అన్నీ హామీలే.. చేతల్లేవ్
► రుణ ఉపశమనానికి నోచుకోని ఉద్యాన రైతులు
► జిల్లాకు రూ.68.22 కోట్లు కేటాయించినా ఎవరికి అందని వైనం
► అన్నదాతకు తప్పని ఎదురుచూపులు
ఉద్యాన రైతుకు నిరాశే మిగిలింది. రుణ ఉపశమనం కింద వారికి ఇంతవరకు రూపాయి కూడా అందలేదు. ప్రభుత్వం మొదటి హామీగా ఉన్న రుణమాఫీని అంతంత మాత్రంగానే చేసిందనడానికి ఇదే నిదర్శనం. అధికారంలోకి రాక ముందు ఒకమాట.. వచ్చాక మరోమాట చెబుతూ బాబు సర్కార్ సాగుతోంది. నిరుద్యోగ భృతి, ఇంటింటికి ఉద్యోగం, గూడులేని ప్రతి నిరు పేదకు ఇళ్లంటూ కబుర్లు చెప్పినా అవి అమలుకు నోచుకోలేదు.
సాక్షి, కడప: టీడీపీ హామీల మాయ నుంచి తేరుకోలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అంతలోనే మాఫీ సొమ్ము అందని ఉద్యాన రైతులకు ఉపశమనం కల్పిస్తామని బాబు పెద్ద ఎత్తున ప్రచార ఆర్బాట సభ నిర్వహించి ఏదేదో చేసినా ఇప్పటికీ ఇంకా సొమ్ము అందలేదు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు అవుతున్నా నేటికీ రుణ ఉపశమనం కలగలేదు. బ్యాంకు అధికారులు చేసిన పొరపాటో..పాలకుల ఏమరుపాటో తెలియదుగానీ రెండు నియోజకవర్గాల్లోని వేలాదిమంది ఉద్యాన రైతులకు నేటికీ ఉపశమనం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉద్యాన రైతులకు ఉపశమనం కల్పిస్తున్నామని చెప్పి కడపలోని మున్సిపల్ స్టేడియంలో సభ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కోట్లాది రూపాయల చెక్కును చంద్రబాబు అందజేశారు. అంతేకాకుండా సభ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. .దాదాపు రెండేళ్లు అవుతున్నా ఉద్యాన రైతుకు రుణ ఉపశమనం లభించలేదు. జిల్లాకు 35,590 మందికి రూ. 68.22 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు రూ. 40 కోట్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. 20 వేల మందికి పైగా రైతులకు అందించినట్లు తెలుస్తున్నా మిగిలినవారికి ఎదురుచూపులు తప్పడం లేదు.
12–15 వేల మంది ఎదురుచూపు: జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని ఓబులవారిపల్లె, పుల్లంపేట, చిట్వేలి, పెనగలూరు, ఒంటిమిట్ట, సుండుపల్లి, వీరబల్లితోపాటు పలు మండలాల రైతులకు ఉద్యాన ఉపశమనం అందలేదు. వీరంతా 12 నుంచి 15 వేల మంది ఉంటారని అంచనా, వారికి 18 నుంచి 20 కోట్ల రూపాయల మేర రావాల్సి ఉంది. జిల్లా అంతటా అందినా ఒక్క ఈ రెండు నియోజకవర్గాల్లో ఎస్‌బీఐ పరి«ధిలోని రైతులకు మాత్రమే అందనట్లు తెలుస్తోంది. కారణం బ్యాంకు అధికారులు డేటా అప్‌లోడ్ చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం అప్‌లోడ్ కాలేదని పేర్కొంటూ కాలాయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా రైతుల డేటా అప్‌లోడ్‌తోపాటు మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల ఉపశమనం సొమ్ము అందకపోవడం వేధిస్తోంది. ఈ విషయమై బ్యాంకు ఉన్నతాధికారులను ‘సాక్షి’ సంప్రదించినా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఎప్పుడొస్తుందో?: "మాది రాజంపేట పరిధిలోని ఊటుకూరు. గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే రైతులంటే అధికారులకు, నాయకులకు చులకనగా మారింది. ఊటుకూరు గ్రామంలోని 1328, 1329 సర్వే నంబర్‌లో ఉన్న నా పొలంలో అరటి, ఆకు తోటలు సాగు చేస్తున్నాను. ప్రభుత్వం ఉద్యాన రైతులకు ఇస్తామన్న రుణమాఫీ సొమ్ము ఇంతవరకు అందలేదు. ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు." ---ఆర్.పెంచల్‌రాజు.
డబ్బుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం: " మాది రాజంపేటలోని ఊటుకూరు. గ్రామంలోని 1327, 891,893 సర్వే నంబర్‌లో అయిదెకరాలు ఉంది. అందులో ఆకుతోట సాగుచేసే వాళ్లం. రుణమాఫీ కింద అందించే ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నాం. డబ్బుల కోసం ఎస్‌బీఐ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాం. మమ్ములను ఎవరూ పట్టించు కోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు ఇప్పిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది." -- బాలరాజు సుబ్బలక్షుమ్మ.