బాలలకు సుప్రీమ్‌ రక్షణ! | Sakshi Editorial On Supreme Court Of India protection for children | Sakshi
Sakshi News home page

బాలలకు సుప్రీమ్‌ రక్షణ!

Published Thu, Sep 26 2024 1:35 AM | Last Updated on Thu, Sep 26 2024 1:35 AM

Sakshi Editorial On Supreme Court Of India protection for children

భారత సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. మద్రాస్‌ హైకోర్ట్‌ గతంలో చేసిన తప్పును సరిదిద్దింది. బాలలపై లైంగిక అకృత్య, అశ్లీల దృశ్యాల వీడియోలను డౌన్‌ లోడ్‌ చేసినా, కలిగివున్నా, చివరకు చూసినా, సదరు అంశాలపై నిర్ణీత అధికారులకు ఫిర్యాదు చేయకున్నా కూడా పోక్సో, ఐటీ చట్టాల కింద నేరమేనని కుండబద్దలు కొట్టింది. దాదాపు 200 పేజీల తాజా తీర్పుతో బాలలపై లైంగిక అత్యాచారాలను నిరోధించేలా ‘లైంగిక అకృత్యాల నుంచి బాలలకు రక్షణ’ (పోక్సో) చట్టానికి పదును పెట్టింది. 

పసిపాపల నుంచి ఎదిగిన మైనర్ల వరకు బాలలందరి పైనా దేశంలో అంతకంతకూ అఘాయిత్యాలు పెరుగుతున్న వేళ రానున్న రోజుల్లో ఈ తీర్పు బలమైన ప్రభావం చూపనుంది. ఇంటా బయటా ప్రతిచోటా కామాంధుల బెడద పెచ్చరిల్లిన సమయంలో ఈ సుప్రీమ్‌ తీర్పు భారతదేశంలోని బాలబాలికలకు భారీ ఊరట, బలమైన అండ. 

తాజా సుప్రీమ్‌ కోర్ట్‌ ఆదేశంతో చైల్డ్‌ పోర్నోగ్రఫీ సమాచారాన్ని ‘కలిగి ఉండడం’ అనే పదం తాలూకు నిర్వచన పరిధి పెరిగింది. అలాంటి దృశ్యాలను డౌన్‌లోడ్‌ చేయకున్నా, పరికరంలో పదిలపరుచుకోకపోయినా... కేవలం చూసినా సరే ఇప్పుడది పోక్సోలోని సెక్షన్‌ 15 కింద నేరమే అవుతుంది. ఇది కేవలం సాంకేతికపరమైన అంశం కానే కాదు... తీవ్రమైన నేరం. 

నిజానికి, చైల్డ్‌ పోర్న్‌ దృశ్యాల తయారీ, పంపిణీయే నేరమనీ, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో డౌన్‌లోడ్‌ చేసి ప్రైవేటుగా చూసినంత మాత్రాన అది నేరం కిందకు రాదనీ ఆ మధ్య మద్రాస్‌ హైకోర్ట్‌ తీర్పునిచ్చింది. మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసి చూసిన ఓ చెన్నై కుర్రాడిపై నేర విచారణను జనవరి 11న రద్దు చేసింది. 

దీని వల్ల బాలల సంక్షేమంపై దుష్ప్రభావం పడుతుందని తప్పుబడుతూ వివిధ స్వచ్ఛంద సంస్థల సమాహారమైన ‘జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయన్స్‌’ సుప్రీమ్‌ గడప తొక్కింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన సదరు తీర్పు ‘ఘోరమైనది’ అంటూ మార్చిలోనే సుప్రీమ్‌ తప్పుబట్టింది. మద్రాస్‌ హైకోర్ట్‌ తీర్పు ‘అసాధారణ∙తప్పు’ అని సుప్రీమ్‌ తన తాజా ఆదేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం.

సుప్రీమ్‌ తన తాజా ఆదేశంతో ఆ పాత మద్రాస్‌ హైకోర్ట్‌ తీర్పును తోసిపుచ్చినట్టయింది. అదే సమయంలో ‘చైల్డ్‌ పోర్నోగ్రఫీ’ అనే పదం నేరాన్ని తేలిక చేస్తున్నట్టు ఉందని భావించింది. ఆ పదాన్ని పరిహరించి, దాని బదులు ‘బాలలపై లైంగిక అకృత్యాలు, దాడుల సమాచారం’ (సీఎస్‌ఈ ఏఎమ్‌) అనే పదాన్ని సంబంధిత చట్టాలన్నిటిలో వాడేలా పార్లమెంట్‌ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని అభ్యర్థించడం విశేషం. 

ఇకపై న్యాయస్థానాలన్నీ తమ ఆదేశాలు, తీర్పుల్లో ఈ పదాన్నే వాడాలని కూడా సుప్రీమ్‌ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్, మరో న్యాయమూర్తి జస్టిస్‌ పార్దీవాలాలతో కూడిన సుప్రీమ్‌ ధర్మాసనం ఇచ్చిన ఆదేశం, చేసిన అభ్యర్థన ఆలోచించదగినది, స్వాగతించవలసినది. గమనిస్తే, సమస్యంతా చట్టాలలోని అంశాలకు కొన్ని కోర్టులు సంకుచిత అంతరార్థాలు తీయడంతో వస్తోంది. 

మద్రాస్‌ హైకోర్ట్‌లోనూ జరిగింది అదే. తద్వారా బాలలపై సైబర్‌ నేరాలకు పాల్పడినవారిని శిక్షించడానికి ఉద్దేశించిన చట్టాల ప్రయోజనమే దెబ్బతింటోంది. అందుకే, ఈ విషయంలో కోర్టులు జాగరూకతతో ఉండాలని సుప్రీమ్‌ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. 

గణాంకాలు గమనిస్తే, దేశంలో బాలలపై అకృత్యాలు అంతకంతకూ అధికమవుతున్నాయి. ఒక్క 2022లోనే వాటి సంఖ్య 8.7 శాతం పెరిగింది. అలాంటి ఘటనలు 1.68 లక్షలకు చేరినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) మాట. పసివారిపై అఘాయిత్యాలు జరిగినప్పటికీ భయం, సమాజంలో పడే కళంకం, అవగాహన లేమితో ఇంకా అనేక కేసులు వెలుగులోకి రావట్లేదు. 

పైగా, ఇంట్లో అయినవాళ్ళు, బడిలో ఉద్యోగులు సైతం సాగిస్తున్న ఈ అమానుషాలు పిల్లల మనసులపై జీవితాంతం ప్రభావం చూపుతున్నాయి. పెరిగి పెద్దయినా సరే వారిని ఆ చేదు అనుభవాల నుంచి మానసికంగా బయట పడనీయకుండా చేస్తున్నాయి. వీటన్నిటినీ అరికట్టడానికే 2012లోనే పోక్సో లాంటి కఠినచట్టాలు వచ్చాయి. అయినా, బాలలపై అత్యాచారాలు ఆగక పోవడం విషాదం. 

సదరు కేసులు పెరుగుతున్నందున ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పెట్టాలంటూ అయిదేళ్ళ క్రితమే సుప్రీమ్‌ ఆదేశించింది. అయితే, రెగ్యులర్‌ కోర్ట్‌లకే జడ్జీలు కరవైన పరిస్థితుల్లో ఇక ఈ ఫాస్ట్‌ట్రాక్‌ల కథేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. దానికి తోడు చట్టంలోని కఠిన అంశాలకు ఒక్కో హైకోర్ట్‌ ఒక్కో రకం అర్థం చెబుతూ, వ్యాఖ్యానం చెప్పడం పెను సమస్యయి కూర్చుంది. 

తాజా తీర్పుతో ఆ పరిస్థితులు కొంతవరకు మారతాయని ఆశించాలి. చట్టాన్ని అతిక్రమిస్తున్న వారికి మేలుకొలుపు. అదే సమయంలో అది అందరికీ స్పష్టమైన సందేశం ఇస్తోంది. అదేమిటంటే – బాలల భద్రత అతి ముఖ్యమైనది! వారి భద్రత కోసమే కోర్టు చట్టానికి మరింత కఠినమైన, కట్టుదిట్టమైన వ్యాఖ్యానం అందించింది. 

ఇక యూ ట్యూబ్‌ – గూగుల్‌ లాంటి వేదికలు, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు, నిత్యం ఇంటర్నెట్‌ వాడేవారు అప్రమత్తంగా ఉండక తప్పదు. అలాంటి కంటెంట్‌ను తక్షణం తొలగించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడమే మార్గం. అదే సమయంలో విద్యాలయాల్లో లైంగిక విజ్ఞానాన్ని సమగ్రంగా బోధించి, పిల్లల్లో అవగాహన కల్పించాలంటూ ప్రభుత్వానికి సుప్రీమ్‌ చేసిన సూచన విలువైనది. 

బిడియపడకుండా తల్లితండ్రులు, గురువులు పిల్ల లకు విషయాలను వివరించడం మేలు. శారీరకంగా, సామా జికంగా, చట్టపరంగా అవగాహన పెరి గితే అకృత్యాల్ని అడ్డుకోవడం సులభమవుతుంది. ఇలాంటి కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న సంకేతం సుప్రీమ్‌ తాజా తీర్పు అందించడం అన్ని విధాలా ఆహ్వానించదగ్గ పరిణామం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement