స్పౌజ్ కేటగిరీ పింఛన్లపై కూటమి సర్కారు నిర్ణయం
పింఛన్ లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తింపు
భార్యను పోగొట్టుకుని.. ఇప్పటికీ పెన్షన్ రాకున్నా భర్తకు మొండిచెయ్యే
భర్త చనిపోతే భార్యకు పెన్షన్ సైతం గత నవంబర్ 1 తర్వాత నుంచే అమలు
నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్య దాదాపు 23 వేల మంది పింఛన్ లబ్ధిదారులు మృతి
కానీ కేవలం 5,401 మందికే కొత్త పింఛన్లు
కూటమి సర్కార్ వచ్చాక కొత్త దరఖాస్తులకూ నో చాన్స్
కొత్తవి దేవుడెరుగు.. ఉన్నవే ఊడగొడుతున్నారు
గత 6 నెలల్లో దాదాపు 1.72 లక్షల దాకా తగ్గిన పింఛన్లు
మరో 8 లక్షల దివ్యాంగ పింఛన్లపై వేలాడుతున్న ఏరివేతల కత్తి
ఎన్నికల ముందు అందిన 2 లక్షల దరఖాస్తులు చెత్తబుట్టలోకే
సాక్షి, అమరావతి: దంపతులంటే..? జీవిత భాగస్వాములంటే..? భార్యాభర్తలు కాదా? వైవాహిక బంధానికి కూటమి సర్కారు కొత్త భాష్యం చెబుతోంది! పేదల పింఛన్ల విషయంలో చిత్ర విచిత్ర నిబంధనలు పెడుతోంది. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మనసొప్పని సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరణించిన పింఛన్‌దారుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎడాపెడా పింఛన్లకు కోత పెడుతూ.. అసలు కొత్త వాటి ఊసే లేకుండా చేసింది.
ఆర్నెల్లలో దాదాపు 1.72 లక్షల పింఛన్లు తగ్గిపోయాయి. మరోవైపు లక్షలాది దివ్యాంగ పింఛన్లపై ఏరివేతల కత్తి వేలాడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి కొత్త పింఛన్ల మంజూరు కోసం కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు. ఇప్పటికే పింఛన్ పొందుతున్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలో కొత్తగా మరొకరికి పెన్షన్ ఇచ్చే విషయంలో వింత విధానాలను అమలు చేస్తోంది.
పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కేటగిరీలో కేవలం భార్యకు మాత్రమే ఆ స్థానంలో పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని అమలు చేస్తోంది. స్పౌజ్ అంటేనే భార్యా భర్తలని అర్థం! కానీ ఆ పదానికే అర్థం మార్చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ఇంటికి ఒకే పింఛను విధానం ప్రకారం... ఎక్కడైనా భార్య చనిపోయి, ఆ కుటుంబంలో భర్త ఇప్పటికీ పింఛను పొందని పరిస్థితి ఉంటే... 70–80 ఏళ్ల వయసులోనూ స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ మంజూరు కాని దుస్థితి నెలకొంది.
గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం అర్హులకు ఏడాది పొడవునా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఇప్పుడా ఆస్కారమే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని పడిగాపులు కాస్తున్నా కనికరించడం లేదు.
ప్రస్తుతం ఫించన్ తీసుకుంటూ కుటుంబంలో భర్త చనిపోతే అతని భార్యకు మాత్రమే కొత్త పింఛన్ మంజూరు చేసేలా జారీ చేసిన సర్క్యులర్ ఇది. అది కూడా నవంబర్ 1 తర్వాత చనిపోయిన వారికే వర్తించేలా..
23 వేల మంది చనిపోతే.. ఐదు వేల మందికే!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 15 మధ్య పింఛను లబ్ధిదారుల్లో దాదాపు 23 వేల మంది చనిపోగా స్పౌజ్ కేటగిరీలో కేవలం 5,401 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. వీరికి డిసెంబరులో పింఛన్లు మంజూరు కాగా నెలాఖరులో తొలి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూన్ 12వ తేదీ నుంచి నవంబరు 1కి ముందు వరకు దాదాపు నాలుగున్నర నెలల వ్యవధిలో భర్తలు మృతి చెందిన పింఛన్ లబ్ధిదారుల కుటుంబాల్లో వారి భార్యలకు మాత్రం పెన్షన్లు మంజూరు చేయలేదు.
50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ..
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.నాలుగు వేల పింఛన్ ఇస్తామంటూ టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో హామీలిచ్చాయి. 50 ఏళ్లకే పింఛను దేవుడెరుగు.. కూటమి సర్కారు వచ్చాక ఉన్న పెన్షన్లే ఊడగొడుతున్నారని లబ్ధిదారులు ఆక్రోశిస్తున్నారు.
ఎడాపెడా కోతలు..
ఒకవైపు కొత్తగా పింఛన్ల కోసం ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసిన చంద్రబాబు సర్కార్ మరోవైపు ఎడాపెడా పెన్షన్లు ఏరివేస్తూ పింఛన్‌దారులను హడలెత్తిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో ప్రతి నెలా పింఛన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గత ఆర్నెల్లలో ఏకంగా 1,71,921 పింఛన్లను తగ్గించేసింది. గతేడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగగా, గత డిసెంబరు 31న కూటమి ప్రభుత్వం కేవలం 63,77,943 మందికి మాత్రమే పింఛన్ల డబ్బులు విడుదల చేసిన విషయం తెలిసిందే.
పింఛన్లకు మరింత భారీగా కోతలు పెట్టేందుకు పక్షవాత బాధితులు, దివ్యాంగులు అని కూడా చూడకుండా దీర్ఘకాలిక జబ్బుల రోగులకు శల్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ కేటగిరీలో పింఛన్లు పొందుతున్న 8.18 లక్షల మంది లబ్ధిదారులు తిరిగి వైద్య పరీక్షలకు హాజరై సర్టిఫికెట్లు మళ్లీ సమర్పించాలంటూ వారిపై కత్తి వేలాడదీసింది.
‘రియల్’ సీన్ ఇదీ..
గత ఐదేళ్లపాటు కోవిడ్ సమయంలోనూ ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే సజావుగా కొనసాగిన పింఛన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం రాగానే తూట్లు పొడిచింది. ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్న వారికి అనర్హత నోటీసులిస్తూ నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రియల్‌టైం గవర్నెన్స్ (ఆర్‌టీజీఎస్) సర్వేలో 12.7 శాతం మంది లబ్ధిదారులు తమకు ఇంటి వద్ద పెన్షన్లు అందడం లేదని వెల్లడించడం గమనార్హం. మరోవైపు పింఛన్ల పంపిణీలో అవినీతి జరుగుతున్నట్టు ఆరు శాతం మంది లబ్ధిదారులు తెలిపారు.
నాడు నిరంతరం.. సంతృప్త స్థాయిలో..
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉండగా పింఛను మొత్తాన్ని పెంచడంతో పాటు వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించి పెద్ద సంఖ్యలో లబ్ధి చేకూర్చింది. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో నిరంతరం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. గత ఐదేళ్ల పాటు కొత్తగా పింఛనుకు అర్హత పొందే ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.
వలంటీర్లే అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరించి కొత్తవి మంజూరు చేయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 60 ఏళ్ల దాటిన వారు సైతం కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా సచివాలయాల్లో ఆ సేవలను నిలిపివేసింది. ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు రెండు లక్షలకు పైగా అర్జీలను కూడా కూటమి ప్రభుత్వం మూలన పడేసింది.
Comments
Please login to add a commentAdd a comment