నగరి : ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ, వడ్డీలేని రుణాలు అందిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటోందని.. అందుకు అధికారులు చూపుతున్నవన్నీ కాకిలెక్కలుగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ మహిళాధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. సోమవారం నగరి పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డులో నిర్వహించిన మున్సిపల్, మండల పరిధికి సంబం ధించి ప్రభుత్వ ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వెలుగు అధికారులు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో బ్యాంకు లింకేజీ కింద 252 గ్రూపులకు రూ.90 వేలు, వడ్డీలేని రుణాలు 951 గ్రూపులకు రూ.13.8 కోట్లు, 937 మందికి స్కాలర్‌షిప్‌లు అందించామని అలాగే మండల పరిధిలో 52 సంఘాలకు రూ.2.75 కోట్లు, స్త్రీ నిధి కింద 48 సంఘాలకు రూ.79.2 లక్షలు, 552 మందికి వడ్డీలేని రుణాలు రూ.85.86 లక్షలు, 96 కుట్టుమిషన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
వినడానికే లెక్కలు..కనీసం పావలా వడ్డీకి దిక్కులేదు..
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు చెప్పినట్లు వడ్డీలేని రుణాలకు సంబంధించి వడ్డీ సొమ్ము ఖాతాల్లో పడిందా, పావలా వడ్డీ రుణాలు లభిస్తోందా? అని మహిళా సమాఖ్య సభ్యులను ప్రశ్నించారు. దీనిపై వారు తమకు వడ్డీలు ఖాతాల్లో పడడం లేదని, పావలా వడ్డీలు లేవని రూ.1.50 పైసల వడ్డీ పడుతోందని మహిళలు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. ‘మీరేమో కాకిలెక్కలు చెప్పి వెళ్లిపోతారు. అవి మహిళలకు చేరవు. వారేమో నేను ఎమ్మెల్యేను గనుక తనవద్దకు వస్తారు. అధికారులు చేసే తప్పులు ప్రజాప్రతినిధులకు చుట్టుకుంటున్నాయి’ అని అన్నారు. నగరి ప్రభుత్వాస్పత్రి రోడ్డు మార్పు విషయంపై సమావేశంలో పాల్గొన్న ఎంపీ శివప్రసాద్ దృష్టికి తెచ్చారు. తమరైనా దృష్టి సారించి ప్రజలకు ఆమోదమైన రోడ్డునే వేయించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment