‘సుజల’ ఎలా?
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి ఆరంభంలోనే అవరోధాలు తప్పడం లేదు. నామమాత్రపు ధరకు రక్షిత మంచినీటిని ప్రజలకు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి విదల్చకుండా మంచినీటి ప్లాంట్ల ఏర్పాటుకు దాతల సహకారంపైనే ఆధారపడడంతో పురోగతి లేదు. మరోవైపు వీటి నిర్వహణకు డ్వాక్రా సంఘాలు కూడా ఆసక్తి చూపడం లేదు. అక్టోబర్ రెండు నాటికి కనీసం 400 ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. అతికష్టంమీద 65 ప్లాంట్ల ఏర్పాటుకు దాతలను ఒప్పించగలిగారు.
సాక్షి, కాకినాడ/అమలాపురం :ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గాంధీ జయంతి రోజు నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ర్టంలో తొలి దశలో కనీసం ఐదు వేల గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రజలకు రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించాలని భావించారు. ఇప్పటికే పథకం అమలుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జనాభా ప్రాతిపదిన ఒక్కొక్క ప్లాంట్‌కు రూ.2 లక్షల (వెయ్యి లోపు జనాభా) నుంచి రూ.4 లక్షల (3 వేల లోపు జనాభా) వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.
తొలుత 612 గ్రామాల గుర్తింపు
మన జిల్లాలో వెయ్యికి పైగా పంచాయితీలుండగా, వాటి పరిధిలో 2290 ఆవాస ప్రాంతాలు (హేబిటేషన్స్) ఉన్నాయి. తొలి దశలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు కోసం తాగునీటి సరఫరా అధ్వానంగా ఉన్న 612 గ్రామాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీటిలో కనీసం 400 గ్రామాల్లో శ్రీకారం చుట్టాలని సంకల్పించింది. ఈ పథకానికి ఎలాంటి నిధులు విదల్చని ప్రభుత్వం.. దాతలను సమీకరించి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రెండున్నర నెలల క్రితం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి విడతల వారీగా జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర దాతలతో కలెక్టర్ నీతూప్రసాద్ సమావేశాలు నిర్వహించారు. కంపెనీల వారీగా టార్గెట్లు విధించారు కంపెనీ సోషల్ రెస్పాన్సబులిటీ (సీఎస్‌ఆర్) కింద ఖర్చు చేసే నిధులతో సంబంధం లేకుండా ప్రతి కార్పొరేట్, పారిశ్రామిక సంస్థలు మినరల్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.
ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా, ఎంతగా ఒత్తిడి చేసినా వారి నుంచి స్పందన కానరాలేదు. అక్టోబర్ రెండు నాటికి కనీసం 400 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ప్రారంభంలో 14 కార్పొరేట్, పారిశ్రామిక సంస్థలు 225 ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఆ తర్వాత ఏమైందో కానీ వీటి ఏర్పాటు విషయంలో ఆయా సంస్థలు వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అతికష్టంగా 65 ప్లాంట్ల ఏర్పాటుకు దాతలను ఒప్పించగలిగారు. మరో రెండు రోజుల్లో ఈ ప్లాంట్ల వినియోగంలోకి రావాల్సి ఉన్నప్పటికీ, కనీసం 20 గ్రామాల్లో కనీసం ప్రాథమిక పనులు కూడా ప్రారంభం కాలేదు.
నియోజకవర్గానికి ఒక్కటైనా..!
కొన్ని నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రామాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుండగా, మెజారిటీ నియోజకవర్గాల్లో మాత్రం ఒక్క గ్రామంలో కూడా ప్లాంట్ పనులు ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. ముహూర్తం ముంచుకొస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి అధికారుల్లో నెలకొంది. కనీసం నియోజకవర్గానికి ఒక్కటైనా వినియోగంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో శ్రమిస్తున్నారు.చివరకు జన్మభూమి-మనవూరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్ర బాబుతో ప్రారంభింపజేయాలని తలపోసిన అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో కూడా ప్లాంట్ పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు అనేక గ్రామాల్లో ఇప్పటికే ప్రైవేటు యాజమాన్య నిర్వహణలో కొనసాగుతున్న ఆర్వో ప్లాంట్లను ఈ పథకం కిందకు తీసుకు రావాలనే ఆలోచన చేస్తున్నారు.
మరోవైపు ఈ ప్లాంట్ల నిర్వహణ పెద్ద సమస్యగా తయారైంది. కేవలం ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భవనంతో పాటు మంచినీరు, విద్యుత్ సదుపాయాలను మాత్రమే కల్పించనున్నారు. నిర్వహణలో రోజువారీగా వచ్చే విద్యుత్ బిల్లులను కూడా నిర్వహణను భుజానకెత్తుకునే సంస్థలే భరించాల్సి ఉంటుంది. ప్రాథమికంగా జిల్లాలో 30 శాతం ప్లాంట్ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు. మిగిలిన ప్లాంట్లను ఆయా సంస్థల నిర్వహణలో కొనసాగించాలని తలపోసినప్పటికీ, వారి అంగీకారం మేరకు డ్వాక్రా సంఘాలకు అప్పగించాలనే ప్రతిపాదన చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు డ్వాక్రా సంఘాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ పథకం ఆరంభశూరత్వంగా మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.