erra kaluva
-
‘కేరళ వరదలను ఆయన రాజకీయాలకు వాడుకున్నారు’
సాక్షి, తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శవాలపై కూడా రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎర్రకాలువ ముంపు ప్రాంతాలలో పర్యటించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పది రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి ఎస్టిమేషన్లు పెంచి నాణ్యతలేని నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంత నష్టం జరుగుతున్నా చంద్రబాబు ఇప్పటిదాకా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేరళ వరదలను కూడా రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శమని విమర్శించారు. ఏపీ ప్రజలను మోసం చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవుపలికారు. జిల్లాలో నష్టపోయిన రైతులను వెంటనే గుర్తించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చ ఇన్పుట్ సబ్సిడీని కౌలు రైతులకు అందించాలని, రైతుల రుణాలను వెంటనే రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. -
తెరచుకోని జలాశయం గేటు.. కరకట్టకు బీటలు!
సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్రకాల్వ జలాశయానికి వరదనీరు పోటెత్తింది. దీంతో అధికారులు జలాశయం నాలుగు గేట్లు ఎత్తి.. 27వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. అయితే, కొంగవారిగూడెం వద్ద ఉన్న ఎర్రకాల్వ జలాశయం మూడో గేటు తెరచుకోలేదు. దీంతో నీటి ప్రవాహం పెరిగి జలాశయం ఎడమ కరకట్ట బీటలు వారుతోంది. ఎడమ కరకట్టకు బీటలు రావడంతో దిగువన ఉన్న లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జలాశయానికి వరద పోటెత్తడంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లోని పంటపొలాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. పొంగిపొర్లుతున్న జల్లేరు..! జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో భారీగా వర్షం కురవడంతో జల్లేరు వాగు పొంగింది. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి హైద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఏలూరు రూట్ మీదుగా మళ్లించారు. కొవ్వూరు నుండి వచ్చే వాటిని దేవరపల్లి వద్దనే ఆపి గుండుగోలు, ఏలూరు మీదుగా విజయవాడ పంపిస్తున్నారు. దీనివల్ల ఈజీకే రోడ్డులో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. గుడిలో చిక్కుకున్న 700 మంది భక్తులు జంగారెడ్డిగూడెం గుబ్బల మంగమ్మగుడికి వెళ్లిన భక్తులు వర్షాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఆలయ కమిటీకి చెందిన వారితోపాటు భక్తులు మొత్తం 700 మందికిపైగా గుడి వద్ద ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాగులు ఒక్కసారిగా పొంగడంతో వారు బయటకు రావడం సాధ్యం కాలేదు. గుడి దగ్గర చిక్కుకున్న వారిని పోలీసులు సురక్షితంగా కొండపైకి తరలించారు. స్థానిక ఏఎస్ఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా వారి దగ్గరుండి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నారు. అతికష్టం మీద దేవాలయం వద్దకు చేరుకున్న బుట్టాయిగూడెం పోలీసులు.. ఇప్పటివరకు 200 మందిని సురక్షితంగా కాపాడారు. ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యల్లో పోలీసులతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, రెవెన్యూ, రవాణాశాఖ సిబ్బంది పాల్గొంటున్నారు. బుట్టాయగూడెంలో వరదల్లో చిక్కుకున్న భక్తుల క్షేమసమాచారంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. భక్తులు అందరూ సురక్షితంగా ఉన్నారని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ తెలిపారు. గుబ్బల మంగమ్మ భక్తుల వెంట పోలీసులు ఉన్నారని చెప్పారు. తప్పిపోయిన భక్తుడిని కూడా అగ్నిమాపక సిబ్బంది కాపాడారన్నారు. అలాగే కొండవాగు ఉధృతిపై ముఖ్యమంత్రికి వివరించారు. వరద బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. బాధితులకు ఆహారం, మందులు పంపిణీ చేయాలన్నారు -
ఎర్రకాలువ వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వంతెన వద్ద ఆర్టీసీ బస్సును సిమెంట్ లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. మృతులు కాపుశెట్టి జ్యోతి(33), కాపుశెట్టి అఖిలసత్య(12), శివసాయి(14), గేలం లక్ష్మి(50), పల్లా సావిత్రమ్మ(62)గా గుర్తించారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. సిమెంట్ లారీ టైరు పేలిపోయి బస్సుపైకి దూసుకుపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి సమీపంలో నాలుగురోజుల క్రితం నానో కారును లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వరుస ప్రమాదాలతో అనంతపల్లివాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. -
ఎర్రకాలువలో యువకుడి గల్లంతు ?
అనంతపల్లి(నల్లజర్ల) : నల్లజర్ల మండలం అనంతపల్లిలో తాడిపూడి అండర్‌టన్నెల్ వద్ద ఒక యువకుడు కాలువలో గల్లంతైనట్టు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. గుండేపల్లి గ్రామానికి చెందిన ముసలయ్యకు ముగ్గురు కొడుకులు. ఆఖరి కొడుకు తిరువీధుల రవికుమార్ (18) సోమవారం ఉదయం ఇంట్లో గొడవపడి బయటకు వచ్చేశాడు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తల్లి బేబికి ఫో¯ŒS చేసి తాను ఎర్రకాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా ఘటనాస్థలానికి పరుగులు తీశారు. వారు వచ్చేసరికి రవికుమార్ చెప్పులు మాత్రమే కనిపించాయి. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది వచ్చి.. కాలువలో దూకిన ఆనవాళ్లు కనపడకపోవడంతో వెనుదిరిగారు. నిజంగా రవికుమార్ కాలువలో దూకాడా.. లేక ఇంట్లో వాళ్లను భయపెట్టడానికే ఇలా చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యం కేసు నమోదు చేసినట్టు అనంతపల్లి ఎస్ఐ ఐ.వెంకటేశ్వరరావు తెలిపారు. గ్రామస్తులు రవికుమార్ కోసం గాలిస్తున్నారు.