డ్వాక్రా రుణమాఫీకి పైసా కూడా ఇవ్వలేదు | Paritala Sunitha answer in the Assembly about dwcra loan waiver | Sakshi
Sakshi News home page

డ్వాక్రా రుణమాఫీకి పైసా కూడా ఇవ్వలేదు

Published Sat, Sep 8 2018 4:03 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM

Paritala Sunitha answer in the Assembly about dwcra loan waiver  - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల హామీ అయిన డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదని, అసలు అలాంటి ఆలోచనే లేదని టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని స్త్రీ,శిశు సంక్షేమ, సెర్ప్, మహిళా సాధికారిత మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో డ్వాక్రా రుణాల చెల్లింపులపై సమాధానం ఇస్తూ ఈ విషయం తెలిపారు. 2014–15, 2015–16, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్వాక్రారుణాల మాఫీ మొత్తం ఎంత? జిల్లాల వారీగా వివరాలు ఇవ్వాలని, రాష్ట్రంలో 2014 జూన్‌ నాటికి మిగిలి ఉన్న డ్వాక్రా రుణాల మొత్తం ఎంత, ఇప్పటి వరకూ మాఫీ చేసిన రుణాల మొత్తం ఎంత, డ్వాక్రా రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదన ఉందా? అయితే ఆ వివరాలు ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు పాముల పుష్ప శ్రీవాణి, ఆర్‌కే రోజా, గౌరు చరితారెడ్డి రాతపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి మంత్రి సునీత సమాధానమిస్తూ.. 2014 నుంచి 2018 వరకూ ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని, డ్వాక్రా రుణాల మొత్తం రూ. 11,069 కోట్లు ఉన్నాయని, దీనికి ఒక్క పైసా కూడా మాఫీ కింద చెల్లించలేదని, దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనా కూడా లేదని జవాబిచ్చారు. అయితే మహిళలకు పసుపు కుంకుమల కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు ప్రకటించామని, ఇప్పటికే రూ.8 వేలు ఇచ్చామన్నారు. డ్వాక్రా రుణమాఫీ కంటే పసుపు కుంకుమకే ఎక్కువ ఇచ్చామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. 2014 మార్చి 31కి ముందు రిజిస్టర్‌ అయిన గ్రూపులకు మాత్రమే ఇచ్చామని, కొత్త గ్రూపులకు ఇవ్వలేదని స్పష్టంచేశారు. 

ప్రతిపక్షం మీ దగ్గరే ఉందికదా..
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష శాసనసభ్యులు ఈ ప్రశ్న వేశారని టీడీపీ ఎమ్మెల్యే వెంకటేష్‌ అన్నారు. మంత్రి దీనిపై మరో రకంగా సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. వాస్తవానికి పసుపు కుంకుమ కింద అంతకంటే ఎక్కువే ఇచ్చామని, డ్వాక్రా రుణాల మాఫీ గురించి ప్రస్తావించకూడదని ఆయన సలహా ఇచ్చారు. దీనిపై బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు స్పందిస్తూ.. 22 మంది ప్రతిపక్ష సభ్యులు మీదగ్గరే ఉన్నారు కదా అని అన్నారు. అలాంటప్పుడు ప్రతిపక్షం బయట ఉందని ఎలా అంటారని ప్రశ్నించారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇరుకున పడ్డారు. వెంటనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కలుగజేసుకుని ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషిస్తున్నామని చెప్పి టాపిక్‌ను మార్చేప్రయత్నం చేశారు. 

మహిళలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు
గ్రామ దర్శిని, నగర దర్శిని కార్యక్రమాల్లో ఊళ్లకు వెళ్లినపుడు మహిళలు డ్వాక్రా రుణాల మాఫీపై గట్టిగా ప్రశ్నిస్తున్నారని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌ ఇబ్బందులని, ఆధార్‌ ఎన్‌రోల్‌మెంటు లేదని, బ్యాంకు ఖాతాలు లేవని అధికారులు చెబుతున్నారని బోండా ఉమా, జోగేశ్వరరావు, వర్మ తదితరులు తెలిపారు. నాలుగేళ్లుగా డ్వాక్రా మాఫీపై అడుగుతూనే ఉన్నాం, మంత్రి చెబుతూనే ఉన్నారని, కానీ మాఫీ కాలేదని పేర్కొన్నారు. ఏ ఊరికి వెళ్లినా.. మేనిఫెస్టోలో పెట్టిన డ్వాక్రా రుణమాఫీ హామీని ఎందుకు నెరవేర్చడం లేదంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

కమిటీ ఎందుకు వేయడంలేదు
రాష్ట్రంలో అక్రమంగా మైనింగ్‌పై ఎందుకు కమిటీ వేసి నిగ్గుతేల్చలేక పోతున్నారని, దీనికి భయమెందుకని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో పలు సిమెంటు కంపెనీలు అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నాయని, ప్రభుత్వం దీనిపై కమిటీ వేస్తే సాక్ష్యాలు చూపిస్తానని, కానీ ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతోందో అర్థం కాలేదని అన్నారు. దీనికి మంత్రి సుజయకృష్ణ రంగారావు ‘చర్యలు తీసుకుంటాం’ అని క్లుప్తంగా సమాధానం చెప్పారు.

డ్వాక్రా రుణాలపై ఎమ్మెల్యేలు ఏమన్నారు
మృణాళిని: పెట్టుబడి నిధి రావట్లేదని మహిళలు చెబుతున్నారు. తాము డ్వాక్రా కమిటీలో సభ్యులమైనా ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. చాలామంది తమ ఖాతాల్లో డబ్బులు వెయ్యడం లేదని చెబుతున్నారు.
వర్మ: గ్రామదర్శిని కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు మహిళలు దీనిపైనే గట్టిగా నిలదీస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రూపుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే. క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందిగా ఉంది. మంత్రిగారు దీనిపై చర్యలు తీసుకోవాలి.
కూనరవికుమార్‌ గౌడ్‌: 2014 తర్వాత ఏర్పడిన గ్రూపులు ఏం కావాలి. పాత వారికి కూడా ఆన్‌లైన్‌లో సమస్యలని, ఆధార్‌ ఎన్‌రోల్‌లో సమస్యలని ఏదో ఒక కారణంతో పసుపు కుంకుమకు ఇచ్చే నిధులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
జోగేశ్వరరావు: తమకు పసుపు కుంకుమ పథకం అందడంలేదని చాలా చోట్ల మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement