విందు అనుకుంటే..పంక్తికే దూరం | TDP government cancelled pensions in Kakinada | Sakshi
Sakshi News home page

విందు అనుకుంటే..పంక్తికే దూరం

Published Thu, Oct 9 2014 12:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

విందు అనుకుంటే..పంక్తికే దూరం - Sakshi

విందు అనుకుంటే..పంక్తికే దూరం

 విందు భోజనమన్న ఆశతో పంక్తిలో కూర్చున్నాక వడ్డించకుండానే విస్తరి లాగేసిన ట్టయింది.. జిల్లాలో 90 వేల
 మందికి పైగా పింఛన్‌దారుల పరిస్థితి. వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.1000కి; వికలాంగ పింఛన్‌ను రూ.1500కి పెంచుతామన్న పార్టీయే గద్దెనెక్కడంతో వారు పెంచుకున్న ఆశలపై అంతలోనే గొడ్డలివేటు పడింది. పెంపు లేకపోగా.. పరిశీలన పేరుతో ఇంతవరకూ అందుకున్న పింఛన్‌ను కూడా దూరం చేయడంతో.. కొత్తపొద్దు పొడుస్తుందనుకున్న వేళ కటికచీకటి కమ్ముకున్నట్టు విలవిలలాడుతున్నారు.. ‘అనర్హులు’ అన్న ముద్రపడ్డ అభాగ్యులు.
 
 సాక్షి, కాకినాడ : జగ్గంపేట మండలం జె.కొత్తూరుకు చెందిన సిరిమళ్ల రమణ ఏ  పనీ చేయలేని అశక్తురాలు. కొన్నేళ్లుగా వితంతు పింఛ నే ఆమెకు కొంత ఆసరా. రేషన్ కార్డులో స్త్రీగా నమోదైనా.. ఆధార్‌కార్డులో స్త్రీ అని ఉండాల్సిన చోట పొరపాటున పురుష అని నమోదైంది. అంతే..ఎవరో చేసిన తప్పిదానికి ఆమె పింఛన్ రద్దు చేశారు. వితంతు పింఛన్‌కు వయసుతో సంబంధం లేకున్నా రేషన్‌కార్డులో వయస్సు తక్కువగా ఉందనే సాకుతో ఇదే గ్రామానికి చెందిన గంట రమణ అనే వితంతువు పింఛన్ తొలగించారు. రాజపూడిలో మానసిక వికలాంగురాలైన దాసరి అచ్చియ్యమ్మకు 60 శాతానికి పైగా వైకల్యముంది. అయినా వికలాంగ పింఛన్ దూరం చేయడంతో.. గ్రామంలో బుధవారం జరిగిన జన్మభూమి సభకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించడం చూసిన వారిని కలచివేసింది. గండేపల్లి మండలం యర్రంపాలెంకు చెందిన  80 ఏళ్ల వృద్ధుడి పింఛన్‌ను (రేషన్‌కార్డులో 66ఏళ్లు వయసున్నా) తొలగించారు.
 
 వై.రామవరానికి చెందిన నెల్లిపూడి అమ్మాజీకి ఏవిధమైన భూమి లేకున్నా ఐదెకరాలుందన్నగ్రామ కమిటీ తప్పుడు నివేదికతో పింఛన్ రద్దు చేశారు. కొత్తపల్లికి  చెందిన పోకల లక్ష్మి(60) అనే వితంతువు 2008 నుంచి 2014 సెప్టెంబర్ వరకూ  వృద్ధాప్య పింఛన్ తీసుకుంది. అయితే రేషన్‌కార్డులో వయసు తక్కువగా ఉందని పింఛన్ తొలగించారు. పోనీ వితంతు పింఛన్ ఇవ్వమని దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదు. కొత్తపల్లికే చెందిన సీహెచ్ రత్నం ఆధార్ కార్డులో వయసు 75 ఏళ్లని ఉన్నా రెండు ఎకరాల భూమి ఉంద న్న సాకుతో లబ్ధికి ఎగనామం పెట్టారు. లేవలేని స్థితిలో ఉన్న రత్నానికి పూరిగుడిసె తప్ప ఏమీ లేదు. రాజమండ్రి నెహ్రూనగర్‌కు చెందిన కొక్కిరి మేరి (69) ఇళ్లలో పనులు చేసి బతుకుతోంది. ఆమెకు సెంటు భూమి లేకున్నా 5 ఎకరాల పొలం ఉందని పింఛన్ రద్దు చేశారు. రాజేంద్రనగర్‌కు చెందిన గీసాల అప్పలకొండ వయసు ఆధార్ కార్డులో 70 ఏళ్లుగా నమోదైనా ఏ కారణం చూపకుండానే పింఛన్ నిలిపివేశారు.
 
 చలనం లేని అధికారులు
 ఇలా చెప్పుకొంటూ పోతే జిల్లాలో జరుగుతున్న ప్రతి జన్మభూమి సభలో పింఛన్లు కోల్పోయిన వారి గోడు మార్మోగుతూనే ఉంది. ‘మేం చేసిన నేరమేమిటి? మాకీ శిక్ష ఏమిటి?’ అన్న నిస్సహాయుల ఆక్రందన వినేవారి హృదయాలను కదిలిస్తున్నా.. అధికారుల్లో చలనం కరువవుతోంది. అనర్హులని కొందరిని, ఆధార్‌కార్డు లేదని మరికొందరిని, వయస్సు సరిపోలేదని ఇంకొందరిని, కార్డుల్లో అక్షర, సాంకేతిక దోషాల వల్ల కొందరిని, చివరకు గత ఎన్నికల్లో టీడీపీకి ఓటేయలేదన్న కక్షతో కొందరిని ఆసరాకు దూరం చేసిన వాస్తవం ఊరూరా కళ్లకు కడుతూనే ఉంది. ‘మా నోటి కాడ కూడు లాక్కోవద్దు బాబూ!’ అంటూ వారు పెడుతున్న గగ్గోలు పాలకుల చెవిని సోకిన దాఖలా లేదు.
 
 అన్నీ ‘అకారణాలూ’, కుంటిసాకులే..
 జిల్లాలో 4,65,617 పింఛన్లుండగా, వాటిలో 90,981 పింఛన్లను ఈ నెల నుంచి నిలిపివేశారు. వీటిలో 40,509 మందిని అనర్హులంటూ శాశ్వతంగా తొలగించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో పక్కన పెట్టారు. అర్హులుగా గుర్తించిన జాబితాను స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్‌ఆర్ డీహెచ్) డేటా ఆధారంగా ఆన్‌లైన్‌తో అనుసంధానించే సమయంలో వయసులో వ్యత్యాసాలు, పొలాలు, ఇళ్లు, ఇతర ఆస్తులున్నాయనే కారణంతో 38,957 మందిని పక్కన పెట్టారు. అనేక కారణాల వల్ల పింఛన్లు నిలిచిపోయిన వారిలో అత్యధికులు వృద్ధులే. ఆధార్ నంబర్లు లేవని, కేటగిరీలు మారిపోయాయని 4,363 మందికి, సర్వే సమయంలో స్థానికంగా లేరని మరో 7,162 మందికి పింఛన్లు నిలిపేశారు.
 
 కొందరికి పేరు, వివరాలు సరిగానే ఉన్నా మహిళలకు పురుష అని, పురుషులకు స్త్రీ అని పొరపాటున ముద్రించడాన్నీ సాకుగా చూపి పింఛన్లు నిలిపివేశారు. రేషను, ఆధార్‌కార్డులు, పింఛను దారుల జాబితాలో పేర్ల నమోదులో అక్షరదోషాల వల్ల మరికొందరి పింఛన్లు ఆపివేశారు. పది శాతం మంది పింఛన్లు తొలగించారు. అన్ని అర్హతలూ ఉన్నా..పనులకు తాత్కాలికంగా వలస వెళ్లిన వారిపైనా వేటు వేశారు. ఈ నెల రెండున ప్రారంభమైన జన్మభూమి గ్రామసభల్లో ఎక్కడికక్కడ బాధితుల నుంచి ఎక్కువగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శంఖవరం మండలం జి.కొత్తపల్లి పంచాయతీ వద్ద పింఛన్లు కోల్పోయిన 100 మంది ఆందోళన చేశారు. తమకు ఆ కాస్త ఆసరానూ దూరం చేయొద్దని ఆక్రోశించారు. మరి, వేలాదిమంది వేదన అరణ్యరోదన అవుతుందో లేక పాలకుల మనసును కరిగిస్తుందో చూడాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement