west godawari district
-
రేపు ఏలూరుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ( సోమవారం) పరామర్శించనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరుతారు. ఉదయం 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు. (చదవండి : ఏలూరు ఘటన: 292కి చేరిన బాధితులు) ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్ ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కూడా రేపు ఏలూరులో పర్యటించి అధికారులతో సమావేశంకానున్నారు. -
కోడిపందాలు సంప్రదాయ క్రీడల్లో భాగం:తలసాని
సాక్షి, ఉండి: సంక్రాంతి వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం సీసలలో ఏర్పాటుచేసిన కోడిపందాలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడి పందాలు సంప్రదాయ క్రీడల్లో ఒక భాగమని అన్నారు. గోదావరి జిల్లాలు సంక్రాంతి వేడుకలకు పెట్టింది పేరు అని కొనియాడారు. కోడిపందాలు ఆనవాయితీగా వస్తున్నాయని, వీటిని జూదంగా చూడొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి ఎంతో మంచి పథకమని ప్రశంసించారు. -
బాదంపూడి చెక్ పోస్టు వద్ద ఉద్రిక్తత
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి చెక్ పోస్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అన్నదాతల ఆక్రోశంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలానికి చెందిన రైతులు, కౌలు రైతులు బాదంపూడి జాతీయ రహదారిని నిర్బంధించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకుండా రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కయి.. తమను ఇక్కట్ల పాలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో దాదాపు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వాటిని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గతంలో బస్తా రూ. 1300 కొనేవారని, ఇప్పుడు బస్తాకు రూ.1100కి మించి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. 1010 రకం ధాన్యాన్ని తాము పండిస్తుండగా.. వ్యవసాయ అధికారులు తమ వద్దకు వచ్చి 1026, 1056 రకం ధాన్యం పండించాలని తమకు చెప్పారని, ఇప్పుడు ప్రభుత్వం కానీ, రైస్ మిల్లర్లు కానీ ఆ ధాన్యాన్ని కొనడం లేదని రైతులు తెలిపారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు తమకు వేరేదారి లేదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే రహదారిని నిర్బంధించి నిరసన తెలిపామని చెప్పారు. నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీస్ గోబ్యాక్ అన్న నినాదాలతో జాతీయ రహదారి కొంతసేపు మార్మోగింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఆందోళనకారులను చెల్లాచెదురుచేసి కొంతమంది రైతునాయకులు అదుపులోకి తీసుకుని చేబ్రోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఉంగుటూరు మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
మహిత హత్య : పోలీసుల అదుపులో నిందితుడు
సాక్షి, పశ్చిమగోదావరి : యలమంచిలి మండలం కాజ గ్రామంలో సంచలనం సృష్టించిన పెనుమాల మహిత హత్య కేసులో ప్రధాన నిందితుడు కూరెళ్ల మహేష్‌ను పాలకొల్లు రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వర రావు మాట్లాడుతూ. ‘పథకం ప్రకారమే మహేష్ ఈ హత్య చేశాడు. ఈ ఘటనలో మహేష్‌కు అతని స్నేహితులు కూడా సహకరించారు. ప్రస్తుతం అతని స్నేహితులు ఇంతియాజ్, కోటేశ్వరావుల కోసం గాలిస్తున్నాం. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామ’ని తెలిపారు. నిందుతుడు మహేష్ సినిమా షూటింగ్‌లకు క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో షూటింగ్ చూడటానికి వచ్చిన మహితతో అతనికి పరిచయం ఏర్పడింది. దీంతో గత మూడు నెలలుగా ప్రేమ పేరుతో మహితను అతను వేధిస్తున్నాడు. అప్పటికే మహేష్‌కు మరొకరితో పెళ్లి అవ్వడమే కాక వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది. భార్యతో విభేదాల విషయమై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. మహేష్ మొదటి పెళ్లి వ్యవహారం బయటపడటంతో అతన్ని మహిత నిలదీసింది. అంతేకాకుండా అప్పటినుంచి అతనికి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మహేష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పాలకొల్లు వచ్చి మహితకు ఫోన్ చేసి.. కలవాలని చెప్పాడు. దాంతో మహిత ఇంటి నుంచి బయటకు వచ్చి మహేష్‌ను కలిసింది. తనను మర్చిపోవాలని కోరింది. మహిత తనను నిరాకరించడంతో మహేష్ తన వెంట తెచ్చుకున్న మాంసం కత్తితో అతి కిరాతకంగా మహిత మీద దాడి చేసి చంపాడు. -
మహిత హత్య.. వెలుగులోకి వాస్తవాలు!
సాక్షి, యలమంచలి: ప్రేమ వ్యవహారం.. మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో ఓ యువకుడు కత్తితో చేసిన అమానుష దాడిలో ఓ యువతి అక్కడికక్కడే చనిపోయిన ఘటన.. పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపుతోంది. నక్కింటి చెరువువారికి చెందిన 19 ఏళ్ల యువతి పెనుమాల మహిత ఆదివారం తన బంధువుల గ్రామమైన యలమంచిలి మండలం కాజకు వచ్చింది. ఆమెతోపాటు ఉన్న కురేళ్ల మహేష్, అతని స్నేహితులు దాడికి దిగారు. కత్తిలో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో మహిత అక్కడిక్కడే చనిపోగా.. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు పారిపోయారు. ప్రధాన నిందితుడుగా భావిస్తున్న మహేష్ మాత్రం స్థానికులకు దొరికిపోయాడు. జనం తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయిన మహేష్‌ను పోలీసులు పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..! ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో కీలక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కురెళ్ల మహేష్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. నిందితుడు కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలోని దాకారం గ్రామానికి చెందిన వాడని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ప్రొడక్షన్ యూనిట్లో పనిచేసేవాడు. పెనుమాల మహిత కాకినాడ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదివింది. ఇంటర్లో ఫెయిల్ కావడంతో రాజోలు ఆదిత్య కాలేజీలో ఇంటర్ మళ్లీ చదువుతోంది. ఆమె స్వగ్రామం భీమవరం మండలం బేతపూడి గ్రామం. తండ్రి భీమవరం ఆదిత్య కాలేజీ బస్సు డ్రైవర్. తల్లి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ నిమిత్తం మూడు నెలల క్రితం పాలకొల్లు వచ్చినప్పుడు తొలిసారిగా మహిత మహేష్‌కు పరిచయమైంది. దీంతో గత మూడు నెలలుగా ప్రేమ పేరుతో మహితను అతను వేధిస్తున్నాడు. అప్పటికే మహేష్‌కు మరొకరితో పెళ్లి అయి.. విడాకుల వరకు వ్యవహారం వెళ్లింది. భార్యతో విభేదాల విషయమై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. మహేష్ మొదటి పెళ్లి వ్యవహారం బయటపడటంతో అతన్ని మహిత నిలదీసింది. అంతేకాకుండా అప్పటినుంచి అతనికి దూరంగా ఉంటుంది. పక్కా పథకంతోనే హత్య.. ఈ క్రమంలో తన ప్రేమను అంగీకరించకపోతే.. మహితను చంపేయాలని మహేశ్ ముందస్తుగానే పక్కా ప్రణాళికను రచించినట్టు తెలుస్తోంది. అందులోభాగంగానే మాంసం నరికే కత్తిని తన బ్యాగులో పెట్టుకొని.. హైదరాబాద్ నుంచి మరో ఇద్దరి స్నేహితులతో కలిసి యలమంచిలి మండలం కాజ గొప్పు గ్రామంలోని మహిత ఉంటున్న మేనమామ ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం సాయంత్రం మాట్లాడాలని మేనమామ ఇంటి నుంచి మహితను అతను బయటకి పిలిపించాడు. బయటకి వచ్చిన తర్వాత కిలోమీటర్ దూరం వరకు ఆమెతో మాట్లాడుతూ వెళ్లాడు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని మహితపై అతను ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు, మహిత నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా నరికి చంపేశాడు. మహిత మెడపై, తల వెనుక భాగంలో కత్తివేట్లు పడ్డాయి. మహిత అక్కడికక్కడే చనిపోవడంతో అతని ఇద్దరు స్నేహితులు పరారయ్యారు. చేతిలో కత్తితో ఉన్న మహేష్‌ను గుర్తించిన స్థానికులు పట్టుకొని చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, పరారైనమరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. -
ప్రచారంలో ఉద్దేశపూర్వకంగా బైక్ అడ్డుపెట్టి..
సాక్షి, ద్వారకాతిరుమల : ఓటమి భయంతో టీడీపీ నేతలు బరితెగించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు పెరుగుతున్న జనాభిమానాన్ని చూసి ఓర్వలేక ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన సాక్షి మీడియాపై సైతం టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. ద్వారకాతిరుమల మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తలారి వెంకట్రావుకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి ఓర్వలేక.. వైఎస్సార్సీపీ ప్రచారాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఎం.నాగులపల్లిలో బుధవారం సాయంత్రం తలారిని అడ్డుకున్నారు. ఉద్దేశపూర్వకంగా బైక్ అడ్డుపెట్టి.. తలారి ప్రచార రథం ఎం.నాగులపల్లికి చేరగానే టీడీపీ నేతలు ఒక బైక్‌ను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్త బైక్‌కు ఉన్న జెండా కర్ర, టీడీపీ నేత బైక్‌కు తగిలింది. దీంతో టీడీపీ నేత ఇష్టానుసారం బూతులు తిడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడిచేశాడు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా తలారి వాహనాన్ని అడ్డుకున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అభ్యర్థి అని కూడా చూడకుండా తలారిని ఇష్టానుసారం దూషించారు. తలారిని నిర్బంధించి ఆయన కారును సైతం ధ్వంసం చేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను, అక్కడకు చేరుకున్న ప్రజలను, మీడియా వారిని భయబ్రాంతులకు గురిచేసేలా టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పలువురు డీఎస్పీలు, సీఐలను సంఘటనా స్థలానికి పంపించారు. వారి ఆధ్వర్యంలో భీమడోలు సీఐ సీహెచ్ కొండలరావు, స్థానిక పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేశారు. నిర్భంధంలో ఉన్న తలారిని, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను విడిపించారు. అంతకుముందు న్యూస్ కవరేజ్ నిమిత్తం అక్కడకు వెళ్లిన సాక్షి దినపత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా విలేకర్లపై కూడా టీడీపీ శ్రేణులు దౌర్జన్యం చేయడంతో పాటు దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా గ్రామంలో ప్రత్యేక దళాలను మోహరించారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం గోపాలపురం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోగా, ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ప్రచారానికి వెళుతున్న ముప్పిడిని ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో తలారి ప్రచారాన్ని అడ్డుకోవాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. తలారి ప్రచారాన్ని కూడా ప్రజలు అడ్డుకుంటున్నారని చూపే ఎత్తుగడతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. -
తెరచుకోని జలాశయం గేటు.. కరకట్టకు బీటలు!
సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్రకాల్వ జలాశయానికి వరదనీరు పోటెత్తింది. దీంతో అధికారులు జలాశయం నాలుగు గేట్లు ఎత్తి.. 27వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. అయితే, కొంగవారిగూడెం వద్ద ఉన్న ఎర్రకాల్వ జలాశయం మూడో గేటు తెరచుకోలేదు. దీంతో నీటి ప్రవాహం పెరిగి జలాశయం ఎడమ కరకట్ట బీటలు వారుతోంది. ఎడమ కరకట్టకు బీటలు రావడంతో దిగువన ఉన్న లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జలాశయానికి వరద పోటెత్తడంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లోని పంటపొలాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. పొంగిపొర్లుతున్న జల్లేరు..! జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో భారీగా వర్షం కురవడంతో జల్లేరు వాగు పొంగింది. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి హైద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఏలూరు రూట్ మీదుగా మళ్లించారు. కొవ్వూరు నుండి వచ్చే వాటిని దేవరపల్లి వద్దనే ఆపి గుండుగోలు, ఏలూరు మీదుగా విజయవాడ పంపిస్తున్నారు. దీనివల్ల ఈజీకే రోడ్డులో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. గుడిలో చిక్కుకున్న 700 మంది భక్తులు జంగారెడ్డిగూడెం గుబ్బల మంగమ్మగుడికి వెళ్లిన భక్తులు వర్షాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఆలయ కమిటీకి చెందిన వారితోపాటు భక్తులు మొత్తం 700 మందికిపైగా గుడి వద్ద ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాగులు ఒక్కసారిగా పొంగడంతో వారు బయటకు రావడం సాధ్యం కాలేదు. గుడి దగ్గర చిక్కుకున్న వారిని పోలీసులు సురక్షితంగా కొండపైకి తరలించారు. స్థానిక ఏఎస్ఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా వారి దగ్గరుండి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నారు. అతికష్టం మీద దేవాలయం వద్దకు చేరుకున్న బుట్టాయిగూడెం పోలీసులు.. ఇప్పటివరకు 200 మందిని సురక్షితంగా కాపాడారు. ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యల్లో పోలీసులతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, రెవెన్యూ, రవాణాశాఖ సిబ్బంది పాల్గొంటున్నారు. బుట్టాయగూడెంలో వరదల్లో చిక్కుకున్న భక్తుల క్షేమసమాచారంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. భక్తులు అందరూ సురక్షితంగా ఉన్నారని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ తెలిపారు. గుబ్బల మంగమ్మ భక్తుల వెంట పోలీసులు ఉన్నారని చెప్పారు. తప్పిపోయిన భక్తుడిని కూడా అగ్నిమాపక సిబ్బంది కాపాడారన్నారు. అలాగే కొండవాగు ఉధృతిపై ముఖ్యమంత్రికి వివరించారు. వరద బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. బాధితులకు ఆహారం, మందులు పంపిణీ చేయాలన్నారు -
ఏపీ విప్ నోట బూతు.. బూతు.. బూతు..!
సాక్షి, ఏలూరు: దుందుడుకు చర్యలతో ఎప్పుడూ వివాదాల్లో ఉండే టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి అధికారులపై చిందులు తొక్కారు. జన్మభూమి కార్యక్రమంలో బాహాటంగానే అధికారులను ఉద్దేశించి బూతులు మాట్లాడారు. ఆయన బూతులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయిలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విప్ చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. గ్రామాధికారి నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బహిరంగ కార్యక్రమం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు. ఆయన తనదైన శైలిలో దుర్భాషలాడటంతో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న వారు నివ్వెరపోయారు. -
బిగుస్తున్నసీబీఐ ఉచ్చు
తణుకులో మళ్లీ కలకలం రేగింది. ఇటీవల పట్టణానికి చెందిన ఐఎఫ్ఎస్ అధికారిఅక్రమాస్తులపై సీబీఐ అధికారులు సోదాలు చేసిన సంగతి మరువకముందే ఈ ఘటనలో ఫిర్యాదుదారుడిపై హత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. తాజా ఘటనపై సీబీఐ కూడా ఆరా తీసినట్టు సమాచారం. సీబీఐ ఉచ్చు బిగించనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఐఎఫ్ఎస్ అధికారి బినామీల్లో అలజడి రేగుతోంది. తణుకు: దేశంలోనే అత్యున్నత నిఘా విభాగం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ). దేశంలో పెద్దఎత్తున జరిగే అక్రమాలు, అవినీతిపై ఈ విభాగం అధికారులు దృష్టి సారిస్తారు. సాధారణంగా సీబీఐ చేపట్టిన కేసుల్లో ఫిర్యాదిదారుల వివరాలను గోప్యంగా ఉంటాయి. అయితే తాజాగా ఐఎఫ్ఎస్ అధికారి అక్రమాస్తుల కేసులో ఫిర్యాదుదారు అయిన షేర్ కన్సల్టెన్సీ వ్యాపారి చావలి మహదేవ ప్రభూజీపై జరిగిన హత్యాయత్నం.. కలకలం రేపింది. సర్వత్రా చర్చనీయాంశమైంది. విచారణ కొనసాగుతుండగా.. తణుకుకు చెందిన ముత్యాల రాంప్రసాదరావు ప్రస్తుతం కేంద్ర అటవీశాఖ అభివృద్ధి మండలి జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇటీవల సీబీఐ దృష్టిసారించింది. ఈ మేరకు తణుకు పట్టణంలోని ఆయన ఇంటిపైనా, బంధువుల ఇళ్లపైనా దాడి చేసింది. సోదాలు నిర్వహించింది. ఆయన ద్వారా సమకూరిన కోట్లాది రూపాయలతో ఆయన భార్య ఆకుల కనకదుర్గ తణుకులో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ అక్రమాస్తులను భారీగా పెంచుతున్నారనే ఆరోపణలూ ఉండడంతో సీబీఐ అధికారులు ఉచ్చు బిగించారు. రాంప్రసాదరావు నివాసంపై దాడి చేసిన సీబీఐ అధికారులు ప్రాథమికంగా సుమారు రూ.10 కోట్ల ఆస్తులతోపాటు రూ.37 లక్షల నగదు, పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని గుర్తించి భార్యాభర్తలపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వీరికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న పైడిపర్రుకు చెందిన ఇవటూరి గణపతిశర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫిర్యాదుదారుడిపై హత్యాయత్నం ఐఎఫ్ఎస్ అధికారి రాంప్రసాదరావు ఎన్టీపీసీలో పని చేసిన కాలంలో సంపాదించిన అక్రమాస్తులతోపాటు తణుకు పరిసర ప్రాంతాల్లో ఆయన భార్య కనకదుర్గ విస్తరించిన రియల్ వ్యాపారంపై ఆధారాలతో సహా పట్టణానికి చెందిన చావలి మహదేవ ప్రభూజీ గతంలో సీబీఐ, విజిలెన్స్, ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాంప్రసాదరావు నివాసంపై సీబీఐ దాడులు చేసి కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన ప్రభూజీపై సోమవారం అర్ధరాత్రి దాటాక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడడం పట్టణంలో కలకలం రేపింది. ప్రభూజీ ఇంటి ఆవరణలో ఉంచిన మోటారుసైకిల్‌ను దహనం చేసిన దుండగులు తర్వాత అతనిపై గొడ్డలితో దాడి చేశారు. ప్రస్తుతం ప్రభూజీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. రాంప్రసాదరావు దంపతుల పనే! రాంప్రసాదరావు, కనకదుర్గ దంపతులే తమ అనుచరులతో దాడి చేయించారని ప్రభూజీ ఆరోపిస్తున్నారు. సాధారణ పౌరుడిగానే తాను ఐఎఫ్ఎస్ అధికారి అక్రమ సంపాదన, అవినీతిపై ఫిర్యాదు చేశానని, తనకు ప్రాణహాని ఉన్నట్టు గతంలోనే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఫిర్యాదిదారుడిపైనే హత్యాయత్నానికి పాల్పడిన వ్యవహారంపై సీబీఐ అధికారులూ దృష్టి సారించారు. ఈ ఘటనపై విశాఖపట్నం నుంచి సీబీఐ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఇప్పటి వరకు సజావుగా విచారణ సాగుతుండగా ఫిర్యాదిదారుడిపై దాడి జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో ఇకపై సీబీఐ మరింత ఉచ్చు బిగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తణుకు పరిసర ప్రాంతాల్లో కనకదుర్గ బినామీలుగా వ్యవహరిస్తున్న వారిలో అలజడి రేగుతోంది. -
స్కూల్ బస్సు, బైక్ ఢీ: యువకుడి మృతి
వీరవాసరం: బైక్, స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా వీరావాసరం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మరణంచిన యువకుడు ఎవరనేది పోలీసులు ఆరాతీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.