మంత్రి పీతలకు తమ్ముళ్ల షాక్
మంత్రి పీతలకు తమ్ముళ్ల షాక్
Published Fri, Mar 4 2016 1:15 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
పంగిడిగూడెంలో సొంత పార్టీ నేతలే అడ్డగింత
‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ ప్రారంభోత్సవం రసాభాస
జంగారెడ్డిగూడెం : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు సొంత పార్టీ నేతల నుంచే చుక్కెదురైంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల మంచినీటి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆమెను ఓ వర్గం నేతలు అడ్డగించారు. తమకు న్యాయం జరిగే వరకు మంచినీటి పథకాన్ని ప్రారంభించేది లేదంటూ భీష్మించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కోట రమేష్ అనే వ్యక్తి గత నెల 20న తనను అకారణంగా కొట్టాడని, ఈ విషయాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కేసు కూడా నమోదు చేయలేదని టీడీపీ నేత బేతాళ రమేష్ మంత్రి సుజాత దృష్టికి తీసుకెళ్లారు. కోట రమేష్‌కు మరోవర్గం వారు మద్దతు పలుకుతున్నారని బేతాళ రమేష్, అతని అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ శ్రేణులే తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వద్ద వాపోయాడు. దీనిపై మంత్రి పెద్దగా పట్టించుకోకపోవడంతో బేతాళ రమేష్, అతడి వర్గీయులు తమకు న్యాయం చేసే వరకు మంచినీటి పథకాన్ని ప్రారంభించేది లేదంటూ మంత్రిని అడ్డుకున్నారు.
దీంతో రెండో వర్గం వారు రంగంలోకి పరస్పర దూషణలకు దిగారు. రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక సమయంలో మంత్రి స్వయంగా ఒక వర్గం వారికి కొమ్ముకాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోయి అరుపులు, కేకలు వేసుకోవడం ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి సుజాత పార్టీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. కావాలనే ఈ గొడవ పెట్టించారా అంటూ కార్యకర్తలపై మంత్రి మండిపడ్డారు. గొడవ జరుగుతుండగానే మంచినీటి పథకం ప్రారంభాన్ని మమ అనిపించి వెళ్లిపోయారు. ఇసుక తరలింపునకు సంబంధించి అధికారపార్టీ నేతలైన బేతాళ రమేష్, కోట రమేష్‌ల మధ్య లావేదేవీల విషయంలో వివాదం తలెత్తినట్టు సమాచారం.
Advertisement
Advertisement