సాక్షి ప్రతినిధి, కాకినాడ:అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చి, ఆనక వాటిని విస్మరించి, నమ్మి ఓటేసిన ప్రజలను నిలువునా ముంచిన చంద్రబాబుపై జిల్లాలో నిరసన పెల్లుబికింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని సవ్యంగా అమలు చేయకుండా, ఎగ్గొట్టే ఎత్తుగడలు వేస్తున్న ఆయన ప్రభుత్వంపై వివిధ వర్గాల ఆగ్రహం ఉవ్వెత్తున ఎగ సింది. ప్రజలను వంచించిన సర్కార్‌పై సమరశంఖం పూరించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు జనం మద్దతు పోటెత్తింది.ప్రభుత్వ వంచన, వైఫల్యాల్ని ఎత్తిచూపుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ రెండు రోజుల పాటు తలపెట్టిన నిరసనలు సోమవారం జిల్లా అంతటా మొదలయ్యాయి. పార్టీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా ప్రజల గొంతై ప్రతిధ్వనించారు.
రుణమాఫీ పూర్తిగా అమలు చేయకపోగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునే కనీస ప్రయత్నం చేయకపోవడాన్ని దుయ్యబట్టారు. అధికారం చేపట్టి 11 నెలలలైనా అరచేతిలో స్వర్గం చూపిస్తున్న అస్తవ్యస్త పాలనను ఎండగట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యం చేస్తూ అధికార టీడీపీ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా అన్నదాతకు దన్నుగా నిలిచారు. జిల్లా వ్యాప్తంగా ఆర్డీఓ, తహశీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీలో వివిధ స్థారుుల నేతలు ఆందోళనకు నాయకత్వం వహించగా, బాధిత వర్గాలు వెంట నిలిచాయి.
రామచంద్రపురంలో బోస్ ఆధ్వర్యంలో..
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ తరలివచ్చిన నేతలు, పార్టీ శ్రేణులతో కలిసి రామచంద్రపురంలో తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రైతు సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, తక్షణమే రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్న దృష్ట్యా తక్షణ చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్‌కు పార్టీ నాయకులతో, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డిలతో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఏలేశ్వరంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, ఎంపీపీ అయిల సత్యవతి, నాయకులు, కార్యకర్తలు తహశీల్దారు ఎంపీడీఓలకు వినతిపత్రం సమర్పించారు. ప్రత్తిపాడు తహశీల్దారుకు కూడా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీలోని రంపచోడవరంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు.
తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కోరుకొండ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారమే ధ్యేయంగా హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి పదినెలలవుతున్నా చేసిందేమీ లేదని విమర్శించారు. రైతు సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో కిర్లంపూడి, గండేపల్లి మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తహశీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం తహశీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.
హామీల అమలులో విఫలమైన బాబు..
అమలాపురం నియోజకవర్గంలో ఉప్పలగుప్తం మండల తహశీల్దారు కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. చిట్టబ్బాయి మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. పెద్దాపురంలో అక్కడి కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పెద్దాపురం డివిజన్ స్థాయి గ్రీవెన్స్‌సెల్‌లో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రూరల్ తహశీల్దారు కార్యాలయం ఎదుట రైతు సమస్యలపై ధర్నా నిర్వహించారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నగర పార్టీ అధ్యక్షుడు ఆర్.వి.జె.ఆర్.కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పార్టీ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావుతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబాజీపేటలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పి.గన్నవరం తహశీల్దారు కార్యాలయం ఎదుట నియోజకవర్గ కో ఆర్డినేటర్ పి.గన్నవరం కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో తాళ్లరేవు తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేసి తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు.
మలికిపురం, సఖినేటిపల్లి మండల తహశీల్దార్లకు పార్టీ ఎస్సీ సెల్ కార్యాదర్శి గొల్లపల్లి డేవిడ్, న్యాయవిభాగం కార్యదర్శి మంగెన సింహాద్రి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి, పిఠాపురం తహశీల్దారు కార్యాలయాల ఎదుట నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, వెంగలి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మండపేటలో రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, పార్టీ సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, మండపేట అర్బన్ కన్వీనర్ పోతంశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తహశీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. రాజమండ్రి రూరల్ కో-ఆర్డినేటర్ గిరజాల వెంకటస్వామినాయుడు ఆధ్వర్యంలో కడియం మండల తహశీల్దారు కార్యాలయం వద్ద రైతు సమస్యలపై ధర్నా చేశారు. తొండంగి తహశీల్దారు కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.శ్రీనుబాబు పాల్గొన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మంగళవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నయవంచనపై.. నిప్పులు
Published Tue, May 5 2015 2:53 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement