ఎమ్మెల్యేలూ! ఎలుగెత్తండి!
పదవులు చేపట్టి ఆరు నెలలైనా.. నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు.. ఎన్నికల ప్రచారం నాటి చురుకుదనంలో వందోవంతు చూపడం లేదని జిల్లా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలేమో నియోజకవర్గ నిధులు విడుదల కాకపోవడంతో ఏ పనులూ చేపట్టలేకపోతున్నా అంటున్నారు. నిధుల గోల తమకెందుకంటున్న జనం పేరుకుపోయిన సమస్యల్లో కొన్నింటికైనా పరిష్కారం లభించాలని ఆశిస్తున్నారు. గురువారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన సమస్యలను ప్రస్తావించాలని, తమ వాణిని వినిపించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను ప్రజల తరఫున ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లాలని ‘సాక్షి’ సంకల్పించింది. ప్రజలకు వారిచ్చిన హామీల్ని గుర్తు చేసి, నెరవేర్చేలా చేయాలన్న ప్రయత్నమే ఇది..
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో విస్తరణ శిక్షణా కేంద్రం, వ్యవసాయ పరిశోధన కేంద్రం, కోళ్ల వ్యాక్సిన్ సెంటర్ ఉండటం వల్ల వీటికి అనుబంధంగా వ్యవసాయ విశ్యవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. ఇందుకు అనువుగా విస్తరణ శిక్షణా కేంద్రానికి 100 ఎకరాలు భూమి ఉంది. మెట్ట ప్రాంత రైతుల కోసం ఏర్పాటైన దుంప పరిశోధన కేంద్రాన్ని తిరిగి పెద్దాపురం తీసుకు రావాలనేది ఇక్కడి రైతుల డిమాండ్. అందుకు ఆయన హామీ ఇచ్చారు కూడా.
మెట్ట ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న ఏలేరు ఆధునికీకరణ పనులు ప్రారంభించేలా ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో ప్రస్తావించాలని మెట్ట రైతులు కోరుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో సుమారు రూ.130 కోట్లతో శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగని వైనాన్ని ఎత్తిచూపాలంటున్నారు. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాధారంగా రైతులు పండించే కర్రపెండలానికి రుణమాఫీ వర్తింపజేసేలా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.
కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ హయాంలో ఏటిగట్ల ఆధునికీకరణకు సుమారు రూ.100 కోట్లు విడుదల చేయగా ఆయన మరణానంతరం పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ఆ పనులు పరుగులుపెట్టేలా అసెంబ్లీలో ఎలుగెత్తాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని ప్రజలు కోరుతున్నారు. కొత్తపేటలో నిలిచిపోయిన బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి, ఆత్రేయపురం మండలం పేరవరం, ఉచ్చిలి ఎత్తిపోతల పథకాలకు నిధులు రాబట్టాలని రైతులు కోరుతున్నారు.
తుని నియోజకవర్గంలో హుద్ హుద్ తుపాను పంటనష్టం పరిహారం జాబితా అవకతవకలపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అసెంబ్లీలో ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నేతలు, వారి అనుచరులు వరి పంటను అరటి తోటలుగా నమోదు చేసి పరిహారం మెక్కేందుకు ప్రయత్నిస్తున్న వైనాన్ని చాటాలనుకుంటున్నారు. కాగా తాండవలో అనుమతి లేకుండా జరుగుతున్న ఇసుక దందాను కూడా ప్రస్తావించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
రంపచోడవరం నియోజకవర్గంలో ముసురుమిల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అసెంబ్లీలో ప్రయత్నించాలని గిరిజనులు కోరుతున్నారు. గిరిజనులకు 2009లో అటవీ హక్కులు కల్పిస్తూ అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అటవీహక్కుల చట్టం అమలులోకి తెచ్చారు. కానీ వెదురును నరుక్కుని అమ్ముకునే హక్కులకు అటవీ అధికారులు అడ్డుకుంటున్న విషయాన్ని ప్రస్తావించాలని గిరిజనులు కోరుతున్నారు.
అమలాపురం గ్రేడ్-1 మున్సిపాలిటీకి గత ప్రభుత్వం రూ.100 కోట్లతో 30ఏళ్ల కాలానికి ఉపయోగపడేలా మంజూరు చేసిన బృహత్తర తాగునీటి ప్రాజెక్టు పెండింగ్‌లో పడింది. ఎన్నికల్లో తాగునీటి ప్రాజెక్టుకు నిధులు తెస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అనందరావు ఆర్నెళ్లయినా ఆ ఊసెత్త లేదు. అసెంబ్లీలో ప్రస్తావించైనా నిధులు రాబట్టాలని కోరుతున్నారు. ఓడలరేవులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రూ.3 కోట్ల జెట్టీ నిర్మాణం గురించీ ఎలుగెత్తాలంటున్నారు.
పుష్కరాలకు సిద్ధమవుతున్న రాజమండ్రి నగరంలో రూ.500 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మించి ట్రీట్‌మెంటు చేసిన మురుగు నీటిని మంచినీటి ఇన్‌టేక్ వెల్‌లకు దూరంగా ధవళేశ్వరం బ్యారేజీ సమీపంలో గోదావరిలో కలపాలని కోరుతున్నారు. కార్పొరేషన్‌లో 21 గ్రామాల విలీనానికి అనుకూలంగా గత ఏడాది కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ పని చూడాల్సి ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోకి వచ్చే తొమ్మిది డివిజన్‌లలో మురుగు కాలువల సమస్యను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రస్తావించాల్సి ఉంది. కడియం నర్సరీలకు ఉచిత విద్యుత్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏడాది పాటు కొనసాగగా, అదే తీరులో ఇప్పుడు కూడా ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
అనపర్తి, రాజానగరం నియోజకవర్గాల్లోని 35 వేల ఎకరాలకు సాగు నీరందించే చాగల్నాడు ఎత్తిపోతల పథకంపై ఇద్దరు ఎమ్మెల్యేలూ అసెంబ్లీలో ప్రస్తావించాలని రైతులు కోరుతున్నారు. మరమ్మతులకు ప్రతిపదించిన రూ.9.25 కోట్లు విడుదల చేసేలా ప్రయత్నించాలని కోరుతున్నారు. గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పామాయిల్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులకు ప్రయోజనం కల్పించే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్థల వివాదాన్ని పరిష్కరించి, 300 ఎకరాలు కేటాయించేలా ప్రభుత్వాన్ని కోరాలంటున్నారు.
రామచంద్రపురం పట్టణంలో 17 వేల కుటుంబాలకు చెందిన 50 వేల మందికి తాగునీరందించేలా రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టిన వెల్ల రక్షిత మంచినీటి పథకానికి నిధులు రాబట్టే విషయాన్ని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు.
మండపేటలో సుమారు 8 వేల మంది పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు కేటాయించి 172 ఎకరాలను రూ. 20 కోట్ల వ్యయంతో చదును చేయాల్సి ఉంది. తమ సొంతింటి కల నెరవేర్చేందుకు అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యే జోగేశ్వరరావును పేదలు కోరుతున్నారు. రాజమండ్రి-కాకినాడ రోడ్డుపై ద్వారంపూడి వద్ద రూ.32 కోట్లతో చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
రాజోలు నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్, డ్రైనేజీ ఆధునికీకరణ పనుల పూర్తిపై అసెంబ్లీలో చర్చించేందుకు అక్కడి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రయత్నిస్తున్నారు. రూ.200 కోట్లపెండింగ్ పనుల పూర్తికి, సఖినేటిపల్లి- నర్సాపురం వంతెన పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే కృషి చేయాలని జనం కోరుతున్నారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తీరప్రాంత గ్రామాలు ఎదుర్కొంటున్న కర్మాగారాల కాలుష్యంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే అనంతలక్ష్మి ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు. ఊకతో నడుస్తున్న కర్మాగారాలన్నింటినీ గ్యాస్ ఆధారితంగా మార్చేందుకు కృషి చేయాలంటున్నారు. తమ్మవరంలో ఏపీఐఐసీ సేకరించిన ో 295 ఎకరాలకు నష్టపరిహారం ఇప్పించేందుకు లేదా తమకు తిరిగి ఇచ్చేసేందుకు ప్రయత్నించాలని రైతులు కోరుతున్నారు.
పి.గన్నవరం నియోజక వర్గంలో గోదావరి నదీపాతం నివారణపై ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి గళం వినిపించాలని గోదావరి పరివాహక ప్రాంతాలు కోరుతున్నాయి. వరదల సమయంలో లంక గ్రామాలకు ముంపు సమస్య నుంచి మోక్షం కల్పించేందుకు వంతెనలతో పాటు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి నిధుల కోసం ఒత్తిడి తీసుకురావాలంటున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పిఠాపురం బ్రాంచి కెనాల్ ఆధునికీకరణ చేపట్టేలా అసెంబ్లీలో ఎమ్మెల్యే వర్మ ప్రస్తావించాలని రైతులు కోరుతున్నారు. ఉప్పాడ వద్ద తీరంలో రక్షణగోడ పూర్తిస్థాయిలో నిర్మాణానికి చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటున్నారు.కాకినాడ నగరంలో ప్రజలను వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు రాబట్టాలంటున్నారు. బ్రిటిష్ కాలం నాటి మంచినీటి పైపులైన్‌ల మార్పునకు కృషి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.
ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ హయాంలో తలపెట్టిన అన్నంపలి అక్విడెక్టు పూర్తికి నిధులు రాబట్టేలా ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు తన వాణిని అసెంబ్లీలో వినిపించాలని రైతులు కోరుతున్నారు. గోదావరిపై గోగుల్లంక -గుత్తులదీవి మధ్య వంతెన నిర్మాణానికి నిధులు రాబట్టే బాధ్యత కూడా ఆయనపై ఉంది.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో పుష్కర కాలువల కింద 40 వేల ఎకరాల ఆయకట్టుకూ నీరందించే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రజలు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును కోరుతున్నారు. అలాగే సుబ్బారెడ్డిసాగర్ కింద కాలువలు అభివృద్ధి చేయించాలని కోరుతున్నారు.