రాష్ట్రంలో ఇష్టారాజ్యం | Ap govt self goal on ec decision | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఇష్టారాజ్యం

Published Fri, Mar 29 2019 2:36 AM | Last Updated on Fri, Mar 29 2019 4:09 AM

Ap govt self goal on ec decision - Sakshi

సాక్షి, అమరావతి:  రాజ్యాంగ సంస్థలంటే గౌరవం లేదు.. కేంద్ర సంస్థలంటే అసలే లెక్కలేదు.. ఏ వ్యవస్థనైనా ఏమార్చేద్దాం అనుకుంటారు. తాను ఆత్మరక్షణలో పడిన ప్రతిసారీ అడ్డంగా ఎదురుదాడి చేస్తూ అడ్డగోలు వాదనలకు దిగడం. అభ్యంతరకరమైన నిర్ణయాలతో రాజ్యాంగ సంక్షోభానికి తెరతీయడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పుచేసి దొరికిపోయినా సంబంధం లేని అంశాలతో  ఎదురుదాడి చేసి ఏమార్చేద్దామనుకునే నైజం, ఆయన మార్కు రాజకీయం ప్రతిసారీ వివాదాస్పదమవుతోంది. తాజాగా స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని సైతం కోర్టులో సవాలు చేసిన చంద్రబాబు.. రాజ్యాంగ సంక్షోభానికి తెరతీసారని మేథావులు, సీనియర్‌ అధికారులు తప్పుబడుతున్నారు. పాలక పక్షానికి కొమ్ముకాస్తున్న ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై ఈసీ వేటు వేసిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేసి ఎన్నికలు స్వేచ్ఛాపూరిత వాతావరణంలో, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆరోపణలు వచ్చిన ఇంటెలిజెన్స్‌ అధికారిని సీఈసీ ఆదేశాల నేపథ్యంలో తొలుత ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఒక్కరోజు కూడా కాకుండానే ఆ జీవోను రద్దు చేస్తూ కొత్త జీవో జారీ చేయడం, సీఈసీ చర్యను కోర్టులో సవాల్‌ చేసిన నేపథ్యంలో ఇటీల కొంతకాలంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.

రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రైవేటు సంస్థకిచ్చేసి..
ఇటీవల వెలుగు చూసిన ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెల్సిందే. కోట్లాది మంది రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలు తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించారు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఆ సమాచారాన్ని సేవామిత్ర యాప్‌కు మళ్లించి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుతో పాటు అనేక అక్రమాలకు పాల్పడుతూ తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. దీనిలోని కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ఎదురుదాడికి దిగుతూ ఏకంగా రెండు సిట్‌లు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదంగా సృష్టించి విషయాన్ని పక్కతోవ పట్టించే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నం బెడిసి కొట్టడంతో కేంద్రం, తెలంగాణ రాష్ట్రం చేసిన కుట్రగా చిత్రీకరించాలని చూశారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు వ్యవహారంలోనూ ఇలాగే ఎదురు ఫిర్యాదులు చేయించారు. ఐటీ గ్రిడ్స్‌ సీఈఓ అశోక్‌కు విజయవాడలో ఏపీ ప్రభుత్వమే ఆశ్రయమిచ్చిందనే ఆరోపణలు రావడం గమనార్హం. గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు .. ఫోన్లను ట్యాపింగ్‌ చేశారంటూ ఎదురుదాడికి దిగి ఏపీలోనూ కేసులు పెట్టించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)ను ఏర్పాటు చేసి, దాన్ని కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం.

జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్ర బయటపడకుండా..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గత ఏడాది అక్టోబర్‌ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంలో కుట్ర కోణం వెలుగు చూడకుండా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధాన ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం విషయంలో బాధ్యతతో స్పందించాల్సిందిపోయి హేళనగా మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. తర్వాత ఎయిర్‌పోర్టు భద్రత తమ పోలీసుల పరిధిలోనిది కాదంటూ తప్పించుకునే దారులు వెదికారు. అటువంటప్పుడు గతంలో విశాఖ బీచ్‌లో జరిగిన ప్రత్యేక హోదా ర్యాలీకి సంఘీభావంగా హాజరయ్యేందుకు వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డిని అదే విమానాశ్రయం రన్‌వేపై ఏపీ పోలీసులు ఎలా అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తే చంద్రబాబు యంత్రాంగం నుంచి సమాధానం లేదు. ఈ కుట్రలో సూత్రధారులెవరో తేల్చకుండా, నిందితుడు శ్రీనివాస్‌ను తన ఫ్యూజన్‌ రెస్టారెంట్‌లో పనిలో పెటుకున్న టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరిని విచారించకుండా చంద్రబాబు చక్రం తిప్పారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తే పట్టించుకోకుండా తాను చెప్పినట్టు వినే సిట్‌ను ఏర్పాటు చేశారు. చివరకు కోర్టు ఆదేశాలతో ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభిస్తే.. వారికి రాష్ట్ర పోలీసులు సహకరించకుండా చేశారు. ఎన్‌ఐఏ దర్యాప్తును కోర్టులో సవాల్‌ చేయించారు. ఎన్‌ఐఏ దర్యాప్తు చేపడితే కుట్రకోణం వెలుగు చూస్తుందనే భయంతోనే చంద్రబాబు ఆ దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటం గమనార్హం. 

సీబీఐకి నో ఎంట్రీ...
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో అవినీతి ఆరోపణలు గుçప్పుమంటున్న నేపథ్యంలో.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడులకు సిద్ధమైందనే సమాచారంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. అవినీతి అధికారులపై సీబీఐ దాడులు చేస్తే తనకు ఇబ్బందులు తప్పవని భావించిన ముఖ్యమంత్రి సీబీఐకి రాష్ట్రంలోకి నో ఎంట్రీ అన్నవిధంగా ఉత్తర్వులివ్వడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే గతేడాది డిసెంబర్‌లో కేంద్ర ఉద్యోగి అయిన కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సీజీఎస్‌టీ రేంజ్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌  ఎమ్‌కే రమణేశ్వర్‌పై ఏపీ ఏసీబీ దాడి చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. వాస్తవానికి ఈ ఉద్యోగిపై దాడికి సీబీఐ ఏపీ ప్రభుత్వ అనుమతి కోరితే ఆ విషయం పక్కన పెట్టి హడావుడిగా ఆ ఉద్యోగిపై రాష్ట్ర ఏసీబీతో దాడులు చేయించడం రెండు అవినీతి నిరోధక సంస్థల మధ్య వివాదానికి కారణమయ్యింది. 

ఐటీ అధికారులకు సహకరించొద్దంటూ..
ఆదాయం పన్ను చెల్లించాల్సిన వారు ఆ పన్ను చెల్లించని పక్షంలో ఆ విభాగం (ఐటీ) అధికారులు దాడులు చేయడం ఎప్పుడూ జరిగేదే. అయితే దీన్ని కూడా సొంత రాజకీయానికి వాడుకునేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనుకాడలేదు. ఆదాయపన్ను శాఖ గతేడాది సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో భాగంగా ఏపీలోనూ దాడులు చేయడంలో రాజకీయకోణాన్ని చొప్పించేందుకు ప్రయత్నించారు. పన్ను ఎగవేతదారులైన తమ పార్టీ నేతలను కాపాడుకునే క్రమంలో ఐటీ దాడులకు ఏపీ పోలీసులు సహకరించొద్దంటూ లోపాయికారీ ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఆదాయ పన్ను చెల్లించని నేతలు, కాంట్రాక్టర్లు, వ్యాపార వేత్తలు,  సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఐటీ అధికారులు మెరుపుదాడులు జరిపారు. ప్రధానంగా టీడీపీ ఎంపీ, రిత్విక్‌ కంపెని యజమాని సీఎం రమేష్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు ఆరోపణలతో దాడులు జరగడంతో కంగారు పడిన చంద్రబాబు.. ఇది కేంద్రం కుట్ర అంటూ ప్రచారానికి దిగారు. అయినా దాడులు కొనసాగడంతో వివాదాస్పద రీతిలో రాష్ట్ర పోలీసుల సహాయ నిరాకరణకు మౌఖిక ఆదేశాలిచ్చారు. గత సెప్టెంబర్‌ మొదటి వారంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారిని పిలిపించి రాష్ట్రంలో జరిగే ఐటీ దాడులకు పోలీసు బందోబస్తు ఇవ్వకూడదంటూ ఆదేశించడం దుమారం రేపింది.

డీజీపీ నియామకంలోనూ వివాదమే..
గతంలో నండూరి సాంబశివరావుకు డీజీపీగా రెండేళ్లు పొడిగింపు ఇస్తానంటూ మొదట్నుంచీ ఊరించిన చంద్రబాబు చివరి ఘడియల్లో యూపీఎస్‌సీకి సీనియారిటీ జాబితా పంపడంతో యూపీఎస్‌సీ దాన్ని తిరస్కరించింది. వాస్తవానికి రెండేళ్ల పదవీ కాలం ఉంటేనే గానీ డీజీపీగా నియమించకూడదనే నిబంధన ఉండగా సాంబశివరావు రిటైర్‌మెంట్‌కు చేరువలో ఉండటంతో యూపీఎస్‌సీ తిరస్కరించింది. ఇదేదో కేంద్రం పరిధిలోని యూపీఎస్‌సీ తప్పిదం అనే కలర్‌ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. తర్వాత పోలీస్‌ చట్టంలో (ఢిల్లీ తరహా పోలీసు చట్టం) మార్పులు చేసి, డీజీపీని సొంతంగా తామే నియమించుకుంటామంటూ ఎదురుతిరిగారు. తొలుత మాలకొండయ్యను, ఆ తర్వాత ఆర్పీ ఠాకూర్‌ను డీజీపీలుగా నియమించారు. అయితే రాష్ట్రాలే సొంతంగా డీజీపీలను నియమించుకోవడంపై నెలకొన్న వివాదాలను ఇటీవల విచారించిన సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. కేంద్ర సర్వీసులకు చెందిన ఐపీఎస్‌లను డీజీపీలుగా నియమించాలంటే యూపీఎస్‌సీకి సీనియారిటీ ప్యానల్‌ పంపాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో కంగారుపడిన చంద్రబాబు ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం మళ్లీ ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకుర్‌తో పాటు పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ (డీజీ కేడర్‌) అధికారుల జాబితాను యూపీఎస్‌సీకి పంపడం గమనార్హం. ఇలా పలు సందర్భాల్లో చంద్రబాబు కేంద్ర సంస్థలపై ఎదురుతిరిగినట్టుగా వ్యవహరించడం చర్చనీయాంశమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement