మెలికల మాఫీ?
- ‘బంగారు’ రుణాలపై ఆంక్షలు
- ఆచరణ సాధ్యంకాని నిబంధనలు
- భారం తగ్గించుకునే పన్నాగం
రుణమాఫీ ఓ ప్రహసనంగా మారింది. ఎన్నికల సమయంలో రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ‘ఏరు దాటాక తెప్ప తగలేసిన’ చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణాలకు సంబంధించి ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, అడంగల్ కాపీ సమర్పిస్తేనే మాఫీ చేస్తామని మెలిక పెట్టడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మచిలీపట్నం : తెలుగుదేశం ప్రభుత్వం రోజుకో రకమైన ఆంక్షను విధిస్తూ రుణమాఫీ భారాన్ని గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల ప్రచారం సమయంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించడమే కాకుండా... రైతులెవరూ రుణాలు చెల్లించొద్దు తమ్ముళ్లూ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు.
అయితే వ్యవ సాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్న పాలకులు తీరా పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు కంగుతిన్నారు. రుణమాఫీ జరగాలంటే ఆధార్ , పొలం సర్వేనంబరు, అడంగల్ కాపీ తదితర వివరాలను ఇవ్వాలనే ఆంక్షలు విధించడంతో మరింత గందరగోళానికి గురవుతున్నారు.
అడంగల్ కాపీల్లో భూమి యజమాని పేరు వేరే ఉండగా ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులు వేరే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడే రుణమాఫీకి సంబంధించి కొంతమేర కోత పడినట్లయ్యింది. అనంతరం ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదని ప్రకటించారు. సంబంధిత పత్రాలు సమర్పిస్తేనే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని మెలిక పెట్టారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఒక రైతుకు రూ. 75వేలకు మించి రుణం మంజూరు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నాలుగైదు ఎకరాల పొలం ఉన్న రైతు పీఏసీఎస్ ద్వారా ఇచ్చే పంట రుణం రూ. 75వేలు కావడంతో మిగిలిన పెట్టుబడి కోసం బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు కొంతమేరకే రుణమాఫీ అంటుండడంతో రైతు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
బంగారు రుణాలు రూ. 3,276 కోట్లు...
జిల్లాలో 1,89,587 మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ. 3,276 కోట్ల రుణం తీసుకున్నారు. వరి సాగుకు సంబంధించి ఎకరానికి రూ. 24వేలు మాత్రమే పంట రుణంగా అందించే అవకాశం ఉంది. బ్యాంకు మేనేజరుకు, రైతుకు ఉన్న అవగాహన నేపథ్యంలో బంగారం తాకట్టు పెట్టి పంట రుణం తీసుకుంటే రూ. 24వేల కన్నా అధిక మొత్తంలోనే పంట రుణంగా మంజూరు చేశారు. ప్రభుత్వం తాజాగా ఎకరానికి పంట రుణం ఎంత మేర ఇచ్చే వెసులుబాటు ఉందో అంతే రుణమాఫీ చేస్తామనే ఆంక్షలు విధించటంతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది.
ఈ మేరకు బ్యాంకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రం మొత్తం మీద వ్యవసాయ రుణాలు రూ. 87 వేల కోట్లుండగా వాటిలో పంట రుణాల పేరుతో రూ. 35 వేల కోట్లకు కుదించారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రుణమాఫీ కోసం కేవలం రూ. 5వేల కోట్లు కేటాయించి అందులో వెయ్యి కోట్ల రూపాయలను నాన్‌ప్లాన్ గ్రాంటుగా ఉంచారని మిగిలిన రూ. 4వేల కోట్లను రుణమాఫీకి ఇచ్చేందుకు అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.