nallajerla
-
తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
సాక్షి తూర్పుగోదావరి జిల్లా: ఓ రోడ్డు ప్రమాదంతో అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుబడ్డాయి. ఘటనా స్థలంలో పోలీసులు పరిశీలనలో భారీగా తరలిస్తున్న నగదు గుట్టు బయటపడింది. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో వెళ్తోన్న వ్యాన్‌ను వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడగా, క్లీనర్, డ్రైవర్‌కు గాయాలయ్యయి. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో వ్యాన్ అడుగు భాగంలో 7 అనుమానాస్పద బాక్స్‌లను పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల సమక్షంలో బాక్స్‌లను అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద తెరిచి చూడగా భారీగా నగదు బయటపడింది.Cinematic: Accident leads to Rs 7 crore cash seizure packed in 7 cardboard boxes loaded in Tata Ace vehicle going from Vijayawada towards Vizag, that overturned after hitting a truck & one box fell out revealing currency hidden packed in between sacks #AndhraPradesh #EastGodavari pic.twitter.com/OXoy0oaRJI— Uma Sudhir (@umasudhir) May 11, 2024 బాక్స్‌లోని డబ్బులను అధికారులు,ఎలక్షన్ ఫ్లైయింగ్ స్వ్కాడ్ లెక్కిస్తోంది. నగదు మొత్తం రూ. 7 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టుగా సమాచారం.ఆ సొమ్ము ఎవరిదై ఉంటుందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు భారీ గా నగదు లభ్యం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
బాబు దుష్టపన్నాగమే ఇది.. ఏపీలో ఈసీ ఉండి ఏం లాభం?: వాసిరెడ్డి పద్మ
గుంటూరు, సాక్షి: ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఎన్నికల సంఘం తనను ఏమీ చేయదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా? అని నిలదీశారు వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ. నల్లజర్లలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై టీడీపీ గుండాలు దాడికి యత్నించిన ఘటనపై బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ద్వారా పద్మ స్పందించారు. ‘‘టీడీపీ శ్రేణులు బరితెగించాయి. సాక్షాత్తూ దళిత హోంమంత్రి తానేటి వనిత మీద దాడికి యత్నించాయి. ఈ ఘటన వెనుక చంద్రబాబు దుష్టపన్నాగం ఉంది. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారు. అసలు దళితులంటే ఎందుకంత చిన్నచూపు చంద్రబాబూ..?.ఒక రాష్ట్ర హోంమంత్రి.. అందునా మహిళ ప్రచారంలో ఉంటే దాడి చేయటం దుర్మార్గపు విషయం. ఇంటి మీదకు వెళ్లి మరీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఈసీ ఏమీ చేయదని చంద్రబాబు భావిస్తున్నారా?. .. మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. కానీ, చంద్రబాబు మహిళల మీద వివక్ష చూపుతున్నారు. ఇప్పటికే ఇంటింటి పెన్షన్లు నిలిపివేయించి.. అవ్వాతాతల ప్రాణాలు తీశారు. ఇప్పుడేమో దళితులు, మహిళల మీద దాడులకు తెగపడ్డారు... ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా స్పందించటం లేదంటే చంద్రబాబుకు ఎంత లెక్కలేని తనం?. ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోకపోతే అది ఉండీ ఏం ప్రయోజనం?. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పని చేయాలి’’ అని వాసిరెడ్డి పద్మ కోరారు. -
నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్
-
‘నన్ను కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా?’: మంత్రి తానేటి వనిత
తూర్పుగోదావరి, సాక్షి: నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించాం. ఎన్నికల ప్రచారం ముగించుకుని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. మా నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. వందమంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడున్న బైకులను ధ్వంసం చేశారు.హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. దళితురాలినైన నన్ను కించపరుస్తూ.. రౌడీయిజం ప్రదర్శిస్తూ, దాడి చేసి గెలవాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్?. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు.టీడీపీ శ్రేణుల దాడుల్లో.. మా కార్యకర్తలు నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఒకరికి తల పగలటంతో కుట్లు సైతం పడ్డాయి. టీడీపీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ.. దాడులు చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు దర్యాప్తు చేస్తున్నారు అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
తూర్పు గోదావరి, సాక్షి: మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఏపీ ముక్తకంఠంతో చెబుతోంది. ఆ పిలుపు కూటమి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపైన దాడికి టీడీపీ శ్రేణులు యత్నించారు.మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నల్లజర్లలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని ఎక్స్ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. YSRCP ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో గొడవకు దిగాయి. ఈలోపు టీడీపీ కార్యకర్తల్లో కొందరు తానేటి వనిత పైకి దూసుకెళ్లే యత్నం చేశారు.అయితే అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. అయినా ఆగకుండా సుబ్రహ్మణ్యం ఇంటి ఫర్నీచర్‌ను, అక్కడున్న మరికొన్ని వాహనాల్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. వాళ్లనూ తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు దాడికి యత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి. శాంతి భద్రతలను పర్యవేక్షించే హోం మంత్రిపై దాడికి యత్నించడాన్ని వైఎస్సార్సీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది. విషయం తెలిసిన ఎస్పీ జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు.హోం మంత్రి స్పందనటీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, పైగా మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘‘హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. మియాపూర్‌లో కాపురం.. చివరికి భర్త షాకింగ్ ట్విస్ట్
నల్లజర్ల(తూర్పుగోదావరి): కాపురానికి తీసుకెళ్లాలని ఓ మహిళ తన భర్త ఇంటి ముందు గురువారం ఆందోళనకు దిగింది. పెద్దల సమక్షంలో ఈ నెల 19 వరకు భర్త తండ్రి గడువు కోరడంతో తన నిరసనను విరమించింది. వివరాలిలా ఉన్నాయి. నల్లజర్ల మండలం చీపురుగూడెంకు చెందిన వసంతాడ అనిల్‌కుమార్, అశ్వారావుపేట మండలం నారాయణపురానికి చెందిన తమ్మిలేటి నాగరాణి నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలసి చదువుకున్నారు. నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. చదువు పూర్తయ్యాక సికింద్రాబాద్ ఆర్య సమాజంలో గతేడాది డిసెంబర్ 17న వివాహం చేసుకున్నారు. ఐదునెలలు మియాపూర్‌లో కాపురం చేశారు. అతనికి చెన్నైలో ఉద్యోగం వచ్చింది. దీంతో అతను చైన్నైకు మకాం మార్చాడు. ఆరుమాసాలుగా మొహం చాటేస్తూ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అప్పట్లో నాగరాణి హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. త్వరలో వచ్చి నాగరాణిని తీసుకెళతానని అనిల్ లిఖిత పూర్వక హామీ ఇచ్చాడు. అయినా తీసుకెళ్లలేదు. దీంతో గత నెల 10వ తేదీన అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌లో నాగరాణి ఫిర్యాదు చేసింది. కొంతగడువు కావాలని కోరడంతో పోలీసులు నచ్చజెప్పారు. అయినా అనిల్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మహిళా సంఘ నాయకులతో నాగరాణి గురువారం సాయంత్రం చీపురుగూడెంలో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. గ్రామసర్పంచ్ గాలింకి రాంబాబు, పెద్దలు జాలిది రవి, కొరపాటి గంగరాజుల సమక్షంలో ఇరువర్గాలతో మాట్లాడారు. ప్రస్తుతం అనిల్‌కుమార్ చెన్నైలో ఉన్న దృష్ట్యా అతనిని స్వగ్రామానికి రప్పిస్తామని ఈ నెల 19 వరకు గడువు కావాలని తండ్రి వసంతాడ వెంకటేశ్వరావు కోరడంతో పెద్దలు నాగరాణికి లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. ఆమె తరఫున రాష్ట్ర గిరిజన మహిళా సంఘ నాయకురాలు మడకం లక్ష్మి, బి.రమాదేవి, బి.సరస్వతి, దాసరి రేవతితో పాటు పోలవరం నియోజకవర్గం నుంచి మరో 20 మంది మహిళా నాయకులు పాల్గొన్నారు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఎంత పనిచేశాడంటే? -
అయ్యో పాపం.. ఎక్కడ పుట్టిందో.. ఎక్కడ పెరిగిందో..!
సాక్షి, నల్లజర్ల (పశ్చిమగోదావరి): ఎక్కడ పుట్టిందో.. ఎక్కడ పెరిగిందో తెలియదు. మన ఊరు, భాష కాదు. సుమారు 25 – 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓ గుర్తు తెలియని యువతి దూబచర్ల శివారులో ఉన్న బైపాస్ రహదారి అండర్ పాస్ వద్ద రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. వంటిపై దుస్తులు కూడా సక్రమంగా లేవు. హిందీ, ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడుతోంది. ఉన్నత చదువులు చదివినట్లు కనిపిస్తున్నా మతిస్థిమితం లేదు. ఎవరైనా కొట్టారో, ఎక్కడైనా పడిపోయిందో తెలియదు. కానీ కాళ్లకు దెబ్బలు ఉన్నాయి. మంగళవారం అటుగా వెళ్తున్న విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ డేవిడ్, మరో వ్యక్తి ఉండ్రాజవరం వెంకటేశ్వరావు ఆమె స్ధితిని గమనించి దుస్తులు తెచ్చి ఇచ్చారు. కాళ్ల గాయాలకు మందు రాశారు. ఆహారం పెట్టారు. ఆమె వివరాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా, పోలీసుల ద్వారా ఎక్కడైనా అనాథ ఆశ్రమంలో చేర్చుతామని చెబుతున్నారని లయన్స్ క్లబ్ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. చదవండి: (దివ్యాంగ బాలికపై అత్యాచారం) -
పోలవరం యాత్రలో మరో విషాదం
సాక్షి, పోలవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టు చూడడానికి వెళ్లి తిరిగి వస్తుండగా నల్లజర్ల గ్రామంలో గుండెపోటుతో మహేష్ (60) అనే వృద్ధుడు మృతి చెందాడు. మృతుడు దెందులూరు మండలం కొవ్వలి గ్రామ వాసిగా గుర్తించారు. మరొక వాహనంలో అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం పెద అంబడిపూడి గ్రామానికి చెందిన కూరపాటి సుబ్బారావు(69) గుండెపోటుకు గురై అక్కడిక్కడకే ప్రాణాలు వదిలారు. మృతదేహాన్ని బస్సులోనే వారి స్వగ్రామానికి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండు నెలలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామంటూ పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, గుంటూరు జిల్లా అమరావతికి బస్సులు ఏర్పాటు చేసి రైతులను, మహిళలను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వృద్ధులు ప్రాణాలు కోల్పోపోయారు. ప్రచార ఆర్భాటంతో అధికార పార్టీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. (పోలవరం సందర్శన యాత్రలో విషాదం) -
ఎర్రకాలువ వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వంతెన వద్ద ఆర్టీసీ బస్సును సిమెంట్ లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. మృతులు కాపుశెట్టి జ్యోతి(33), కాపుశెట్టి అఖిలసత్య(12), శివసాయి(14), గేలం లక్ష్మి(50), పల్లా సావిత్రమ్మ(62)గా గుర్తించారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. సిమెంట్ లారీ టైరు పేలిపోయి బస్సుపైకి దూసుకుపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి సమీపంలో నాలుగురోజుల క్రితం నానో కారును లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వరుస ప్రమాదాలతో అనంతపల్లివాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. -
బైక్, లారీ ఢీ : ఇద్దరు మృతి
నల్లజర్ల రూరల్ (పశ్చిమ గోదావరి) : లారీ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం రోడ్డులో శనివారం మధ్యాహ్నం జరిగింది. నల్లజర్ల వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై పోతవరం వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తీవ్ర గాయాలతో బైక్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులను ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన చందు (28), పెద్ది రాజు(28)లుగా గుర్తించారు. -
బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు
నల్లజర్ల : మండలంలోని పోతవరం పంచాయతీ పరిధిలో ముగ్గురు బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా బాలల సంరక్షణ అధికారులు, మండల ఐసీడీఎస్ సిబ్బంది అడుకుని బాలికలను ఏలూరులోని చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్‌కు తరలించారు. కృష్ణాయిగూడెంలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక ను వేగవరం గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవ్వగా అధికారులు అడ్డుకున్నారు. బాలిక తండ్రికి అనారోగ్యం ఉండడంతో కూతురుకు పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డామని తల్లిదండ్రులు వీర్రాజు, లక్ష్మి తెలిపారు. అదే గ్రామానికి చెందిన గెడ్డం తేజస్విని(15)ని గోపాలపురం గ్రామానికి చెందిన వ్యక్తితో శుక్రవారం వివాహం చేసేందుకు నిశ్చయించగా విషయం తెలుసుకున్న అధికారులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పోతవరం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక మల్లవరపు కృష్ణవేణిని అనంతపల్లికి చెందిన యువకుడి కి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమవుతుండగా అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులు సత్యనారాయణ, వెంకటలక్ష్మికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అనంతరం ముగ్గురు బాలికలను జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్, సీడీపీవో రమాదేవి ఏలూరులోని చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్‌కు తరలించారు. అధికారుల వెంట వీఆర్వో అద్దంకి ప్రసాద్, సూపర్వైజర్ స్వర్ణకుమారి, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు పాస్టర్ రాజేష్ ఉన్నారు. కోడిగూడెంలో.. కోడిగూడెం(ద్వారకాతిరుమల) : ద్వారకాతిరుమల మండలం కోడిగూడెంలో బుధవారం జరుగుతున్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన మనుకొండ శ్రీను అనే యువకుడు తన అక్క కూతురైన జంగారెడ్డిగూడేనికి చెందిన 17 సంవత్సరాల బాలికను స్థానిక క్రీస్తు సంఘం చర్చిలో వివాహం చే సుకునేందుకు సిద్ధమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ద్వారకాతిరుమల తహసిల్దార్ సీహెచ్‌వీఎస్‌ఆర్‌ఎల్ ప్రసాద్, ఐసీపీఎస్ అధికారులకు సమాచారం అందించడంతో వారి ఆదేశాల మేరకు ఆర్ఐ నాగరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.లక్ష్మీరాజ్యం, అంగన్వాడీ వర్కర్ పి.హేమలత, ఏఎన్ఎం కిరణ్మయి చర్చి వద్దకు చేరుకుని వివాహాన్ని నిలుపుదల చేశారు. వధూవరులు మేజర్లేనని వారి బంధువులు తొలుత చెప్పుకొచ్చారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు చూపించమని అధికారులు కోరగా యువకుడికి సంబంధించిన రేషన్‌కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులను చూపారు. అయితే బాలికకు సంబంధించి ఏ పత్రం చూపలేదు. తమ కుమార్తెకు 17 ఏళ్లు నిండాయని ఆమె తల్లిదండ్రులు, బంధువులు తెలపడంతో అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఇరువురి తల్లిదండ్రులు, బంధువులు, వివాహాన్ని జరిపిస్తున్న పాస్టర్లను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. వయస్సు నిండకుండా వివాహం చేసేందుకు ప్రయత్నిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
ఆటో- కారు ఢీ: ముగ్గురు మృతి
పశ్చిమగోదావరి జిల్లాలోని నల్లజర్ల వద్ద ఈ రోజు ఉదయం ఆటో - కారు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దుర్ఘటన సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆటో డ్రైవర్ మితిమీరిన వేగంగా నడపడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షలు పోలీసులకు తెలిపారు.