సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్రకాల్వ జలాశయానికి వరదనీరు పోటెత్తింది. దీంతో అధికారులు జలాశయం నాలుగు గేట్లు ఎత్తి.. 27వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. అయితే, కొంగవారిగూడెం వద్ద ఉన్న ఎర్రకాల్వ జలాశయం మూడో గేటు తెరచుకోలేదు. దీంతో నీటి ప్రవాహం పెరిగి జలాశయం ఎడమ కరకట్ట బీటలు వారుతోంది. ఎడమ కరకట్టకు బీటలు రావడంతో దిగువన ఉన్న లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జలాశయానికి వరద పోటెత్తడంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లోని పంటపొలాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
పొంగిపొర్లుతున్న జల్లేరు..!
జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో భారీగా వర్షం కురవడంతో జల్లేరు వాగు పొంగింది. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి హైద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఏలూరు రూట్ మీదుగా మళ్లించారు. కొవ్వూరు నుండి వచ్చే వాటిని దేవరపల్లి వద్దనే ఆపి గుండుగోలు, ఏలూరు మీదుగా విజయవాడ పంపిస్తున్నారు. దీనివల్ల ఈజీకే రోడ్డులో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
గుడిలో చిక్కుకున్న 700 మంది భక్తులు
జంగారెడ్డిగూడెం గుబ్బల మంగమ్మగుడికి వెళ్లిన భక్తులు వర్షాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఆలయ కమిటీకి చెందిన వారితోపాటు భక్తులు మొత్తం 700 మందికిపైగా గుడి వద్ద ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాగులు ఒక్కసారిగా పొంగడంతో వారు బయటకు రావడం సాధ్యం కాలేదు. గుడి దగ్గర చిక్కుకున్న వారిని పోలీసులు సురక్షితంగా కొండపైకి తరలించారు. స్థానిక ఏఎస్‌ఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా వారి దగ్గరుండి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నారు. అతికష్టం మీద దేవాలయం వద్దకు చేరుకున్న బుట్టాయిగూడెం పోలీసులు.. ఇప్పటివరకు 200 మందిని సురక్షితంగా కాపాడారు. ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యల్లో పోలీసులతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్, రెవెన్యూ, రవాణాశాఖ సిబ్బంది పాల్గొంటున్నారు.
బుట్టాయగూడెంలో వరదల్లో చిక్కుకున్న భక్తుల క్షేమసమాచారంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. భక్తులు అందరూ సురక్షితంగా ఉన్నారని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ తెలిపారు. గుబ్బల మంగమ్మ భక్తుల వెంట పోలీసులు ఉన్నారని చెప్పారు. తప్పిపోయిన భక్తుడిని కూడా అగ్నిమాపక సిబ్బంది కాపాడారన్నారు. అలాగే కొండవాగు ఉధృతిపై ముఖ్యమంత్రికి వివరించారు. వరద బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. బాధితులకు ఆహారం, మందులు పంపిణీ చేయాలన్నారు
Comments
Please login to add a commentAdd a comment