బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు | Child marriage stopped | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు

Published Thu, Jun 19 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు

బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు

నల్లజర్ల : మండలంలోని పోతవరం పంచాయతీ పరిధిలో ముగ్గురు బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా బాలల సంరక్షణ  అధికారులు, మండల ఐసీడీఎస్ సిబ్బంది అడుకుని బాలికలను ఏలూరులోని చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్‌కు తరలించారు. కృష్ణాయిగూడెంలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక ను వేగవరం గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవ్వగా అధికారులు అడ్డుకున్నారు. బాలిక తండ్రికి అనారోగ్యం ఉండడంతో కూతురుకు పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డామని తల్లిదండ్రులు వీర్రాజు, లక్ష్మి తెలిపారు.
 
 అదే గ్రామానికి చెందిన గెడ్డం తేజస్విని(15)ని గోపాలపురం గ్రామానికి చెందిన వ్యక్తితో శుక్రవారం వివాహం చేసేందుకు నిశ్చయించగా విషయం తెలుసుకున్న అధికారులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పోతవరం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక మల్లవరపు కృష్ణవేణిని అనంతపల్లికి చెందిన యువకుడి కి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమవుతుండగా అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులు సత్యనారాయణ, వెంకటలక్ష్మికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అనంతరం ముగ్గురు బాలికలను జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్, సీడీపీవో రమాదేవి ఏలూరులోని చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్‌కు తరలించారు. అధికారుల వెంట వీఆర్వో అద్దంకి ప్రసాద్, సూపర్‌వైజర్ స్వర్ణకుమారి, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు పాస్టర్ రాజేష్ ఉన్నారు.
 
 కోడిగూడెంలో..
 కోడిగూడెం(ద్వారకాతిరుమల) : ద్వారకాతిరుమల మండలం కోడిగూడెంలో బుధవారం జరుగుతున్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన మనుకొండ శ్రీను అనే యువకుడు తన అక్క కూతురైన జంగారెడ్డిగూడేనికి చెందిన 17 సంవత్సరాల బాలికను స్థానిక క్రీస్తు సంఘం చర్చిలో వివాహం చే సుకునేందుకు సిద్ధమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ద్వారకాతిరుమల తహసిల్దార్ సీహెచ్‌వీఎస్‌ఆర్‌ఎల్ ప్రసాద్, ఐసీపీఎస్ అధికారులకు సమాచారం అందించడంతో వారి ఆదేశాల మేరకు ఆర్‌ఐ నాగరాజు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎం.లక్ష్మీరాజ్యం, అంగన్‌వాడీ వర్కర్ పి.హేమలత, ఏఎన్‌ఎం కిరణ్‌మయి చర్చి వద్దకు చేరుకుని వివాహాన్ని నిలుపుదల చేశారు.
 
 వధూవరులు మేజర్లేనని వారి బంధువులు తొలుత చెప్పుకొచ్చారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు చూపించమని అధికారులు కోరగా యువకుడికి సంబంధించిన రేషన్‌కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులను చూపారు. అయితే బాలికకు సంబంధించి ఏ పత్రం చూపలేదు. తమ కుమార్తెకు 17 ఏళ్లు నిండాయని ఆమె తల్లిదండ్రులు, బంధువులు తెలపడంతో అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఇరువురి తల్లిదండ్రులు, బంధువులు, వివాహాన్ని జరిపిస్తున్న పాస్టర్లను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. వయస్సు నిండకుండా వివాహం చేసేందుకు ప్రయత్నిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని తల్లిదండ్రులను హెచ్చరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement