‘చౌక’బారు దోపిడీ
♦ రేషన్ షాపుల నుంచి నెలవారీ మామూళ్ళు ∙
♦తొలుత దాడులు... ఆపై మధ్యవర్తిత్వం
♦కాకినాడలో ‘పచ్చ’ నేతల బరితెగింపు ∙
♦దారికి రాకుంటే కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మూడేళ్ల టీడీపీ పాలనలో సాధించిన ప్రగతి ఏదైనా ఉందంటే అదొక్క అవినీతే. ఇచ్చుకో...పుచ్చుకో విధానం భాగా అమల్లోకి వచ్చింది. చెప్పినట్టు చేస్తే సరి...లేదంటే కక్ష సాధింపు చర్యలే. వీరి బాధితులు కాకినాడ నగరంలోనే లెక్కలేనంత ఉన్నారు. అవినీతికి కాదేదీ అనర్హమన్న చందాన పచ్చనేతలు చివరకు రేషన్ దుకాణాలను కూడా వదిలిపెట్టడం లేదు. నెలవారీ మామూళ్లతో చౌక డిపో డీలర్లను నిలువు దోపిడీ చేస్తున్నారు. వచ్చే అరకొర కమీషన్లు, నిర్వహణ వ్యయంతో లబోదిబోమంటున్న రేషన్ డీలర్లు అధికార పార్టీ నేతల వసూళ్ల దందాకు హడలిపోతున్నారు. అడిగిన మేరకు ఇవ్వకపోతే ఎదురయ్యే ఇబ్బందులను తలుచుకుని ఎటూ చెప్పుకోలేక ముడుపులు సమర్పించుకుంటున్నారు.
ప్రతీనెలా రూ. 2 లక్షలకు పైగా వసూళ్లు...
జిల్లా కేంద్రం కాకినాడలోని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి, అతని బంధువుల ఇబ్బందులకు చౌకడిపో డీలర్లు కూడా బాధితులుగా మారిపోయారు. కాకినాడలో దాదాపు 117 రేషన్ దుకాణాలున్నాయి. దాదాపు 77 వేల 152 రేషన్ కార్డులు ద్వారా ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తున్నారు. మెజార్టీ చౌకడిపోల నుంచి నెలవారీ వసూళ్ల వ్యవహారం చాలా కాలంగా గుట్టుగా సాగిపోతోంది. ఆయా రేషన్ దుకాణాల పరిధిలోని ఒక్కో రేషన్ కార్డుకు నెలకు రూ.3లు చొప్పున కార్పొరేషన్ పరిధిలో నెలకి 2 లక్షల 31 వేలు చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటిని వసూళ్లు చేసేందుకు అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో నాలుగైదు బృందాలు ఏర్పడ్డాయి. వీరికి అనుకూలంగా ఉండే డీలర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నది ఇక్కడ హాట్‌టాఫిక్‌గా మారింది. ఇలా నెలవారీ మామూళ్లను క్రమం తప్పకుండా తమ జేబుల్లో వేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
దాడులతో లొంగదీసుకుని...
వసూళ్లకు సహకరించని రేషన్ డీలర్లను లొంగదీసుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. నచ్చని డీలర్లపై రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారుల ద్వారా దాడులు చేయించి కేసులు పెట్టిస్తున్నారు. తరువాత అదే పార్టీకి చెందిన సదరు ప్రజాప్రతినిధి సీజ్ చేసిన దుకాణాన్ని తిరిగి అనుమతించేందుకు రూ.లక్ష వరకు డిమాండ్ చేయడం, అనక యథావిధిగా పనిచేసుకునేలా అనుమతి ఇప్పించడం ఇక్కడ సర్వసాధారణమైపోయిందంటున్నారు. గడచిన మూడేళ్లలో 20 నుంచి 25 దుకాణాలపై దాడులు చేయించి డీలర్లను లొంగదీసుకున్నారన్న విమర్శలున్నాయి. అధికారంలోకి రాక ముందు కేసులున్న అనేక దుకాణాల విషయంలో కూడా మధ్యవర్తిత్వం జరిపారని ఆరోపణలున్నాయి. సొమ్ములు తీసుకుని వాటికి కూడా అనుమతి ఇచ్చారన్న వాదన ఆ వర్గాల్లో వినిపిస్తోంది.
అక్రమాలకు పాల్పడక తప్పదు
నేతలకు ముడుపులు చెల్లించుకోవాలంటే అక్రమాలు చేయక తప్పదు. చేతి సొమ్ము ఇచ్చే పరిస్థితి ఉండదు. కాదనలేక ఒకర్ని కొట్టి ఇంకొకరికి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకర్ని సంతృప్తి పరచడానికి అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితి నెలకుంది. దీంతో కొందరు అవకాశం మేరకు దారి తప్పుతున్నారు. కాకపోతే, ఏ ఒక్కరూ బయటపడలేని పరిస్థితిలో ఉన్నారు. టార్గెట్ అయిపోతామని కిమ్మనకుండా ఉంటున్నారని ఓ వ్యాపారి, మరో డీలరు ‘సాక్షి’ వద్ద వాపోయారు.
పీడీఎస్ బియ్యం పైనా కమీషన్లు...
చౌక డిపోల్లో కార్డుదారులకు సంబంధించిన కిలో రూపాయి బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యాపారం కూడా అధికార పార్టీ కనుసన్నలో జోరుగానే సాగుతోంది. పీడీఎస్ బియ్యాన్ని డీలర్ల నుంచి కొందరు పెద్ద ఎత్తున కొనుగోలు చేసే వ్యాపారంలో కూడా గట్టిగానే దండుతున్నారనే విమర్శలున్నాయి. ఇలా రేషన్ దుకాణాలను అడ్డుపెట్టుకుని నెలనెలా లక్షల్లోనే గుంజుతున్నారని బయటపడని డీలర్లు భగ్గుమంటున్నారు.