ntr sujala sravanthi
-
సుజలం.. నిష్పలం!
1003 - పంచాయతీలు 3,312 - గ్రామాలు 39 - ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు సమస్యలు: నిర్వహణ, బోర్లు ఎండిపోవడం, విద్యుత్ ప్రభుత్వ హామీ : ప్రతి గ్రామంలో ఒక వాటర్‌ప్లాంట్ ఇది ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరులో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్. ఎన్నికల సమయంలో ప్రతి గ్రామంలో ఒక శుద్ధ నీటి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఇప్పుడు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటమే భాగ్యంగా మారింది. ఈ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా.. ఆయన మాత్రం సినిమాలకే పరిమితం కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. గ్రామాల్లో వేలల్లో ఉండగా.. ప్లాంట్లు యాభై కూడా దాటని పరిస్థితి. ఇవి కూడా సక్రమంగా పని చేయకపోవడంతో ప్రజలకు ‘పానీ’పట్టు యుద్ధం తప్పడం లేదు. మామూలు నీళ్లిస్తే చాలు ఎన్నికల సమయంలో అన్ని పంచాయతీల్లో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అయితే లేపాక్షిలో మత్రమే ప్లాంట్ ఏర్పాటయింది. అక్కడ కూడా నీటి సరఫరా అరకొరగానే ఉంటోంది. ప్రైవేటు వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లి బిందె నీరు రూ.10, క్యాన్ రూ. 15లతో కొంటున్నాం. మినరల్ వాటర్ కాకపోయినా.. మామూలు నీళ్లిస్తే చాలు. - హనుమంతు, లేపాక్షి -
సుజలాం విఫలాం..!
ఎన్టీఆర్ సుజలకు ఒక్క రూపాయీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం 150 భారీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని పది రోజుల క్రితం ప్రకటన వాటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిందే రూ. 59 కోట్లు అయినా నిధులివ్వని చంద్రబాబు ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఆ పథకానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టామని ఘనంగా చెప్పుకున్నారు. అధికారం చేపట్టినపుడు పెట్టిన ఐదు సంతకాల్లో ఆ పథకాన్నీ చేర్చారు. పేరు ఘనంగా పెట్టి పబ్లిసిటీ చేసుకున్నా ఆ పథకానికి మాత్రం నిధులు ఇవ్వడంలేదు. అదే ఎన్టీఆర్ సుజల పథకం. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించడం పథకం లక్ష్యం. అయితే ఈ పథకం ద్వారా అన్ని గ్రామాల్లో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే ఏడాదికి రూ. 150 నుంచి రూ. 200 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. 2014-15లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. గత బడ్జెట్లో మాత్రం రూ. 11 కోట్లు కేటాయించారు. వాటిల్లోనూ పైసా ఖర్చు పెట్టలేదు. అయితే, ఈ ఏడాది మార్చి చివర నాటికి ఆ రూ. 11 కోట్లలో రూ. 69 లక్షలు ఖర్చు పెడతామంటూ రివైజ్డు బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. 2016-17 బడ్జెట్లో అయితే పైసా కూడా కేటాయించలేదు. దాతలిచ్చిన నిధులే రాష్ట్రంలో మొత్తం 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 821 గ్రామాల్లో 826 మంచినీటి ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. దాతల విరాళాలతో ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడంతో వాటిలో దాదాపు సగం మూత పడేదశకొచ్చాయి. మరోపక్క ఎన్టీఆర్ సుజల పథకంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం.. గ్రామానికో మంచినీటి ప్లాంటు ఏర్పాటుకు బదులు 15 గ్రామాలకొకటి చొప్పన భారీ ప్లాంటు ఏర్పాటు చేయడానికి కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ప్లాంట్‌కు కోటిన్నర వరకు ఖర్చు పెట్టి మూడేళ్లలో రాష్ట్రంలో 1,000 భారీ మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది. ప్లాంటు ఏర్పాటుకయ్యే ఖర్చులో దాతలుగానీ, దానిని నిర్వహించడానికి గాను ముందుకొచ్చే వారు 74 శాతం నిధులు భరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 26 శాతం ఆర్థిక సహాయం చేస్తుందని కొత్త విధానంలో ప్రకటించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే వచ్చే ఏడాది ఒక్కొక్క ప్లాంటుకు రూ. 39 లక్షల చొప్పున 150 భారీ మంచినీటి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 59 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అయినా బడ్జెట్లో మాత్రం పైసా కూడ కేటాయింపులు లేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రస్ఫుటమవుతోంది. -
మంత్రి పీతలకు తమ్ముళ్ల షాక్
పంగిడిగూడెంలో సొంత పార్టీ నేతలే అడ్డగింత ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ ప్రారంభోత్సవం రసాభాస జంగారెడ్డిగూడెం : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు సొంత పార్టీ నేతల నుంచే చుక్కెదురైంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల మంచినీటి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆమెను ఓ వర్గం నేతలు అడ్డగించారు. తమకు న్యాయం జరిగే వరకు మంచినీటి పథకాన్ని ప్రారంభించేది లేదంటూ భీష్మించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కోట రమేష్ అనే వ్యక్తి గత నెల 20న తనను అకారణంగా కొట్టాడని, ఈ విషయాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కేసు కూడా నమోదు చేయలేదని టీడీపీ నేత బేతాళ రమేష్ మంత్రి సుజాత దృష్టికి తీసుకెళ్లారు. కోట రమేష్‌కు మరోవర్గం వారు మద్దతు పలుకుతున్నారని బేతాళ రమేష్, అతని అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ శ్రేణులే తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వద్ద వాపోయాడు. దీనిపై మంత్రి పెద్దగా పట్టించుకోకపోవడంతో బేతాళ రమేష్, అతడి వర్గీయులు తమకు న్యాయం చేసే వరకు మంచినీటి పథకాన్ని ప్రారంభించేది లేదంటూ మంత్రిని అడ్డుకున్నారు. దీంతో రెండో వర్గం వారు రంగంలోకి పరస్పర దూషణలకు దిగారు. రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక సమయంలో మంత్రి స్వయంగా ఒక వర్గం వారికి కొమ్ముకాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోయి అరుపులు, కేకలు వేసుకోవడం ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి సుజాత పార్టీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. కావాలనే ఈ గొడవ పెట్టించారా అంటూ కార్యకర్తలపై మంత్రి మండిపడ్డారు. గొడవ జరుగుతుండగానే మంచినీటి పథకం ప్రారంభాన్ని మమ అనిపించి వెళ్లిపోయారు. ఇసుక తరలింపునకు సంబంధించి అధికారపార్టీ నేతలైన బేతాళ రమేష్, కోట రమేష్‌ల మధ్య లావేదేవీల విషయంలో వివాదం తలెత్తినట్టు సమాచారం. -
‘జన్మభూమి’కి శ్రీకారం
సాక్షి, ఏలూరు : ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం జిల్లాలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మొదటి రోజు ర్యాలీలు,స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద 34 చోట్ల వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. ఏలూరు 26వ డివిజన్లో జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ సదస్సు జరిగింది. రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. 2019 నాటికి సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా... సదస్సులో మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ 2019 అక్టోబర్ 2 నాటికి జిల్లాను సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయూలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్-స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా చూడవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో 75 లక్షల మంది డ్వాక్రా మహిళల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. రూ.2కే 20 లీటర్ల తాగునీరు అందించేందుకు 480 గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవం తి పథకం కింద వాటర్ ప్లాంట్లు నిర్మిస్తున్నామన్నారు. తొలి రోజున 34 ప్లాంట్లను ప్రారంభించామని, 785 చోట్ల ర్యాలీలు జరిగాయని మంత్రి చెప్పారు. జవాబుదారీగా ఉండండి ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ పథకాల అమలు విషయంలో అధికారులు, ప్రజాప్రతి నిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల న్నారు. జిల్లాలో 39 లక్షల జనాభా ఉండగా, వారిలో అర్హులైన 3లక్షల మంది నిరుపేదలకు పింఛన్లు అందించేందుకు ఏటా రూ.350 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోం దని చెప్పారు. శాసనమండలి విప్ అంగర రామ్మోహనరావు మాట్లాడుతూ ప్రతి ఇంటా మరుగుదొడ్డి, ప్రతి గ్రామంలో పారిశుధ్యం, ప్రతి వ్యక్తికి స్వచ్ఛమైన తాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరి సహకారం అవసరమన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం సాధించడానికన్నా పారిశుధ్యమే మిన్న అన్న మహాత్మాగాంధీ సూక్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని ఆలపించే సందర్భంలో కొందరు తడబడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి), నగర మేయర్ షేక్ నూర్జహాన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహాని, జన్మభూమి ప్రత్యేకాధికారి శ్రీధరన్, అదనపు జేసీ సీహెచ్ నరసింగరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.రమణ, డీఆర్డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, డీపీవో ఎ.నాగరాజువర్మ, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీమన్నారాయణ, పంచాయతీరాజ్ ఎస్ఈ వేణుగోపాల్, ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్, నగరపాలక సంస్థ కమిషనర్ కె2 సాధన, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ అధికారి ఆర్.సూయిజ్ పాల్గొన్నారు. -
కాలక్షేపానికి పథకాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుడివాడ : చేతినిండా నిధులుంటేనే ప్రభుత్వ పథకాలు సక్రమంగా ముందుకు సాగటం కష్టం. కానీ, అసలు నిధులు ఇవ్వకుండా పబ్బం గడిపేందుకు ప్రభుత్వం పలు ‘పథకాలు’ రచిస్తోంది. వాటిలో రెండు పథకాలకు అక్టోబర్ 2న శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. వాటిలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం గురించి ఇప్పటికే అన్ని మార్గదర్శకాలు అధికారులకు చేరాయి. ‘జన్మభూమి-మా ఊరు’ పథకం గురించి పలుమార్లు చర్చించిన ప్రభుత్వం మంగళవారం జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ పథకం ద్వారా ప్రచారం ఎలా ఉండాలనే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఇలా.. ప్రతి మండల కేంద్రంలోనూ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించాలని తొలుత ప్రభుత్వం భావించింది. లీటరు మంచినీరు రూ.2కు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ పథకం నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. నిర్వహణ కోసం స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలు, స్థానికంగా దాతలు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాతలు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒక ప్లాంటుకు మాత్రమే పరిమితమైంది. అయినప్పటికీ దాతల నుంచి స్పందన లేదు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఒక్కోచోట మంచినీటి ప్లాంటు ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు గన్నవరంలో అదనంగా మూడు, జగ్గయ్యపేట, కానూరు, పెనమలూరులలో మరో మూడు ప్లాంట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడితో పాటు నిర్వహణ భారం కూడా దాతలపైనే.. ఒక్కో ప్లాంటు ఏర్పాటు చేయాలంటే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు ఖర్చవుతుంది. నిత్యం ప్లాంటులో పని చేసేందుకు ఒక ఉద్యోగి కావాలి. విద్యుత్‌ను 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కాబట్టి దాత పెట్టుబడి పెట్టడంతోపాటు మెయింటినెన్స్ కూడా చూడాల్సి రావడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ, జిల్లావ్యాప్తంగా 19 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నూజివీడులో మాత్రమే ప్లాంటు పెట్టేందుకు దాతలు ముందుకువచ్చారు. మండల అభివృద్ధి అధికారి ఒత్తిడి మేరకు ఫౌల్ట్రీ సంఘం అధ్యక్షుడు ఎం.లక్ష్మణస్వామి చందాలు వసూలు చేసి స్థానికంగా బస్‌షెల్టర్‌లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కురుమద్దాలిలో, గన్నవరం నియోజకవర్గంలోని రామచంద్రాపురం, తరిగొప్పల, వేలేరులలో ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పామర్రు నియోజకవర్గంలోని కురుమద్దాలి, చల్లపల్లి మండలంలోని నడకుదురు గ్రామాల్లో ఎన్ఆర్ఐల సాయంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ప్లాంట్ల ఊసే లేదు. మరోవైపు ప్రస్తుతానికి ఒక్కో ప్లాంటుకు రూ.80వేలు మెయింట్‌నెన్స్ కోసం అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. ‘జన్మభూమి-మా ఊరు’ తీరూ అంతే.. జన్మభూమి-మా ఊరు పథకం కూడా కేవలం ప్రచారం కోసమే రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పథకం కింద గ్రామాల్లో పెన్షన్‌కు అర్హులైన వారిని గుర్తిస్తారు, హెల్త్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. గ్రామంలో మైక్రో లెవల్ ప్లానింగ్, స్వర్ణగ్రామానికి పంచసూత్రాలు, స్వర్ణపురానికి పంచసూత్రాలు, పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛాంధ్ర తదితర కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తారు. అందరూ భావిస్తున్నట్లు 70శాతం ప్రభుత్వ నిధులు, 30 శాతం ప్రజల నిధులతో పనులు చేసేందుకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండండి... అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు, రైతులు రుణమాఫీపై నిలదీసే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు సూచించారు. ఈ మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. -
‘సుజల’ ఎలా?
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి ఆరంభంలోనే అవరోధాలు తప్పడం లేదు. నామమాత్రపు ధరకు రక్షిత మంచినీటిని ప్రజలకు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి విదల్చకుండా మంచినీటి ప్లాంట్ల ఏర్పాటుకు దాతల సహకారంపైనే ఆధారపడడంతో పురోగతి లేదు. మరోవైపు వీటి నిర్వహణకు డ్వాక్రా సంఘాలు కూడా ఆసక్తి చూపడం లేదు. అక్టోబర్ రెండు నాటికి కనీసం 400 ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. అతికష్టంమీద 65 ప్లాంట్ల ఏర్పాటుకు దాతలను ఒప్పించగలిగారు. సాక్షి, కాకినాడ/అమలాపురం :ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గాంధీ జయంతి రోజు నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ర్టంలో తొలి దశలో కనీసం ఐదు వేల గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రజలకు రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించాలని భావించారు. ఇప్పటికే పథకం అమలుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జనాభా ప్రాతిపదిన ఒక్కొక్క ప్లాంట్‌కు రూ.2 లక్షల (వెయ్యి లోపు జనాభా) నుంచి రూ.4 లక్షల (3 వేల లోపు జనాభా) వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. తొలుత 612 గ్రామాల గుర్తింపు మన జిల్లాలో వెయ్యికి పైగా పంచాయితీలుండగా, వాటి పరిధిలో 2290 ఆవాస ప్రాంతాలు (హేబిటేషన్స్) ఉన్నాయి. తొలి దశలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు కోసం తాగునీటి సరఫరా అధ్వానంగా ఉన్న 612 గ్రామాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీటిలో కనీసం 400 గ్రామాల్లో శ్రీకారం చుట్టాలని సంకల్పించింది. ఈ పథకానికి ఎలాంటి నిధులు విదల్చని ప్రభుత్వం.. దాతలను సమీకరించి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రెండున్నర నెలల క్రితం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి విడతల వారీగా జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర దాతలతో కలెక్టర్ నీతూప్రసాద్ సమావేశాలు నిర్వహించారు. కంపెనీల వారీగా టార్గెట్లు విధించారు కంపెనీ సోషల్ రెస్పాన్సబులిటీ (సీఎస్ఆర్) కింద ఖర్చు చేసే నిధులతో సంబంధం లేకుండా ప్రతి కార్పొరేట్, పారిశ్రామిక సంస్థలు మినరల్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా, ఎంతగా ఒత్తిడి చేసినా వారి నుంచి స్పందన కానరాలేదు. అక్టోబర్ రెండు నాటికి కనీసం 400 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ప్రారంభంలో 14 కార్పొరేట్, పారిశ్రామిక సంస్థలు 225 ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఆ తర్వాత ఏమైందో కానీ వీటి ఏర్పాటు విషయంలో ఆయా సంస్థలు వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అతికష్టంగా 65 ప్లాంట్ల ఏర్పాటుకు దాతలను ఒప్పించగలిగారు. మరో రెండు రోజుల్లో ఈ ప్లాంట్ల వినియోగంలోకి రావాల్సి ఉన్నప్పటికీ, కనీసం 20 గ్రామాల్లో కనీసం ప్రాథమిక పనులు కూడా ప్రారంభం కాలేదు. నియోజకవర్గానికి ఒక్కటైనా..! కొన్ని నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రామాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుండగా, మెజారిటీ నియోజకవర్గాల్లో మాత్రం ఒక్క గ్రామంలో కూడా ప్లాంట్ పనులు ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. ముహూర్తం ముంచుకొస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి అధికారుల్లో నెలకొంది. కనీసం నియోజకవర్గానికి ఒక్కటైనా వినియోగంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో శ్రమిస్తున్నారు.చివరకు జన్మభూమి-మనవూరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్ర బాబుతో ప్రారంభింపజేయాలని తలపోసిన అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో కూడా ప్లాంట్ పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు అనేక గ్రామాల్లో ఇప్పటికే ప్రైవేటు యాజమాన్య నిర్వహణలో కొనసాగుతున్న ఆర్వో ప్లాంట్లను ఈ పథకం కిందకు తీసుకు రావాలనే ఆలోచన చేస్తున్నారు. మరోవైపు ఈ ప్లాంట్ల నిర్వహణ పెద్ద సమస్యగా తయారైంది. కేవలం ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భవనంతో పాటు మంచినీరు, విద్యుత్ సదుపాయాలను మాత్రమే కల్పించనున్నారు. నిర్వహణలో రోజువారీగా వచ్చే విద్యుత్ బిల్లులను కూడా నిర్వహణను భుజానకెత్తుకునే సంస్థలే భరించాల్సి ఉంటుంది. ప్రాథమికంగా జిల్లాలో 30 శాతం ప్లాంట్ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు. మిగిలిన ప్లాంట్లను ఆయా సంస్థల నిర్వహణలో కొనసాగించాలని తలపోసినప్పటికీ, వారి అంగీకారం మేరకు డ్వాక్రా సంఘాలకు అప్పగించాలనే ప్రతిపాదన చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు డ్వాక్రా సంఘాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ పథకం ఆరంభశూరత్వంగా మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
సుజలధార పది గ్రామాలకే!
నరసన్నపేట రూరల్/పీఎన్‌కాలనీ : అక్టోబర్ రెండో తేదీ నుంచి స్వచ్ఛమైన మంచి నీరు అందుతోందని భావించిన జిల్లా ప్రజల ఆశలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. గాంధీ జయంతి నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందజేయూలని ప్రభుత్వం సంకల్పించినప్పటికీ లక్ష్యం నెరవేరని పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం దాతల సహకారంతో ఈ పథకాన్ని ముడిపెట్టడం.. వారు అనుకున్నంత స్థాయిలో ఆర్థిక సా యం చేయకపోవడమే. సుజల స్రవంతి పథకానికి జిల్లా వ్యాప్తంగా 544 గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. వీటిలో తొలి విడతలో 485, రెండో విడతలో 59 గ్రామాల్లో నీటి సరఫరాకు వీలుగా ప్లాంటులు ప్రారంభించాలనుకున్నారు. అరుుతే ఆర్థికసాయం చేసేందుకు దాతలు ముం దుకు రాకపోవడంతో గాంధీ జయంతి నుంచి కేవలం 10 గ్రామాల్లోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుద్ధి చేసిన నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోందని ప్రజ లు సంబర పడ్డారు. ప్రధానంగా నీటి కొరత ఉన్న గ్రామస్తులు తమ కష్టాలు తీరుతాయని ఆశించారు. రెండు రూపాయలకే మంచి నీరు లభ్యమవుతోందనుకున్నారు. అయితే ఆచరణ దగ్గరకి వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. మండలంలో ఒక్క గ్రామంలోనైనా అక్టోబర్ రెండో తేదీ నుంచి ఈ పథకం ద్వారా మంచి నీరు అందిస్తారనే నమ్మకం లేకుండా పోరుుంది. ఆశించినంతగా దాతలు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒక గ్రామంలోనే వచ్చే నెల రెండో తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో కోమర్తి, తామరాపల్లిలో ఒక గ్రామంలోనే నీటిని సరఫరా చేయూలని భావించిన అర్డబ్ల్యూఎస్ అధికారులు చివరికి తామరాపల్లిలో పథకాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొరవడిన దాతల సహకారం! ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకే అప్పగించింది. సర్కార్ పైసా ఇవ్వదు. దాతలను కూడా అధికారులే చూసుకోవాలి. దీంతో అనుకున్న విధంగా సిబ్బంది లక్ష్యాలు సాధించ లేక పోతున్నారు. ప్రధానంగా దీని అమలుకు ఎంపిక చేసిన గ్రామా ల్లో పని చేస్తున్న బోరు ఉండాలి. ఇది అంగన్వాడీ, పంచాయతీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ భవనం ఉన్న చోటే ఉండాలి. ఆయా గ్రామంలో ఈ పథకం ద్వారా గ్రామస్తులకు మంచి నీరు అందించేందుకు దాతలు ముందుకు రావాలి. ఈ పథకం ఎలా నిర్వహించాలి, ఏమేమి సమకూర్చాలో అధికారులు వివరిస్తారు. దాతల సొమ్ముతో బోరుకు మోటారు, ఫిల్టర్, మంచినీరు సుద్ధి చేసే ఇతర పరికరాలు సమకూర్చాలి. దీనికి ఒక్కో గ్రామంలో దాతలు సుమారు రూ. 4 లక్షలు వరకూ వెచ్చించాల్సి ఉంది. అంతా అయిన తరువాత గ్రామంలో ఉత్సాహం కలిగిన వారికి, లేదా స్వయం శక్తి సంఘాల వారికి నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు. గ్రామంలో 20 లీటర్ల నీటిని కేవలం రెండు రూపాయలకే విక్రయించి ఆ మొత్తంతో నిర్వహణ చేసుకోవాలి. ఇదంతా చెప్పడానికి బాగున్నా ఆచరణ వద్దకు వచ్చే సరికి ఎలా ఉంటుందో అనే అనుమానం అంతటా వ్యక్తం అవుతోంది. సమావేశానికే పరిశ్రమల యజమానుల గైర్హాజర్ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై చర్చిందుకు గత నెల 30వ తేదీన కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పరిశ్రమల యజమానులు గైర్హాజరయ్యూరు. సమావేశానికి కచ్చితంగా హాజరు కావాలని అధికారులు ఆదేశించినా ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని పరిశ్రమల నుంచి కిందిస్థారుు సిబ్బంది మాత్రమే హాజరయ్యూరు. ఆ తరువాత అధికారులు కూడా పెద్దగా దీనిపై దృష్టిసారించిన సందర్భం లేదు. దీంతో లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. ఫలితంగా తొలి విడతలో కేవలం పది గ్రామాలకే ఈ పథకం పరిమితమయ్యే అవకాశం ఉంది. -
సుజలంపై నీలినీడలు
ఎన్టీఆర్ సుజల స్రవంతిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నిర్ణీత సమయంలో పథకం ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమలు కావాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ప్రక్రియ టెండర్లదశలోనే ఉంది. జిల్లాలో ఎక్కడెక్కడ వాటర్‌ప్లాంట్ యూనిట్లు ఏర్పాటుచేయాలన్నది నేటికీ ఖరారు కాలేదు. కేంద్రాల గుర్తింపు కోసం అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. ప్లాంట్ల ఏర్పాటు తరువాత వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై కూడా ఒకస్పష్టతకు రాలేకపోతున్నారు. ప్రధానంగా ఏజెన్సీలో ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేయాలో గుర్తించలేకపోతున్నారు. విశాఖ రూరల్ : ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా గ్రామాల్లో రూ.2లకే 20 లీటర్ల రక్షిత నీటిని సరఫరా చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇందుకు సంబంధించి పైసా కూడా విడుదల చేయలేదు. ప్రైవేటు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ద్వారా దీనిని చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమేరకు తాగునీటి ఇబ్బందులు అధికంగా ఉండే గ్రామాలను గుర్తించారు. జిల్లాలో 376 గ్రామాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ కొద్ది రోజుల క్రితం సమావేశమయ్యారు. ఒకేసారి 376 గ్రామాల్లో ఏర్పాటు కష్టమని అధికారులే అంటున్నారు. తొలి దశలో 226 గ్రామాల్లో.. : తొలి దశలో 226 గ్రామాల్లో ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణకు 156 పరిశ్రమలు, సంస్థలు ముందుకొచ్చాయి. అయితే ప్రతీ నెలా నిర్వహణ భారం మోసేందుకు మాత్రం కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులు సమకూరుస్తామని, నిర్వహణ బాధ్యతలు వేరెవరికైనా అప్పగించాలని కొందరు అధికారులను కోరినట్లు తెలిసింది. అలాగే యూనిట్ల ధర కూడా ఇష్టానుసారంగా కాకుండా నిర్దుష్టంగా ఉంటే కొనుగోలు సులభమని వారు అధికారులకు సూచించారు. 18న ధరపై నిర్ణయం : నీటి సరఫరా సామర్థ్యం మేరకు యూనిట్ ధర రూ.4.5 నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందరూ ఒక నిర్ణీత ధరకు వీటిని కొనుగోలుకు వీలుగా అధికారులు ఇటీవల ఈ యూనిట్లు సరఫరా చేసే కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 15వ తేదీ వరకు టెండర్లను స్వీకరించారు. ఈ నెల 18న వీటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్లాంట్ల ధరను ఖరారు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చుతో పాటు నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు కొన్ని కంపెనీలు అంగీకరించకపోవడంతో ఆయా చోట్ల నిర్వహణను పంచాయతీలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఏజెన్సీలో పథకం అమలు డౌటే! : తొలి దశలో ఏజెన్సీలో 50 గ్రా మాల్లో ఈ యూనిట్లు ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశించినప్పటికీ కేంద్రాల గుర్తింపు అధికారులకు తలనొప్పిగా మారింది. స్థల సమస్యతో అక్కడి అధికారులు ముందే చేతులెత్తేశారు. కనీసం 10 గ్రామాల్లో అయినా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. -
త్వరలో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు పేరిట చేపట్టనున్న 'ఎన్టీఆర్ సుజల పథకం' అమలుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ... అక్టోబర్ 2 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ పథకం కింద రూ.2 లకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామన్నారు. తొలి విడతగా 450 గ్రామాల్లో అమలు చేస్తామన్నారు. వాటర్ ప్లాంట్ల నిర్వహాణను జిల్లాలోని పరిశ్రమకు అప్పగిస్తామని చెప్పారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖలో 2600 పోస్టుల భర్తీ చేసేందుకు ఇప్పటికే ఏపీపీఎస్సీకి లేఖ రాసినట్లు అయ్యన్నపాత్రుడు వివరించారు. -
‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ ప్రారంభం
శ్రీకాళహస్తి: నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి పథకాన్ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తన చేతులమీదుగా ప్రారంభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ ఈ పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల క్యాన్ వాటర్‌ను ప్రజలకు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో మొదట శ్రీకాళహస్తిలో ఈ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పథకం అమల్లోకి వస్తుందని మంత్రి చెప్పారు. -
‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి ప్రణాళిక
ఏలూరు : జిల్లాలో ఎన్టీఆర్ సుజల స్రవ ంతి పథకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన మంత్రికి మంగళవారం కలెక్టర్ సిద్ధార్థజైన్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, జెడ్పీ అధికారులతో కొద్దిసేపు మంత్రి సమీక్షిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పథకంలో భాగంగా ప్రతి గ్రా మంలో రూ.2 కే 20 లీటర్ల సురక్షిత తా గునీరు అందించే కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అదికారులకు ఆదేశించారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. ద్వారా ప్రతి పల్లెలో సురక్షిత తాగునీటిని తక్కువ ధరకే అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. తాడేపల్లిగూడెం శరవేగంగా అభివృద్ధి చెందుతోం దని, అయితే పట్టణ ప్రజలు వేసవిలో తాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలి పారు. ఏలూరు కాలువ ద్వారా తాడేపల్లిగూడెం సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు నింపుతున్నా వేసవిలో నీటి ఎద్దడి తప్పడం లేదన్నారు. విజ్జేశ్వరం నుంచి నేరుగా పైప్‌లైను ద్వారా తాడేపల్లిగూడెంనికి నీరందించే విషయంలో సాధ్యాసాధ్యాలపై పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో సాగునీటి సమస్య లేకుండా నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలని సూచిం చారు. జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.రమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు లక్ష్మిపతిరాజు, జయచంద్రబాబు, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ పాల్గొన్నారు.