కాలక్షేపానికి పథకాలు | schemes design without the funding | Sakshi
Sakshi News home page

కాలక్షేపానికి పథకాలు

Published Wed, Oct 1 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

schemes design without the funding

సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుడివాడ : చేతినిండా నిధులుంటేనే ప్రభుత్వ పథకాలు సక్రమంగా ముందుకు సాగటం కష్టం. కానీ, అసలు నిధులు ఇవ్వకుండా పబ్బం గడిపేందుకు ప్రభుత్వం పలు ‘పథకాలు’ రచిస్తోంది. వాటిలో రెండు పథకాలకు అక్టోబర్ 2న శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. వాటిలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం గురించి ఇప్పటికే అన్ని మార్గదర్శకాలు అధికారులకు చేరాయి. ‘జన్మభూమి-మా ఊరు’ పథకం గురించి పలుమార్లు చర్చించిన ప్రభుత్వం మంగళవారం జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ పథకం ద్వారా ప్రచారం ఎలా ఉండాలనే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వివరించారు.

 ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఇలా..
 ప్రతి మండల కేంద్రంలోనూ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించాలని తొలుత ప్రభుత్వం భావించింది. లీటరు మంచినీరు రూ.2కు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ పథకం నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. నిర్వహణ కోసం స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలు, స్థానికంగా దాతలు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాతలు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒక ప్లాంటుకు మాత్రమే పరిమితమైంది.

అయినప్పటికీ దాతల నుంచి స్పందన లేదు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఒక్కోచోట మంచినీటి ప్లాంటు ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు గన్నవరంలో అదనంగా మూడు, జగ్గయ్యపేట, కానూరు, పెనమలూరులలో మరో మూడు ప్లాంట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 పెట్టుబడితో పాటు నిర్వహణ భారం కూడా దాతలపైనే..
 ఒక్కో ప్లాంటు ఏర్పాటు చేయాలంటే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు ఖర్చవుతుంది. నిత్యం ప్లాంటులో పని చేసేందుకు ఒక ఉద్యోగి కావాలి. విద్యుత్‌ను 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కాబట్టి దాత పెట్టుబడి పెట్టడంతోపాటు మెయింటినెన్స్ కూడా చూడాల్సి రావడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ, జిల్లావ్యాప్తంగా 19 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు నూజివీడులో మాత్రమే ప్లాంటు పెట్టేందుకు దాతలు ముందుకువచ్చారు. మండల అభివృద్ధి అధికారి ఒత్తిడి మేరకు ఫౌల్ట్రీ సంఘం అధ్యక్షుడు ఎం.లక్ష్మణస్వామి చందాలు వసూలు చేసి స్థానికంగా బస్‌షెల్టర్‌లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కురుమద్దాలిలో, గన్నవరం నియోజకవర్గంలోని రామచంద్రాపురం, తరిగొప్పల, వేలేరులలో ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పామర్రు నియోజకవర్గంలోని కురుమద్దాలి, చల్లపల్లి మండలంలోని నడకుదురు గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఐల సాయంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ప్లాంట్ల ఊసే లేదు. మరోవైపు ప్రస్తుతానికి ఒక్కో ప్లాంటుకు రూ.80వేలు మెయింట్‌నెన్స్ కోసం అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం.

 ‘జన్మభూమి-మా ఊరు’ తీరూ అంతే..
 జన్మభూమి-మా ఊరు పథకం కూడా కేవలం ప్రచారం కోసమే రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పథకం కింద గ్రామాల్లో పెన్షన్‌కు అర్హులైన వారిని గుర్తిస్తారు, హెల్త్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. గ్రామంలో మైక్రో లెవల్ ప్లానింగ్, స్వర్ణగ్రామానికి పంచసూత్రాలు, స్వర్ణపురానికి పంచసూత్రాలు, పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛాంధ్ర తదితర కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తారు. అందరూ భావిస్తున్నట్లు 70శాతం ప్రభుత్వ నిధులు, 30 శాతం ప్రజల నిధులతో పనులు చేసేందుకు  అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

 జాగ్రత్తగా ఉండండి...
 అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు, రైతులు రుణమాఫీపై నిలదీసే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు సూచించారు. ఈ మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement