సుజలం.. నిష్పలం!
1003 - పంచాయతీలు
3,312 - గ్రామాలు
39 - ఎన్టీఆర్ సుజల ప్లాంట్‌లు
సమస్యలు: నిర్వహణ, బోర్లు ఎండిపోవడం, విద్యుత్
ప్రభుత్వ హామీ : ప్రతి గ్రామంలో ఒక వాటర్‌ప్లాంట్
ఇది ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరులో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్. ఎన్నికల సమయంలో ప్రతి గ్రామంలో ఒక శుద్ధ నీటి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఇప్పుడు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటమే భాగ్యంగా మారింది. ఈ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా.. ఆయన మాత్రం సినిమాలకే పరిమితం కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. గ్రామాల్లో వేలల్లో ఉండగా.. ప్లాంట్‌లు యాభై కూడా దాటని పరిస్థితి. ఇవి కూడా సక్రమంగా పని చేయకపోవడంతో ప్రజలకు ‘పానీ’పట్టు యుద్ధం తప్పడం లేదు.
మామూలు నీళ్లిస్తే చాలు
ఎన్నికల సమయంలో అన్ని పంచాయతీల్లో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అయితే లేపాక్షిలో మత్రమే ప్లాంట్ ఏర్పాటయింది. అక్కడ కూడా నీటి సరఫరా అరకొరగానే ఉంటోంది. ప్రైవేటు వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లి బిందె నీరు రూ.10, క్యాన్ రూ. 15లతో కొంటున్నాం. మినరల్ వాటర్ కాకపోయినా.. మామూలు నీళ్లిస్తే చాలు.
- హనుమంతు, లేపాక్షి