దాడిలో గాయపడిన ప్రభూజీ ,దహనమైన మోటార్‌సైకిల్
తణుకులో మళ్లీ కలకలం రేగింది. ఇటీవల పట్టణానికి చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారిఅక్రమాస్తులపై సీబీఐ అధికారులు సోదాలు చేసిన సంగతి మరువకముందే ఈ ఘటనలో ఫిర్యాదుదారుడిపై హత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. తాజా ఘటనపై సీబీఐ కూడా ఆరా తీసినట్టు సమాచారం. సీబీఐ ఉచ్చు బిగించనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఐఎఫ్‌ఎస్ అధికారి బినామీల్లో అలజడి రేగుతోంది.
తణుకు: దేశంలోనే అత్యున్నత నిఘా విభాగం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ). దేశంలో పెద్దఎత్తున జరిగే అక్రమాలు, అవినీతిపై ఈ విభాగం అధికారులు దృష్టి సారిస్తారు. సాధారణంగా సీబీఐ చేపట్టిన కేసుల్లో ఫిర్యాదిదారుల వివరాలను గోప్యంగా ఉంటాయి. అయితే తాజాగా ఐఎఫ్‌ఎస్ అధికారి అక్రమాస్తుల కేసులో ఫిర్యాదుదారు అయిన షేర్ కన్సల్టెన్సీ వ్యాపారి చావలి మహదేవ ప్రభూజీపై జరిగిన హత్యాయత్నం.. కలకలం రేపింది. సర్వత్రా చర్చనీయాంశమైంది.
విచారణ కొనసాగుతుండగా..
తణుకుకు చెందిన ముత్యాల రాంప్రసాదరావు ప్రస్తుతం కేంద్ర అటవీశాఖ అభివృద్ధి మండలి జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇటీవల సీబీఐ దృష్టిసారించింది. ఈ మేరకు తణుకు పట్టణంలోని ఆయన ఇంటిపైనా, బంధువుల ఇళ్లపైనా దాడి చేసింది. సోదాలు నిర్వహించింది. ఆయన ద్వారా సమకూరిన కోట్లాది రూపాయలతో ఆయన భార్య ఆకుల కనకదుర్గ తణుకులో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ అక్రమాస్తులను భారీగా పెంచుతున్నారనే ఆరోపణలూ ఉండడంతో సీబీఐ అధికారులు ఉచ్చు బిగించారు. రాంప్రసాదరావు నివాసంపై దాడి చేసిన సీబీఐ అధికారులు ప్రాథమికంగా సుమారు రూ.10 కోట్ల ఆస్తులతోపాటు రూ.37 లక్షల నగదు, పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని గుర్తించి భార్యాభర్తలపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వీరికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న పైడిపర్రుకు చెందిన ఇవటూరి గణపతిశర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఫిర్యాదుదారుడిపై హత్యాయత్నం
ఐఎఫ్‌ఎస్ అధికారి రాంప్రసాదరావు ఎన్టీపీసీలో పని చేసిన కాలంలో సంపాదించిన అక్రమాస్తులతోపాటు తణుకు పరిసర ప్రాంతాల్లో ఆయన భార్య కనకదుర్గ విస్తరించిన రియల్ వ్యాపారంపై ఆధారాలతో సహా పట్టణానికి చెందిన చావలి మహదేవ ప్రభూజీ గతంలో సీబీఐ, విజిలెన్స్, ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాంప్రసాదరావు నివాసంపై సీబీఐ దాడులు చేసి కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన ప్రభూజీపై సోమవారం అర్ధరాత్రి దాటాక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడడం పట్టణంలో కలకలం రేపింది. ప్రభూజీ ఇంటి ఆవరణలో ఉంచిన మోటారుసైకిల్‌ను దహనం చేసిన దుండగులు తర్వాత అతనిపై గొడ్డలితో దాడి చేశారు. ప్రస్తుతం ప్రభూజీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
రాంప్రసాదరావు దంపతుల పనే!
రాంప్రసాదరావు, కనకదుర్గ దంపతులే తమ అనుచరులతో దాడి చేయించారని ప్రభూజీ ఆరోపిస్తున్నారు. సాధారణ పౌరుడిగానే తాను ఐఎఫ్‌ఎస్ అధికారి అక్రమ సంపాదన, అవినీతిపై ఫిర్యాదు చేశానని, తనకు ప్రాణహాని ఉన్నట్టు గతంలోనే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఫిర్యాదిదారుడిపైనే హత్యాయత్నానికి పాల్పడిన వ్యవహారంపై సీబీఐ అధికారులూ దృష్టి సారించారు. ఈ ఘటనపై విశాఖపట్నం నుంచి సీబీఐ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఇప్పటి వరకు సజావుగా విచారణ సాగుతుండగా ఫిర్యాదిదారుడిపై దాడి జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో ఇకపై సీబీఐ మరింత ఉచ్చు బిగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తణుకు పరిసర ప్రాంతాల్లో కనకదుర్గ బినామీలుగా వ్యవహరిస్తున్న వారిలో అలజడి రేగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment