశీ కరెన్సీలు లభించాయి. కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయ ఈవో యాళ్ల శ్రీథర్ పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, నోవా విద్యార్థులు, కరూర్ వైశ్యాబ్యాంక్ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. -
పరువు తీసేపనులు చేయొద్దు
ఏలూరు (మెట్రో) : జిల్లా పరువు తీసే పనులు చేయవద్దని, జంగారెడ్డిగూడెంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాకుండా అక్టోబర్ 2 నాటికి బహిరంగ మలవిసర్జన లేని పట్టణంగా తీర్చిదిద్దనున్నట్టు ప్రభుత్వానికి ఎందుకు చెప్పారని కలెక్టర్ కె. భాస్కర్ జంగారెడ్డిగూడెం మునిసిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. సోమవారం పారిశుధ్యంతో పాటు వివిధ అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో సమీక్షించారు. చేసిన అభివృద్ధి పనులు చెప్పాలి కానీ పనులు పూర్తి చేయకుండానే బహిరంగ మలవిసర్జన లేని మునిసిపాలిటీగా ఎలా ప్రకటిస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. దోమలపై విద్యార్థులకు పరీక్షలు జిల్లాలో పదో తరగతిలోపు విద్యార్థులకు దోమలపై పరీక్ష నిర్వహించి 50 మార్కులు సైన్స్ సబ్జెక్టులో కలుపుతామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పా రు. కలెక్టరేట్లో దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత ప్రచార పోస్టర్‌ను సోమవారం ఆయన విడుదల చేశా రు. నవంబర్ 1న విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. -
దోమలపై విద్యార్థులకు పరీక్షలు
ఏలూరు (మెట్రో) : జిల్లా పరువు తీసే పనులు చేయవద్దని, జంగారెడ్డిగూడెంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాకుండా అక్టోబర్ 2 నాటికి బహిరంగ మలవిసర్జన లేని పట్టణంగా తీర్చిదిద్దనున్నట్టు ప్రభుత్వానికి ఎందుకు చెప్పారని కలెక్టర్ కె. భాస్కర్ జంగారెడ్డిగూడెం మునిసిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. సోమవారం పారిశుధ్యంతో పాటు వివిధ అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో సమీక్షించారు. చేసిన అభివృద్ధి పనులు చెప్పాలి కానీ పనులు పూర్తి చేయకుండానే బహిరంగ మలవిసర్జన లేని మునిసిపాలిటీగా ఎలా ప్రకటిస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. దోమలపై విద్యార్థులకు పరీక్షలు జిల్లాలో పదో తరగతిలోపు విద్యార్థులకు దోమలపై పరీక్ష నిర్వహించి 50 మార్కులు సైన్స్ సబ్జెక్టులో కలుపుతామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పా రు. కలెక్టరేట్లో దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత ప్రచార పోస్టర్‌ను సోమవారం ఆయన విడుదల చేశా రు. నవంబర్ 1న విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. -
32.2 మి.మీ వర్షపాతం నమోదు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 32.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ఎం.బాలకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలో అత్యధికంగా 147.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవగా అత్యల్పంగా పెదపాడు, మొగల్తూరు మండలాల్లో 0.4 మిల్లీమీటర్లు నమోదైంది. మిగిలిన మండలాల్లో కొయ్యలగూడెంలో 119.2, కామవరపుకోటలో 108.2, గోపాలపురంలో 101.4, బుట్టాయిగూడెంలో 100.8, పోలవరంలో 92.2, జీలుగుమిల్లిలో 82.6, కుక్కునూరులో 82.2, తాళ్లపూడిలో 62.2 మి.మీ వర్షపాతం నమోదైంది. చింతలపూడిలో 60.4, కొవ్వూరులో 53.6, టి.నరసాపురంలో 52.4, వేలేరుపాడులో 50.4, ద్వారకాతిరుమలలో 46.4, దేవరపల్లి, తణుకులో 29.6, పెంటపాడులో 29.4, పెరవలిలో 25, నల్లజర్లలో 21.4 మి.మీ వర్షం కురిసింది. పెనుగొండలో 21.2, ఇరగవరంలో 19.2, పోడూరులో 18, ఉండ్రాజవరంలో 17.4, తాడేపల్లిగూడెంలో 16.4, అత్తిలి, ఆచంటలలో 15.4, వీరవాసరంలో 15, నిడమర్రులో 14.8, నిడదవోలులో 12.2, చాగల్లులో 11.4, ఉంగుటూరులో 11.2, యలమంచిలిలో 8.2, గణపవరంలో 8, పాలకోడేరులో 7.4, పెనుమంట్రలో 6.8, దెందులూరులో 6.2, పాలకొల్లులో 5, భీమడోలులో 4.2, భీమవరంలో 3.4, ఏలూరు, ఆకివీడులలో 3, లింగపాలెం, కాళ్లలో 2, పెదవేగిలో 1.8, నరసాపురంలో 1.4, ఉండిలో 0.6 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైందని సీపీవో తెలిపారు. -
వోల్వో బస్సు, లారీ ఢీ: ఏడుగురికి గాయాలు
జంగారెడ్డిగూడెం: లారీ, వోల్వో బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు సహా లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులోని ఆరుగురు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మంత్రి పీతలకు తమ్ముళ్ల షాక్
పంగిడిగూడెంలో సొంత పార్టీ నేతలే అడ్డగింత ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ ప్రారంభోత్సవం రసాభాస జంగారెడ్డిగూడెం : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు సొంత పార్టీ నేతల నుంచే చుక్కెదురైంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల మంచినీటి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆమెను ఓ వర్గం నేతలు అడ్డగించారు. తమకు న్యాయం జరిగే వరకు మంచినీటి పథకాన్ని ప్రారంభించేది లేదంటూ భీష్మించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కోట రమేష్ అనే వ్యక్తి గత నెల 20న తనను అకారణంగా కొట్టాడని, ఈ విషయాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కేసు కూడా నమోదు చేయలేదని టీడీపీ నేత బేతాళ రమేష్ మంత్రి సుజాత దృష్టికి తీసుకెళ్లారు. కోట రమేష్‌కు మరోవర్గం వారు మద్దతు పలుకుతున్నారని బేతాళ రమేష్, అతని అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ శ్రేణులే తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వద్ద వాపోయాడు. దీనిపై మంత్రి పెద్దగా పట్టించుకోకపోవడంతో బేతాళ రమేష్, అతడి వర్గీయులు తమకు న్యాయం చేసే వరకు మంచినీటి పథకాన్ని ప్రారంభించేది లేదంటూ మంత్రిని అడ్డుకున్నారు. దీంతో రెండో వర్గం వారు రంగంలోకి పరస్పర దూషణలకు దిగారు. రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక సమయంలో మంత్రి స్వయంగా ఒక వర్గం వారికి కొమ్ముకాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోయి అరుపులు, కేకలు వేసుకోవడం ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి సుజాత పార్టీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. కావాలనే ఈ గొడవ పెట్టించారా అంటూ కార్యకర్తలపై మంత్రి మండిపడ్డారు. గొడవ జరుగుతుండగానే మంచినీటి పథకం ప్రారంభాన్ని మమ అనిపించి వెళ్లిపోయారు. ఇసుక తరలింపునకు సంబంధించి అధికారపార్టీ నేతలైన బేతాళ రమేష్, కోట రమేష్‌ల మధ్య లావేదేవీల విషయంలో వివాదం తలెత్తినట్టు సమాచారం. -
స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న విద్యావికాస్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కన కాల్వలోకి ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను జంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల బస్సు అప్రమత్తతగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇరువర్గాల దాడులు: ఇద్దరి పరిస్థితి విషమం
జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంగారెడ్డి గూడెంలోని ముత్రాస్పేటలో రెండు వర్గాలు గురువారం కత్తులు దూసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జంగారెడ్డి ప్రభుత్వాసుప్రత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ, ఉద్రిక్తత
-
వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ, ఉద్రిక్తత
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు ఇనుపరాడ్లతో దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో నలుగురికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. జంగారెడ్డిగూడెంలో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
ఆ బంగారం దొరికింది...
జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో చోరీకి గురైన 1,700 గ్రాముల బంగారం నాటకీయ పరిణామాల నేపథ్యంలో దొరికింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన బంగారం వ్యాపారి సుందర్ అయ్యర్‌స్వామి పద్మనాభన్ రెగ్జిన్ క్లాత్ సంచిలో ఆ బంగారాన్ని తీసుకుని గురువారం ఇక్కడ ఆర్టీసీ బస్ ఎక్కగా చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న బి.జయలక్ష్మి తన కుమార్తెతో స్వగ్రామమైన నల్లజర్ల వెళ్లేందుకు కంట్రోల్ రూమ్ వద్ద శుక్రవారం కూర్చుని ఉండగా సుమారు 50 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి సంచి తీసుకొచ్చి అది బస్సులో దొరికిందని ఆమెకు అప్పగించి వెళ్లిపోయాడు. జయలక్ష్మి ఆ సంచిని మొదటి అంతస్తులో ఉన్న డిపో క్లర్క్‌కు అప్పగించేందుకు తీసుకువెళ్లింది. అదే సమయంలో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు ఒక వ్యక్తి ఫోన్‌చేసి తనపేరు రాజేష్ అని, ఇంటర్మీడియెట్ చదువుతున్నానని చెప్పాడు. బస్టాండ్‌లో పోయిన బంగారం దొరికిందని, ఒక మహిళ ఆ సంచి తీసుకుని డిపోపైన ఉన్న కార్యాలయానికి వెళుతోందని సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని ఏఎస్సై రామచంద్రరావు ఎస్సై ఎ.ఆనందరెడ్డికి తెలియజేశారు. వెంటనే ఎస్సై, ఏఎస్సై బస్ డిపోకు చేరుకున్నారు. జయలక్ష్మి డిపో మొదటి అంతస్తు మెట్లు ఎక్కుతుండగా ఎస్సై, ఏఎస్సై ఆమెను ఆపి ఆమె వద్ద ఉన్న సంచిని పరిశీలించారు. అందులో బంగారం ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆమెను డీఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. డీఎస్పీ జె.వెంకటరావు బంగారాన్ని పరిశీలించి జయలక్ష్మి నుంచి స్టేట్మెంట్ నమోదు చేశారు. ఈ విషయమై డీఎస్పీని విలేకరులు వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా.. పూర్తి వివరాలు సేకరించలేదని, దర్యాప్తు పూర్తై తరువాత వివరాలు చెబుతామని అన్నారు. బంగారం వ్యాపారి సుందర అయ్యర్‌స్వామి పద్మనాభన్ 1700 గ్రాములు బంగారం పోయిందని ఫిర్యాదు చేయగా, పోలీసులు మాత్రం 170 గ్రాములు మాత్రమే పోయినట్టు కేసు నమోదు చేశారు. శుక్రవారం దొరికిన బంగారం సుమారు 1700 గ్రాములు ఉంటుందని చెబుతున్నారు. -
జంగారెడ్డిగూడెంలో జంట హత్యలు
ప:గో: జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. విజయ పేరుతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న లక్ష్మణరావును కొంతమంది దుండగులు పెట్రోల్ బంక్ సమీపంలో గొడ్డలితో నరికి హత్య చేశారు. లక్ష్మణరావుతో పాటు అడ్డువచ్చిన అతని భార్య తులసిని కూడా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలు గురయ్యారు. ఈ జంట హత్యలకు పాత కక్షలే ప్రధాన కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
'అన్నీ ఫ్రీ.....ఫ్రీ... ఆల్ ఫ్రీ.... అట!'
జంగారెడ్డి గూడెం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సినీనటుడు పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇస్తే జగనన్న తన జీవితాన్ని అంకితం చేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఓటు వేసే ముందు వైఎస్ రాజశేఖరరెడ్డిని తలచుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు పాలక పక్షంతో కుమ్మక్కై రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. విభజనలో కాంగ్రెస్‌తో పాటు చంద్రబాబు నాయుడు ప్రధాన కారకులని షర్మిల విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు లెక్కలేనంత తిక్క అని ఆయనే చెప్పుకుంటారు అని ఆమె ఎద్దేవా చేశారు. సొంతమామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, పూర్తి మద్యపానం నిషేధం అన్నారని, అయితే ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని షర్మిల వ్యాఖ్యానించారు. ఏనాడు పేదల పక్షాన మాట్లాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అధికార దాహంతో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ... మహిళలకు బంగారు మంగళసూత్రాలు, అమ్మాయి పుడితే రూ.5వేలు నగదు, బాలికలకు సైకిళ్లు, పీజీ వరకూ ఉచిత విద్య, యువతకు కోటి ఉద్యోగాలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఇంటికో ఉద్యోగం, ఫ్రీగా సెల్ఫోన్లు ....అంటూ అన్ని ఉచితం...ఉచితం.. అంటూ చంద్రబాబు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
విజయనాదం
సాక్షి, ఏలూరు : ‘వైఎస్సార్ జనభేరి’ ఎన్నికల శంఖారావంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ మంగళవారం రాత్రి జంగారెడ్డిగూడెంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బోసుబొమ్మ సెంటర్లో జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిం చారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు రూ.65 వేల కోట్ల రుణమాఫీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.25 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయి. వీటన్నిటినీ బాబు మాఫీ చేయించగలడా’ అని విజయమ్మ ప్రశ్నించారు. ‘ఎన్ని కల్లో గెలిపిస్తే.. కేంద్రంలో చక్రం తిప్పుతాడంట. రాష్ట్ర ప్రజల కోసమే ఒకనాడు సీఎం పదవిని త్యాగం చేశాడంట. ఎవరయ్యా నీకు సీఎం పదవి ఇస్తానంది’ అని ప్రశ్నించారు. బాబు హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతిందని, 23వేల మంది ఉద్యోగు లు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. వ్యవస్థను, మీడియా ను మేనేజ్ చేయడంలో సమర్థుడైన బాబు అన్ని రం గాలనూ నిర్వీర్యం చేశారన్నారు. రెండే రెండు ఫ్లై ఓవ ర్లు, ఓ హైటెక్ సిటీ భవనాన్ని కట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకోవడం ఆయనకే చెల్లిందని విమర్శిం చారు. ఆయన హయాంలో రాష్ట్రానికి రూ.55 వేల కోట్ల అప్పుల భారం మిగిలిందన్నారు. బీసీలను అన్నివిధాలా అణగదొక్కిన బాబు అధికారం కోసం తెలంగాణలో బీసీలను సీఎం చేస్తానని కొత్త పల్లవి అం దుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరోసారి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ చంద్రబాబు ప్రజలకు మోసపూరిత మైన మాటలు చెబుతున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో పేదలు తినడానికి తిండి లేక, తాగడానికి నీరులేక అనేక ఇబ్బం దులకు గురయ్యారన్నారు .రాష్ట్రంలో కరువు తాండవం చేస్తే కనీసం రైతులను ఆదుకునే దిక్కులేని పరిస్థితి నెల కొందన్నారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు ఆందోళన చేస్తుంటే వారిని జైల్లో పెట్టించేందుకు పూనుకున్నారన్నారు. రైతులు దొరక్కపోతే వారి భార్యలను జైల్లో పెట్టించిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి లాంటి నయవంచకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. జగన్‌బాబును ఆశీర్వదించండి రాష్ట్ర రాజకీయాలను చక్కదిద్ది.. జనరంజకమైన పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిండు మనసుతో ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని విజయమ్మ కోరారు. ఆయన సీఎం అయితే పోల వరం, చింతలపూడి ఎత్తిపోతల పథ కాలు పూర్తి కావడం ఖాయమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్ని గెలిపించండి జంగారెడ్డిగూడెం : మునిసిపల్, అసెం బ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ కోరారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ తోట చంద్రశేఖర్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దాల రాజేష్, జంగారెడ్డిగూడెం చైర్పర్సన్ అభ్యర్థి తల్లాడి వరలక్ష్మిలతోపాటు అన్ని వార్డుల అభ్యర్థులనూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజయమ్మ కోరారు. రాత్రి 10 గంటలైనా... కాగా రోడ్‌షో ఆలస్యమైనా అభిమానులు వేల సంఖ్యలో ఎదురుచూడటం విశేషం. తొలిసారిగా జంగారెడ్డిగూడెం పట్టణానికి వచ్చిన మహానేత సతీమణి వైఎస్ విజయమ్మను చూసేందుకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆమె ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. విజయమ్మ ప్రసంగిస్తున్న సమయంలో జగన్ నినాదాలతో బోసుబొమ్మ సెంటర్ దద్దరిల్లింది. జోహార్ వైఎస్సార్ అంటూ కార్యకర్తల నినాదాలు పట్టణ నలుమూలలకు పాకింది. యువతను చూసిన విజ యమ్మ రేపటి మార్పునకు మీరే ఆయుధాలని, ఓటుతో యుద్ధం చేసి వైఎస్సార్ సీపీని గెలిపించి అభివృద్దికి బాటలు వేయాలని కోరారు. విజయమ్మ వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత తదితరులు ఉన్నారు. -
అంధకారంలో ఏజెన్సీ
40 గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా రైతులను కించపరిచిన షిఫ్ట్ ఆపరేటర్ తీరుకు నిరసనగా విద్యుత్ సబ్ స్టేషన్‌కు తాళం బుట్టాయగూడెంలో రాస్తారోకో, ధర్నా ఆపరేటర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : విద్యుత్ సరఫరా ఎప్పుడు చేస్తారో చెప్పాలని అడిగిన రైతును కించపరుస్తూ మాట్లాడిన జంగారెడ్డిగూడెం సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ బాబూరావు తీరును నిరసిస్తూ రైతులు బుట్టాయగూడెంలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించి తాళాలు వేశారు. ఆపరేటర్ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో 40 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. పోలీసులు జోక్యం చేసుకున్నా షిఫ్ట్ ఆపరేటర్ వచ్చి సమాధానం చెప్పకపోవడంతో రాత్రి 10.15 గంటల వరకూ రాస్తారోకో కొనసాగింది. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం బుట్టాయగూడెం సబ్‌స్టేషన్‌కు గుత్తుల సురేష్ అనే రైతు వచ్చి ఉదయం 11 గంటలైనా విద్యుత్ ఇవ్వకపోవడంపై షిఫ్ట్ ఆపరేటర్ రమేష్‌ను ప్రశ్నించాడు. ఇక్కడ సరఫరా ఉందని జంగారెడ్డిగూడెంలో తీసేయడం వల్ల బయటకు సప్లై ఇవ్వలేదని, కారణం తెలీదని చెప్పాడు. అయితే విద్యుత్ ఎప్పుడు ఇస్తారో కనుక్కోవాల్సిందిగా కోరడంతో దీనిపై రమేష్ అక్కడ నుంచే జంగారెడ్డిగూడెం 132 కేవీ సబ్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి అక్కడి షిఫ్ట్ ఆపరేటర్ బాబూరావును ఇదే విషయం అడిగాడు. విద్యుత్ సరఫరాపై ఇక్కడి రైతులు తనను ప్రశ్నిస్తున్నారని, సరఫరా ఎప్పుడు ఇస్తారో మీరే రైతులకు చెప్పాలంటూ కోరాడు. తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, డిపార్ట్మెంట్ ఫోన్ నుంచి ఎందుకు ఫోన్ చేశావని గుత్తుల సురేష్‌తో రమేష్ అసభ్యకరంగా మాట్లాడాడు. ఇంతలో మరికొంతమంది రైతులు విద్యుత్ విషయమై కార్యాల యానికి రాగా, వారికి ఈ విషయమై సురేష్ వివరించారు. వారు కూడా జంగారెడ్డిగూడెం షిఫ్ట్ ఆపరేటర్‌కు ఫోన్‌చేసి కరెంటు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించగా, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. బాబూరావు తీరును నిరసిస్తూ రైతులు బుట్టాయగూడెం సబ్‌స్టేషన్‌కు తాళాలు వేసి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై బీఎస్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు శాంతింపచేయడానికి ప్రయత్నించారు . ఒక దశలో రైతులకు, పోలీసులకు తీవ్రవాగ్వివాదం జరిగింది. జంగారెడ్డిగూడెం సీఐ మురళీ కృష్ణ, ఏడీఈ శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరు కుని రైతులతో చర్చించారు. షిఫ్ట్ ఆపరేటర్ బాబూరావును శనివారం ఇక్కడకు తీసుకొస్తా మని, లేదంటే అతనిపై కేసు నమోదు చేస్తా మని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. రైతులు చిలక సూరిబాబు, కరాటం నాగరాజు, చింతపల్లి వెంకటేశ్వరరావు, షేక్‌జానీ, కణితి ఉమ, ఆలపాటి ఫణికిషోర్, బిక్కిన వెంకటేశ్వరరావు, ఆండ్రు సురేష్, ఎం.రవి, అందుగుల ఫ్రాన్సిస్, కలగర నాని పాల్గొన్నారు. -
డ్రగ్ రాకెట్ వెనుక దావూద్ ఇబ్రహీం?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో ఉన్న జీడిమెట్ల పారిశ్రామికవాడలో మాదకద్రవ్యాల్ని తయారుచేసి పుణే మీదుగా మలేసియాకు ఎగుమతి చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సీబీ), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. గురువారం ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసిన అధికారులు అంతర్జాతీయ మార్కెట్లో రూ.2 కోట్లకుపైగా విలువ చేసే 11 కేజీల నిషేధిత మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్ ఆర్థిక లావాదేవీలన్నీ హవాలా మార్గంలోనే సాగడంతో ఇందులో మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ దావూద్ ఇబ్రహీం ముఠా ప్రమేయాన్ని అనుమానిస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఓటీ ఓఎస్డీ కె.గోవర్ధన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన కమ్మ శ్రీనివాస్ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సుభాష్‌నగర్‌లో బాలాజీల్యాబ్స్ పేరుతో కంపెనీ పెట్టాడు. ఎమ్మెస్సీ(ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేసిన శ్రీకాకుళం జిల్లా పూతిగలపాడుకు చెందిన పి.మురళీకృష్ణ గతేడాది బాలాజీ ల్యాబ్స్‌లో చేరాడు. వీరిద్దరూ కలిసి తక్కువ కాలంలో తేలిగ్గా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆరు నెలల నుంచి నిషేధిత మాదకద్రవ్యాలైన ఎఫిడ్రిన్, మెథాఫెటామైన్ తయారు చేయడం ప్రారంభించారు. లావాదేవీలన్నీ హవాలా మార్గంలోనే జీడిమెట్లలోని గిరినగర్‌లో ప్లాస్టిక్ వ్యాపారం చేసే శివకుమార్‌కు వీరు మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నారు. అతను వీటిని పుణేలో స్థిరపడిన చెన్నయ్వాసి అబ్దుల్ అజీజ్‌కు అమ్ముతున్నాడు. అజీజ్ అక్కడినుంచి చెన్నయ్‌లోని కొందరు వ్యాపారులకు పంపుతుండగా.. వారిద్వారా వివిధ మార్గాల్లో మలేసియాకు చేరుతున్నాయి. మెథాఫెటామైన్ దేశీయంగా కేజీ రూ.5 లక్షలకు చేతులు మారుతోందని, అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర రూ. 20 లక్షల వరకు ఉన్నట్టు సమాచారం. ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతోనే శివకుమార్ జీడిమెట్లలో రూ.కోటి వెచ్చించి ప్లాస్టిక్ పరిశ్రమ నెలకొల్పాడు. ఈ దందాలో ఆర్థిక లావాదేవీలన్నీ హవాలా మార్గంలోనే చేస్తున్న ముఠా అందుకోసం ఆరుగురు ఏజెంట్లను నియమించుకుంది. వారిలో హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో కేశరియా నావెల్టీస్ నిర్వహిస్తున్న అరవింద్ అలియాస్ శంకర్ ఒకడు. ఇతడు హవాలా డబ్బు డెలివరీకోసం లక్కీసింగ్ అనే వ్యక్తిని నియమించుకున్నాడు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల నేపథ్యంలో ఇటీవల డ్రగ్స్ దందాపై నిఘా పెంచిన ఎస్ఓటీ బాలాజీ ల్యాబ్స్‌తోపాటు సమీపంలోని కార్మోల్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోని కొన్ని రియాక్టర్లలో మెథాఫెటామైన్ డ్రగ్ తయారవుతోందని గుర్తించింది. వెంటనే ఎన్సీబీ ఎస్పీ దినేష్ చవాన్, ఎస్ఓటీ ఓఎస్డీ కె.గోవర్థన్రెడ్డిల నేతృత్వంలో ఈ రెండు విభాగాల ఇన్స్పెక్టర్లు కె.చంద్రశేఖర్, జి.రమేష్, దీపక్‌కుమార్, టి.అనిల్‌కుమార్‌లు గురువారం దాడులు నిర్వహించారు. శివకుమార్, అబ్దుల్ అజీజ్, ఇతడి సహాయకుడు ఇస్మాయిల్ షేక్, శ్రీనివాస్, మురళీకృష్ణల్ని పట్టుకున్నారు. అదే సమయంలో శివకుమార్‌కు రూ.15 లక్షల హవాలా సొమ్ము డెలివరీ ఇవ్వడానికి వచ్చిన లక్కీసింగ్నూ అరెస్టు చేశారు. వీరి నుంచి 11 కేజీల మెథాఫెటామైన్, కారు, రూ.15 లక్షల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాలాజీ ల్యాబ్స్‌ను సీజ్ చేసిన అధికారులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు కార్మోల్ డ్రగ్స్ దందాపైనా ఆరా తీస్తున్నారు. -
ఆగి ఉన్నలారీని ఢీ కొట్టిన ఆటో: ముగ్గురు మృతి
-
ఆగి ఉన్నలారీని ఢీ కొట్టిన ఆటో: ముగ్గురు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్డు వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఆగి ఉన్నలారీని ఆటో ఢీ కొట్టింది. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆ ప్రమాదంలో మరణించిన మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసకున్నారు. అనంతరం మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే లారీని కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తెనపల్లి నుంచి కాకినాడ వెళ్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. -
సమైక్య గళం.. గొంతెత్తిన దళం
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర నినాదం జిల్లాలో దశదిశలా మార్మోగుతోంది. సమైక్యాంధ్ర పరి రక్షణ ఆవశ్యకతను వివిధ కళారీతులతో కళాకారులు చాటుతున్నారు. విభజన వల్ల తలెత్తే కష్టాలు, నష్టాలను నాటికలు, నాట కాల రూపంలో కళ్లముందు సాక్షాత్కరింప చేస్తున్నారు. 38వ రోజైన శుక్రవారం కూడా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాలు జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున సాగారుు. కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో వివిధ వేషధారణలతో కొత్తపేట నూకాలమ్మ గుడి నుంచి భారీ ప్రదర్శన ప్రారంభించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్లో సుమారు గంటసేపు కళా రీతులను ప్రదర్శించి కళాగర్జన చేశారు. రెల్లి కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని విభజన ప్రకటనపై నిరసన తెలిపారు. డీపీవో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన గళమెత్తారు. స్వర్ణకారులు, కుమ్మరి, వడ్రంగి వృత్తిదారులు రోడ్లపైనే పనులు చేసి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెంలో లక్ష జనగళ ఘోష.. తాళ్లపూడిలో లక్ష గళార్చన జంగారెడ్డిగూడెంలో సమైక్యాంధ్ర కోరుతూ లక్ష జనగళ ఘోష కార్యక్రమం నిర్వహిం చారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సమైక్య నినాదాన్ని మారుమోగించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఉద్యమకారులను ఉత్సాహపరిచారు. తాళ్లపూడిలో వర్తక సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు చేసి లక్ష గళార్చన నిర్వహించారు. వేగేశ్వరపురంలో 300 ఆటోలతో ర్యాలీ చేశారు. పాలకొల్లులో యరసింగి శిరీష అనే గృహిణి అమరణ దీక్ష చేపట్టారు. ఆడియో, వీడియో వర్కర్స్ ఆధ్వర్యంలో దీక్షలు జరిగారుు. బీఆర్‌ఎంవీ స్కూల్ విద్యార్థులు రాస్తారోకో చేశారు. పోడూరు మండలం మినిమించిలిపాడులో వంటావార్పు చేపట్టారు. యలమంచిలి మండలం చించినాడ, దొడ్డిపట్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ వద్ద సైనిక దుస్తుల్లో విద్యార్థులు కవాతు నిర్వహించారు. త్యాగధనుల వేషధారణలతో దేశభక్తి గీతాలకు అనుగుణంగా నర్తించారు. గోపన్నపాలెంలోని పార్థసారథి పాఠశాల విద్యార్థులు భిక్షాటన చేసి విభజన ప్రకటనపై నిరసన తెలిపారు. భీమవరం అర్కెస్ట్రా కళాకారులు, అధ్యాపకులు, న్యాయవాదులు, మునిసిపల్ ఉద్యోగులు, ఎన్జీవోలు రిలే నిరాహార దీక్షలు చేశారు. విద్యుత్ శాఖ విశ్రాంత ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నారాయణ స్కూల్ విద్యార్థులు ప్రకాశం చౌక్‌లో మానవహారం నిర్మించారు. నరసాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షల్లో వైద్యులు పాల్గొన్నారు. పీఎంపీలు, మెడికల్ షాపుల యజమానులు వంటావార్పూ చేశారు. ఆచంటలో రైతు సంఘం నాయకులు దీక్షలో కూర్చున్నారు. పెనుమంట్రలో ఉపాధ్యాయులు రిలే దీక్షలు ప్రారంభించారు. పెనుగొండలో స్వర్ణకారులు దీక్షల్లో పాల్గొన్నారు. తణుకులో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్‌లపై విమర్శనాత్మక పాఠాలు చెప్పారు. అత్తిలిలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు చేపట్టిన నిరాహార దీక్షలను వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య సందర్శించారు. కొవ్వూరు జూని యర్ కళాశాల వద్ద ఉపాధ్యాయ జేఏసీ దీక్షలకు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు సంఘీభావం తెలిపారు. కొవ్వూరు మండలం కుమారదేవంలో విద్యార్థులు రోడ్డుపైనే పరీక్షలు రాసి నిరసన తెలిపారు. వాడపల్లిలో విద్యార్థులు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. చింతల పూడి పట్టణంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం చేపట్టారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బంద్ పాటించి రోడ్డుపై వంటావార్పు చేశారు. బుట్టాయగూడెంలోఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఉండి నియోజకవర్గంలో ఉద్యమాలు ఉవ్వెత్తున సాగాయి. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు పాతపాటి సర్రాజు ఉండి సెంటర్లో రోడ్లను ఊడ్చి విభజన ప్రకటనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.