సుజలాం విఫలాం..!
ఎన్టీఆర్ సుజలకు ఒక్క రూపాయీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
150 భారీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని పది రోజుల క్రితం ప్రకటన
వాటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిందే రూ. 59 కోట్లు
అయినా నిధులివ్వని చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఆ పథకానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టామని ఘనంగా చెప్పుకున్నారు. అధికారం చేపట్టినపుడు పెట్టిన ఐదు సంతకాల్లో ఆ పథకాన్నీ చేర్చారు. పేరు ఘనంగా పెట్టి పబ్లిసిటీ చేసుకున్నా ఆ పథకానికి మాత్రం నిధులు ఇవ్వడంలేదు. అదే ఎన్టీఆర్ సుజల పథకం. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించడం పథకం లక్ష్యం. అయితే ఈ పథకం ద్వారా అన్ని గ్రామాల్లో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే ఏడాదికి రూ. 150 నుంచి రూ. 200 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. 2014-15లో ఒక్క రూపాయి ఇవ్వలేదు.
గత బడ్జెట్‌లో మాత్రం రూ. 11 కోట్లు కేటాయించారు. వాటిల్లోనూ పైసా ఖర్చు పెట్టలేదు. అయితే, ఈ ఏడాది మార్చి చివర నాటికి ఆ రూ. 11 కోట్లలో రూ. 69 లక్షలు ఖర్చు పెడతామంటూ రివైజ్డు బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. 2016-17 బడ్జెట్‌లో అయితే పైసా కూడా కేటాయించలేదు.
దాతలిచ్చిన నిధులే
రాష్ట్రంలో మొత్తం 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 821 గ్రామాల్లో 826 మంచినీటి ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. దాతల విరాళాలతో ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడంతో వాటిలో దాదాపు సగం మూత పడేదశకొచ్చాయి. మరోపక్క ఎన్టీఆర్ సుజల పథకంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం.. గ్రామానికో మంచినీటి ప్లాంటు ఏర్పాటుకు బదులు 15 గ్రామాలకొకటి చొప్పన భారీ ప్లాంటు ఏర్పాటు చేయడానికి కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ప్లాంట్‌కు కోటిన్నర వరకు ఖర్చు పెట్టి మూడేళ్లలో రాష్ట్రంలో 1,000 భారీ మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది.
ప్లాంటు ఏర్పాటుకయ్యే ఖర్చులో దాతలుగానీ, దానిని నిర్వహించడానికి గాను ముందుకొచ్చే వారు 74 శాతం నిధులు భరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 26 శాతం ఆర్థిక సహాయం చేస్తుందని కొత్త విధానంలో ప్రకటించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే వచ్చే ఏడాది ఒక్కొక్క ప్లాంటుకు రూ. 39 లక్షల చొప్పున 150 భారీ మంచినీటి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 59 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అయినా బడ్జెట్‌లో మాత్రం పైసా కూడ కేటాయింపులు లేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రస్ఫుటమవుతోంది.