‘జన్మభూమి’కి శ్రీకారం
సాక్షి, ఏలూరు : ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం జిల్లాలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మొదటి రోజు ర్యాలీలు,స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద 34 చోట్ల వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. ఏలూరు 26వ డివిజన్‌లో జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ సదస్సు జరిగింది. రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు.
2019 నాటికి సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా...
సదస్సులో మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ 2019 అక్టోబర్ 2 నాటికి జిల్లాను సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయూలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్-స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా చూడవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో 75 లక్షల మంది డ్వాక్రా మహిళల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. రూ.2కే 20 లీటర్ల తాగునీరు అందించేందుకు 480 గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవం తి పథకం కింద వాటర్ ప్లాంట్లు నిర్మిస్తున్నామన్నారు. తొలి రోజున 34 ప్లాంట్లను ప్రారంభించామని, 785 చోట్ల ర్యాలీలు జరిగాయని మంత్రి చెప్పారు.
జవాబుదారీగా ఉండండి
ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ పథకాల అమలు విషయంలో అధికారులు, ప్రజాప్రతి నిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల న్నారు. జిల్లాలో 39 లక్షల జనాభా ఉండగా, వారిలో అర్హులైన 3లక్షల మంది నిరుపేదలకు పింఛన్లు అందించేందుకు ఏటా రూ.350 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోం దని చెప్పారు. శాసనమండలి విప్ అంగర రామ్మోహనరావు మాట్లాడుతూ ప్రతి ఇంటా మరుగుదొడ్డి, ప్రతి గ్రామంలో పారిశుధ్యం, ప్రతి వ్యక్తికి స్వచ్ఛమైన తాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరి సహకారం అవసరమన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం సాధించడానికన్నా పారిశుధ్యమే మిన్న అన్న మహాత్మాగాంధీ సూక్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని ఆలపించే సందర్భంలో కొందరు తడబడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి), నగర మేయర్ షేక్ నూర్జహాన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహాని, జన్మభూమి ప్రత్యేకాధికారి శ్రీధరన్, అదనపు జేసీ సీహెచ్ నరసింగరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బి.రమణ, డీఆర్‌డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, డీపీవో ఎ.నాగరాజువర్మ, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శ్రీమన్నారాయణ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వేణుగోపాల్, ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్, నగరపాలక సంస్థ కమిషనర్ కె2 సాధన, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ అధికారి ఆర్.సూయిజ్ పాల్గొన్నారు.