కుదువ పెట్టిన పసిడికి కాళ్లు.. | tDP government cheated farmers in Farmers crop loan | Sakshi
Sakshi News home page

కుదువ పెట్టిన పసిడికి కాళ్లు..

Published Thu, Mar 10 2016 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

tDP government cheated farmers in Farmers crop loan

 బంగారంపై వ్యవసాయ రుణాలూ మాఫీ చేస్తా..
 ఇదీ ఎన్నికలకు ముందు రైతులకు చంద్రబాబు వాగ్దానం
 మెలికలు, మడతపేచీలతో పలువురికి లబ్ధి హుష్‌కాకి
 జిల్లాలో రూ.1,478 కోట్ల రుణాలకు రూ.603 కోట్లే మాఫీ
 ఎందరో రైతుల నగలను వేలం వేసిన బ్యాంకులు

 
 ‘భూమైనా, బంగారమైనా నాది హామీ. బ్యాంకుల్లోని అన్ని రుణాలూ మాఫీ చేస్తా! వడ్డీలు కూడా కట్టొద్దు. ఎవరైనా వచ్చి అడిగితే కట్టబోమని తెగేసి చెప్పండి. మాకు ఓటేయండి..’ - ఇదీ ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్షుడి హోదాలో నేటి ముఖ్యమంత్రిచంద్రబాబు ఇచ్చిన హామీ.
 
 కానీ దీనికి వర్తమాన చిత్రం భిన్నంగా ఉంది.  రైతుల రుణాలన్నీ పూర్తిగా  మాఫీ చేశామని ప్రచారం చేసుకుంటున్న టీడీపీ ప్రభుత్వం.. రైతులు వ్యవసాయ రుణాల కోసం కుదువ పెట్టిన నగలను బ్యాంకులు వేలం వేయడంపై అవాస్తవిక ప్రకటనలు చేస్తోంది. మంత్రులు ఇష్టమొచ్చినరీతిలో వ్యాఖ్యలు చేస్తుంటే విస్తుబోవడం రైతుల వంతవుతోంది. మాఫీకి ఎన్నో మెలికలు, మరెన్నో మడతలు పెట్టిన సీఎం చంద్రబాబు కూడా రుణమాఫీ అయిపోయిందని చెబుతుంటే నమ్మి మోసపోయామని వారు వాపోతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో బంగారం కుదువపెట్టి 3.13 లక్షల మంది రైతులు రూ.1,478 కోట్ల మేర రుణాలు తీసుకోగా కేవలం రూ.603 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. ఇంకా రూ.875 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. మాఫీకి నోచుకోని రైతులు రెండు లక్షల మందికి పైనే. వారందరికీ బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. దీంతో కొందరు వడ్డీలు చెల్లించి రుణాలు రెన్యువల్ చేసుకున్నారు. మరికొందరు రూ.5, రూ.10 వడ్డీకి ప్రైవేట్ అప్పులు తెచ్చి, బ్యాంకులకు చెల్లించి తమ బంగారాన్ని విడిపించుకున్నారు.  ఈ రెండూ చేయలేని వారు బ్యాంకుకు అసలు, వడ్డీ చెల్లించలేక చేతులెత్తేశారు. బ్యాంకులు కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వారి నగలను బహిరంగ వేలం వేయడానికి సిద్ధమయ్యాయి. జిల్లాలో కొన్నిచోట్ల ఆ ప్రక్రియను పూర్తి చేశాయి కూడా.
 
 అమలు కాని వాగ్దానానికి ఇవిగో తార్కాణాలు..
 ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో రూ.15.75 కోట్ల బంగారు రుణాలుండగా కేవలం రూ.2 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. రుణాలు చెల్లించాలంటూ 212 మందికి బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. 20 మంది రైతుల నగలను వేలం వేశాయి.
 
 ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి స్వస్థలం తుని నియోజకవర్గంలో 525 మంది రైతులకు బ్యాంకు అధికారులు నోటీసులిచ్చారు. రూ.10 కోట్ల రుణాల్లో కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే రుణమాఫీ అయ్యింది.
 
 ప్రత్తిపాడు నియోజకవర్గంలో 25,107 మంది రైతులకు రూ 91.58 కోట్లు రుణాలు ఉండగా రూ.28.58 కోట్లు రుణాలు మాఫీ అయ్యాయి. పలువురికి నోటీసులిచ్చారు.
 
 పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 3,500 మంది బంగారం తాకట్టు పెట్టి సుమారు రూ.2 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. వారిలో చాలా మందికి ఆయా బ్యాంకుల నుంచి నోటీసులందారుు.
 
 మండపేట నియోజకవర్గంలో బ్యాంకులు పలువురు రైతులకు నోటీసులతో పాటు పేపర్లలో కూడా ప్రకటనలు కూడా ఇచ్చాయి. కేశవరంలోని ఒక బ్యాంకు పరిధిలో రుణాలు చెల్లించలేదని ఆరుగురు రైతుల బంగారాన్ని గతంలో వేలం వేశారు.
 
 రామచంద్రపురం నియోజకవర్గంలో కె.గంగవరం, కాజులూరు, రామచంద్రపురం మండలాల్లో రైతులు రుణమాఫీ జరగకపోవటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 35 పైసల వడ్డీకి తీసుకున్న బంగారు రుణాలు రూపాయి వడ్డీగా మారిపోయాయని, దీంతో అసలు వడ్డీ కలుపుకొని రుణాలు చెల్లించటం భారమైందని లబోదిబోమంటున్నారు.
 
 రాజానగరం నియోజకవర్గంలో 4,196 మంది బంగారంపై రుణాలు తీసుకున్నారు. ఇందులో 1,676 మంది ఎటువంటి రుణాలు చెల్లించలేదు. బ్యాంకుల్లో, సొసైటీల్లో వడ్డీలుపెరుగుతున్నాయి. వీరికి బ్యాంకులు నోటీసులు పంపించడంతోపాటు, పత్రికా ప్రకటనలు వేస్తున్నారుు. నోటీసులు, పత్రికా ప్రకటనలకు అయిన ఖర్చు కూడా తమపై పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని పలు బ్యాంకుల నుంచి సుమారు 4,200 మంది బంగారంపై రుణాలు తీసుకున్నారు. అయితే కొందరు రుణాలు చెల్లించగా, కొందరికి మాత్రమే రుణమాఫీ వర్తింపచేశారు. ఎక్కువ సంఖ్యలో రైతులకు మాఫీ వర్తించకపోవడంతో వడ్డీ చెల్లించి రుణాలను రీషెడ్యూల్ చేసుకున్నారు.
 
 రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలంలోని తోటపల్లి ఎస్‌బీఐలో 2,100 మందికి బంగారం, పట్టాదార్ పాస్‌పుస్తకాలపై రుణాలు ఇచ్చారు. 600 మందికి మాఫీ అయినట్టు లిస్టు పెట్టినా 300 మందికి కూడా కాలేదు. 79 మంది బంగారు రుణాలు పొందిన వారికి నోటీసులు ఇచ్చారు. ఇందులో కొందరు విడిపించుకున్నారు. కొందరు రూ.5, రూ.10 వడ్డీలకు సొమ్ములుప్రైవేటు వ్యక్తుల నుంచి తెచ్చుకుని విడిపించుకున్నారు. కొందరు బ్యాంకుకు వడ్డీకట్టి రెన్యువల్ చేయించుకున్నారు. 11 మంది రైతుల బంగారాన్ని డిసెంబర్ 7న వేలం వేశారు.
 
 అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో బ్యాంకుల్లో బంగారంపై 150 మంది రైతులు రుణాలు తీసుకున్నారు.  ఇందులో కొందరు వడ్డీలు కట్టి రెన్యువల్ చేసుకోగా, మరికొందరు రుణాలు చెల్లించి బంగారాన్ని తీసుకున్నారు. సుమారు 30 మందికి నోటీసులు జారీ చేశారు.
 
 ముమ్మిడివరం నియోజకవర్గంలో బంగారం రుణాలు రెండో విడతలోనూ మాఫీ కాకపోవడంతో రైతులపై బ్యాంకర్ల ఒత్తిడి పెరిగిపోయింది. పలు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నారుు. నియోజకవర్గంలో 1,864 మంది బంగారం కుదువపెట్టి రుణాలు తీసుకోగా కొందరికి మాఫీ అయ్యింది. బ్యాంకుల నోటీసులతో కొందరు వడ్డీలు కట్టి రెన్యువల్ చేసుకున్నారు.
 
 పి.గన్నవరం నియోజకవర్గంలో పలువురు రైతులకు బంగారు రుణబకాయిలు చెల్లించాలంటూ బ్యాంకర్ల నుంచి నోటీసులు అందాయి. రుణాలు చెల్లించనివారి బంగారం వేలం వేస్తామంటూ హెచ్చరించడంతో విధిలేనిపరిస్థితుల్లో కొందరురైతులు రుణాలు చెల్లించగా, మరికొందరు రెన్యువల్ చేయించుకున్నారు.
 
 రాజోలు నియోజకవర్గంలో అన్ని ప్రధాన బ్యాంకుల్లో రుణమాఫీ అరుున రైతుల నుంచి కూడా నగలు వేలం వేస్తామంటూ  బలవంతంగా రుణాలు తిరిగి వసూలు చేశారు. మాఫీ సొమ్మును ఐదు విడతలుగా జమ చేస్తామన్న ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక దఫా మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. నిర్ణీత గడువు దాటిపోవడంతో తీసుకున్న రుణం మొత్తం వెంటనే చెల్లించాలని, మాఫీ సొమ్ము ప్రభుత్వం చెల్లించాక ఖాతాలకు తిరిగి జమ చేస్తామని బ్యాంకర్లు చెప్పడంతో రైతులు బయట అప్పులు చేసి రుణాలు చెల్లించారు. ఒక వైపు మాఫీ చేశామని, ఐదు దఫాలుగా మాఫీ సొమ్ము చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడంతో లబ్ధిదారులు ఇరకాటంలో పడి పైకి చెప్పుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రాజోలు నియోజకవర్గంలో సుమారు 3 వేల మందికి పైగా రైతులకు మాఫీ కాలేదు.
 
 అమలాపురం నియోజకవర్గంలో దాదాపు 9 వేలమంది బంగారంపై రుణాలు తీసుకున్నారు. చంద్రబాబు రుణమాఫీ చేయడం లేదని గ్రహించిన సుమారు ఏడువేల మంది రైతులు అప్పులు చేసి రుణాలు చెల్లించారు. మిగిలిన 2 వేల మందికి బ్యాంకర్లు నోటీసులు పంపించి, పత్రికల్లో ప్రకటనలు  ఇచ్చారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు రెన్యువల్ చేయించుకోగా, కొందరు రూ.5, రూ.10 వడ్డీలకు ప్రైవేట్ అప్పులు చేసి రుణాలు చెల్లించారు. వీరిలో 70 మంది రైతులు రుణాలు చెల్లించడానికి, రెన్యుల్ చేయించుకోవడానికి సొమ్ములు లేక నగలు వదిలేసుకోగా, బ్యాంకర్లు వేలం వేశారు. చంద్రబాబు హామీ ఇచ్చి మమ్మల్ని మోసం చేశారని రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
 
 కొత్తపేట నియోజకవర్గంలో వివిధ బ్యాంకుల నుంచి బంగారంపై రుణాలు పొందిన సుమారు 120 మంది రైతులకు వేలం నోటీసులందాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement