రుణ కుతంత్రంపై..రణభేరి
రుణమాఫీ హామీపై కుత్సితాన్ని అనుసరిస్తున్న సర్కారుపై సమరభేరి మోగింది. బుధవారం ప్రతి మండల కేంద్రమూ ధర్మయుద్ధానికి వేదికైంది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ‘బాబు దగాలు... జనం దిగాలు’ అంటూ కదం తొక్కిన పార్టీ శ్రేణులకు రైతులు, డ్వాక్రా మహిళలు సైదోడుగా నిలిచారు. ఆడి తప్పిన చంద్రబాబును నిరసించే నినాదాలు ఆయన పాలనపైజనాభిప్రాయానికి
ప్రతిధ్వనిగానిలిచాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీపై ఇచ్చిన హామీ అమలులో, ఇతరత్రా టీడీపీ సర్కా రు వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు బుధవారం చేపట్టిన నిరసనలో జిల్లా అంతటా రైతులు, మహిళలు, ప్రజలు భాగస్వాములయ్యారు. మండల కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయాలను చుట్టుముట్టి ధర్నా చేశారు. మాట తప్పిన చంద్రబాబు తీరును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో రైతులు, మహిళల్లో ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత ఈ ఆందోళనలో స్పష్టంగా కనిపించింది. ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఆందోళనలో పాల్గొని సర్కార్‌పై నిప్పులు చెరిగారు. జిల్లా అంతటా బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు, తహశీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. కార్యకర్తలు గ్రామాల నుంచి బైక్ ర్యాలీలు చేస్తూ, పార్టీ జెండాలు చేతపట్టి మండల కేంద్రాలకు తరలివచ్చారు.
సమన్వయంతో సమరానికి...
పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ నియోజకవర్గాల కో ఆర్డినేటర్‌లు, నేతలతో సమన్వయం చేసుకుంటూ జగ్గంపేట, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో జరిగి న ధర్నాల్లో పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ముట్టడించారు. ప్రజలకు కష్టమొస్తే చంద్రబాబును సైతం నిలదీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయాడని ద్వా రంపూడి ప్రశ్నించారు. రుణమాఫీ అంటూ మో సం చేసిన చందబ్రాబును నెహ్రూ ఎండగట్టారు. పార్టీ కన్వీనర్ ఫ్రూటీ కుమార్, అనుబంధ విభాగా ల కన్వీనర్లు శెట్టిబత్తుల రాజబాబు, రావూరి వెంకటేశ్వరరావు, గుండా వెంకటరమణ, మాజీ డి ప్యూటీ మేయర్ పి.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
పోలీసులు అడ్డుకున్నా ఆగని గిరిజనులు
జగ్గంపేటలో నెహ్రూతో పాటు జెడ్పీ ప్రతిపక్ష నేత నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందచేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కొత్తపేటలో రోడ్డుపై బైఠాయించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి నిర్మలకుమారి, అధికార ప్రతినిధి డేవిడ్‌రాజు, సేవాదళ్ మార్గాని గంగాధర్ పాల్గొన్నారు.రంపచోడవరం ధర్నాకు ఏజెన్సీలోని బూసిగూడెం, మడిచర్ల, కాకవాడ తదితర లోతట్టు గ్రామాల నుంచి వస్తున్న గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు. అయినా గిరిజనులు పెద్ద ఎత్తున తరలిరాగా ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ యువజన విభాగం కన్వీనర్ అనంతబాబుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ అధికారప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ పాల్గొన్నారు. ఏజెన్సీ అంతటా మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు.
చెవిలో పువ్వులతో వినూత్న నిరసన
ప్రత్తిపాడు, ఏలేశ్వరంలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో రైతులు, పార్టీ నాయకులు, కేడర్ తరలివచ్చి ధర్నా చేశారు. రాజమండ్రిలో సబ్‌కల్టెర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఆది రెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. కార్పొరేషన్‌లో పార్టీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని చంద్రబాబు తీరును ఎండగట్టారు. రాజానగరంలో తహశీల్దార్ కార్యాలయం ప్రధాన గేటును పోలీసులు మూసేసి తాళాలు వేయడంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా వారితో వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వం ప్రజల చెవుల్లో పువ్వులుపెట్టిందంటూ వినూత్నంగా చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సీతానగరంలో తహశీల్దార్ కార్యాల యానికి తాళాలు వేసి ధర్నా నిర్వహించారు.
రామచంద్రపురం నియోజకవర్గం మూడు మండలాల్లో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. పార్టీ జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యనమదల గీతమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మండపేట రాజారత్నం సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ నాయకుడు వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, అనుబంధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రామచంద్రపురం, రాయవరంలలో జరిగిన ఆం దోళనల్లో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగి రెడ్డి పాల్గొన్నారు. పెద్దాపురం, సామర్లకోటలలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు.
మహిళలు, రైతులకు జ్యోతుల కృతజ్ఞత
అమలాపురం, ఉప్పలగుప్తంలలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయిల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ పట్టణ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర, లీగల్‌సెల్ కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ, డీసీసీబీ డెరైక్టర్ ఇళ్ల గోపాలకృష్ణ, చెల్లుబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ రూరల్, కరప తహశీల్దార్ కార్యాలయాల వద్ద కో ఆర్డినేటర్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుల ఆధ్వర్యంలో మహిళలు, రైతులు ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల్లో జరిగిన ధర్నాల్లో పార్టీ నాయకులు విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు,
కడియం తహశీల్దార్ కార్యాలయాల వద్ద రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. అనపర్తిలో కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తుని, ముమ్మిడివరం నియోజకవర్గాల మండలాల్లో మండల కన్వీనర్లు, పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహశీల్దార్‌లకు వినపతిపత్రాలు అందచేశారు. పార్టీ ఆందోళనకు జిల్లా అంతటా మద్దతుగా నిలిచిన మహిళలు, రైతులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల కృతజ్ఞతలు తెలిపారు.