సాక్షి, అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ గళం విప్పింది. ఆ పార్టీ చట్ట సభ్యుల నినాదాల మధ్యే సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నల్లకండువాలతో సభకు వచ్చిన సభ్యులు.. గవర్నర్ ప్రసంగ సమయంలోనూ ‘హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ’ నినాదాలు చేశారు.
అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో.. నిరసనగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగం ముగియడంతో సభ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించనున్నారు.
పోలీసుల ఓవరాక్షన్
అంతకు ముందు.. లా అండ్ ఆర్డర్ ఘోర వైఫల్యంపై అసెంబ్లీకి జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి చేరుకున్నారు. సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు.. ప్లకార్డుల్ని లాక్కునే యత్నం చేశారు. ఈ క్రమంలో అవి చినిగిపోవడంతో.. జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. ప్రజా స్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా ఉంది’’ అని అన్నారాయన. దీంతో చేసేది లేక పోలీసులు కండువాలతోనే సభ్యుల్ని లోపలికి అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment