అప్పీల్ చేయడంలో ఈ మతలబేంటి?
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ తీర్మానం చెల్లదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీలు చేసే విషయంలోనూ టీడీపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలనే పాటించిందా? ధర్మాసనం ముందు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని చెల్లదని న్యాయస్థానం తీర్పు వెలువరిస్తే, దానిపై అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కాకుండా ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా అప్పీలు దాఖలు చేయించడంతోనే టీడీపీ నేతల డొల్లతనం బయటపడింది.
అసెంబ్లీకి హాజరుకాకుండా రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ చేసిన తీర్మానం చెల్లదని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులతో పరువు-ప్రతిష్ట కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం దానినుంచి బయటపడటానికి రకరకాల ప్రయత్నాలను ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాలను గురువారం రోజునే స్వయంగా రోజా తీసుకొచ్చి శాసనసభ కార్యదర్శికి అందజేయడమే కాకుండా న్యాయస్థానం ద్వారా అధికారికంగా కూడా ఆ ఉత్తర్వులు అందిన విషయం తెలిసిందే. దానిపై ఏం చేయాలన్న అంశంపై తర్జన భర్జన పడిన ముఖ్యమంత్రి, మంత్రులు ఆ తీర్పుపై అప్పీలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ తీర్పు ప్రతిని అందించిన తర్వాత శుక్రవారం తాను శాసనసభ సమావేశాలకు హాజరవుతానని కూడా రోజా అక్కడే ప్రకటించారు. రోజా సభకు వస్తానని ప్రకటన చేసిన నేపథ్యంలో తర్జనభర్తన పడిన టీడీపీ నేతలు ధర్మాసనం ముందు అప్పీలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
అయితే ఇక్కడ ఎవరి ద్వారా అప్పీలు చేయించాలన్న దానిలోనే తిరకాసు దాగి ఉంది. ఎందుకంటే... శుక్రవారం శాసనసభలో అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్పీకర్ మాట్లాడుతూ, రోజాను సస్పెండ్ చేయడమన్నది సభ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయంగా చెప్పారు. అంతకుముందు టీడీపీ నేతలు మంత్రి రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు మీడియాతో మాట్లాడుతూ, రోజా సస్పెన్షన్ తీర్మానం చెల్లదంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు లెక్క చేయబోమని, స్పీకర్ తీర్పుపై జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని చెప్పారు.
నిజానికి రోజాను ఏడాది పాటు సస్పెండు చేయాలంటూ అసెంబ్లీలో చేసింది ఏకగ్రీవ తీర్మానం కాదు. శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 18న రోజాను ఏడాది పాటు సస్పెండు చేస్తూ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించినప్పుడు ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. 340 నిబంధన కింద ఏడాది పాటు సస్పెండు చేసే అధికారం లేదని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ ను ఉటంకిస్తూ సోదాహరణగా చెప్పారు. ఆ సమయంలో రోజాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోగా, ఆమె సభ నుంచి బయటకు వెళ్లిన తర్వాత మాత్రమే జగన్ కు మాట్లాడే అవకాశం ఇస్తామని పట్టుబట్టి ఆమెను బయటకు పంపించారు. సభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం కాదన్న విషయం అందరికీ తెలుసు. అందుకు విరుద్ధంగా సభ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం అంటూ ఈరోజు సభలో ప్రకటన చేయడం విడ్డూరం.
ఆ తీర్మానం చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పును పట్టించుకోమని ఒకవైపు చెబుతూ రెండో వైపు ఆ తీర్పుపై అప్పీలు చేయడం గమనార్హం. స్పీకర్ నిర్ణయంపై కోర్టులు జోక్యం చేసుకోరాదని చెబుతున్న నేతలు అలాంటప్పుడు ఏమీ పట్టించుకోమని వదిలేయకుండా మళ్లీ అప్పీలుకు వెళ్లడం విచిత్రం. స్పీకర్ నిర్ణయంపై జోక్యం చేసుకునే అధికారమే లేదని చెప్పినప్పుడు సింగిల్ బెంచి తీర్పుపై స్టే కోరడమంటే... ముందు వచ్చిన తీర్పును అంగీకరించినట్లే.
ఇంకో విచిత్రమేమంటే... రోజాను సస్పెండు చేయమన్నది శాసనసభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం అని చెప్పినప్పుడు పైకోర్టులో అప్పీలును శాసనసభ కార్యదర్శి మాత్రమే దాఖలు చేయాలి. అలా కాకుండా శాసనసభ వ్యవహారాలకు సంబంధం లేని ఒక ప్రభుత్వ అధికారితో అప్పీలు దాఖలు చేయించడం. అంటే రేపటి రోజున ధర్మాసనం సింగిల్ బెంచి తీర్పును సమర్థిస్తే... ఒక మాట... స్టే ఇస్తే మరో మాట చెప్పుకోవడానికి వీలుగా ఈ రకంగా అప్పీలును ప్రభుత్వ అధికారితో దాఖలు చేయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ముఖ్య కార్యదర్శి తన అప్పీలులో కోరారు. ఈ అప్పీలుపై ధర్మాసనం సోమవారం వాదనలు విననుంది.