
తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులు
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వంతెన వద్ద ఆర్టీసీ బస్సును సిమెంట్ లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి.
మృతులు కాపుశెట్టి జ్యోతి(33), కాపుశెట్టి అఖిలసత్య(12), శివసాయి(14), గేలం లక్ష్మి(50), పల్లా సావిత్రమ్మ(62)గా గుర్తించారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. సిమెంట్ లారీ టైరు పేలిపోయి బస్సుపైకి దూసుకుపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి సమీపంలో నాలుగురోజుల క్రితం నానో కారును లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వరుస ప్రమాదాలతో అనంతపల్లివాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment