Child Protection
-
బాలలకు సుప్రీమ్ రక్షణ!
భారత సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. మద్రాస్ హైకోర్ట్ గతంలో చేసిన తప్పును సరిదిద్దింది. బాలలపై లైంగిక అకృత్య, అశ్లీల దృశ్యాల వీడియోలను డౌన్ లోడ్ చేసినా, కలిగివున్నా, చివరకు చూసినా, సదరు అంశాలపై నిర్ణీత అధికారులకు ఫిర్యాదు చేయకున్నా కూడా పోక్సో, ఐటీ చట్టాల కింద నేరమేనని కుండబద్దలు కొట్టింది. దాదాపు 200 పేజీల తాజా తీర్పుతో బాలలపై లైంగిక అత్యాచారాలను నిరోధించేలా ‘లైంగిక అకృత్యాల నుంచి బాలలకు రక్షణ’ (పోక్సో) చట్టానికి పదును పెట్టింది. పసిపాపల నుంచి ఎదిగిన మైనర్ల వరకు బాలలందరి పైనా దేశంలో అంతకంతకూ అఘాయిత్యాలు పెరుగుతున్న వేళ రానున్న రోజుల్లో ఈ తీర్పు బలమైన ప్రభావం చూపనుంది. ఇంటా బయటా ప్రతిచోటా కామాంధుల బెడద పెచ్చరిల్లిన సమయంలో ఈ సుప్రీమ్ తీర్పు భారతదేశంలోని బాలబాలికలకు భారీ ఊరట, బలమైన అండ. తాజా సుప్రీమ్ కోర్ట్ ఆదేశంతో చైల్డ్ పోర్నోగ్రఫీ సమాచారాన్ని ‘కలిగి ఉండడం’ అనే పదం తాలూకు నిర్వచన పరిధి పెరిగింది. అలాంటి దృశ్యాలను డౌన్లోడ్ చేయకున్నా, పరికరంలో పదిలపరుచుకోకపోయినా... కేవలం చూసినా సరే ఇప్పుడది పోక్సోలోని సెక్షన్ 15 కింద నేరమే అవుతుంది. ఇది కేవలం సాంకేతికపరమైన అంశం కానే కాదు... తీవ్రమైన నేరం. నిజానికి, చైల్డ్ పోర్న్ దృశ్యాల తయారీ, పంపిణీయే నేరమనీ, ఎలక్ట్రానిక్ పరికరాల్లో డౌన్లోడ్ చేసి ప్రైవేటుగా చూసినంత మాత్రాన అది నేరం కిందకు రాదనీ ఆ మధ్య మద్రాస్ హైకోర్ట్ తీర్పునిచ్చింది. మొబైల్లో డౌన్లోడ్ చేసి చూసిన ఓ చెన్నై కుర్రాడిపై నేర విచారణను జనవరి 11న రద్దు చేసింది. దీని వల్ల బాలల సంక్షేమంపై దుష్ప్రభావం పడుతుందని తప్పుబడుతూ వివిధ స్వచ్ఛంద సంస్థల సమాహారమైన ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ సుప్రీమ్ గడప తొక్కింది. సింగిల్ జడ్జి ఇచ్చిన సదరు తీర్పు ‘ఘోరమైనది’ అంటూ మార్చిలోనే సుప్రీమ్ తప్పుబట్టింది. మద్రాస్ హైకోర్ట్ తీర్పు ‘అసాధారణ∙తప్పు’ అని సుప్రీమ్ తన తాజా ఆదేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం.సుప్రీమ్ తన తాజా ఆదేశంతో ఆ పాత మద్రాస్ హైకోర్ట్ తీర్పును తోసిపుచ్చినట్టయింది. అదే సమయంలో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ అనే పదం నేరాన్ని తేలిక చేస్తున్నట్టు ఉందని భావించింది. ఆ పదాన్ని పరిహరించి, దాని బదులు ‘బాలలపై లైంగిక అకృత్యాలు, దాడుల సమాచారం’ (సీఎస్ఈ ఏఎమ్) అనే పదాన్ని సంబంధిత చట్టాలన్నిటిలో వాడేలా పార్లమెంట్ ఆర్డినెన్స్ తీసుకురావాలని అభ్యర్థించడం విశేషం. ఇకపై న్యాయస్థానాలన్నీ తమ ఆదేశాలు, తీర్పుల్లో ఈ పదాన్నే వాడాలని కూడా సుప్రీమ్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, మరో న్యాయమూర్తి జస్టిస్ పార్దీవాలాలతో కూడిన సుప్రీమ్ ధర్మాసనం ఇచ్చిన ఆదేశం, చేసిన అభ్యర్థన ఆలోచించదగినది, స్వాగతించవలసినది. గమనిస్తే, సమస్యంతా చట్టాలలోని అంశాలకు కొన్ని కోర్టులు సంకుచిత అంతరార్థాలు తీయడంతో వస్తోంది. మద్రాస్ హైకోర్ట్‌లోనూ జరిగింది అదే. తద్వారా బాలలపై సైబర్ నేరాలకు పాల్పడినవారిని శిక్షించడానికి ఉద్దేశించిన చట్టాల ప్రయోజనమే దెబ్బతింటోంది. అందుకే, ఈ విషయంలో కోర్టులు జాగరూకతతో ఉండాలని సుప్రీమ్ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. గణాంకాలు గమనిస్తే, దేశంలో బాలలపై అకృత్యాలు అంతకంతకూ అధికమవుతున్నాయి. ఒక్క 2022లోనే వాటి సంఖ్య 8.7 శాతం పెరిగింది. అలాంటి ఘటనలు 1.68 లక్షలకు చేరినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) మాట. పసివారిపై అఘాయిత్యాలు జరిగినప్పటికీ భయం, సమాజంలో పడే కళంకం, అవగాహన లేమితో ఇంకా అనేక కేసులు వెలుగులోకి రావట్లేదు. పైగా, ఇంట్లో అయినవాళ్ళు, బడిలో ఉద్యోగులు సైతం సాగిస్తున్న ఈ అమానుషాలు పిల్లల మనసులపై జీవితాంతం ప్రభావం చూపుతున్నాయి. పెరిగి పెద్దయినా సరే వారిని ఆ చేదు అనుభవాల నుంచి మానసికంగా బయట పడనీయకుండా చేస్తున్నాయి. వీటన్నిటినీ అరికట్టడానికే 2012లోనే పోక్సో లాంటి కఠినచట్టాలు వచ్చాయి. అయినా, బాలలపై అత్యాచారాలు ఆగక పోవడం విషాదం. సదరు కేసులు పెరుగుతున్నందున ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలంటూ అయిదేళ్ళ క్రితమే సుప్రీమ్ ఆదేశించింది. అయితే, రెగ్యులర్ కోర్ట్లకే జడ్జీలు కరవైన పరిస్థితుల్లో ఇక ఈ ఫాస్ట్ట్రాక్ల కథేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. దానికి తోడు చట్టంలోని కఠిన అంశాలకు ఒక్కో హైకోర్ట్ ఒక్కో రకం అర్థం చెబుతూ, వ్యాఖ్యానం చెప్పడం పెను సమస్యయి కూర్చుంది. తాజా తీర్పుతో ఆ పరిస్థితులు కొంతవరకు మారతాయని ఆశించాలి. చట్టాన్ని అతిక్రమిస్తున్న వారికి మేలుకొలుపు. అదే సమయంలో అది అందరికీ స్పష్టమైన సందేశం ఇస్తోంది. అదేమిటంటే – బాలల భద్రత అతి ముఖ్యమైనది! వారి భద్రత కోసమే కోర్టు చట్టానికి మరింత కఠినమైన, కట్టుదిట్టమైన వ్యాఖ్యానం అందించింది. ఇక యూ ట్యూబ్ – గూగుల్ లాంటి వేదికలు, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు, నిత్యం ఇంటర్నెట్ వాడేవారు అప్రమత్తంగా ఉండక తప్పదు. అలాంటి కంటెంట్‌ను తక్షణం తొలగించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడమే మార్గం. అదే సమయంలో విద్యాలయాల్లో లైంగిక విజ్ఞానాన్ని సమగ్రంగా బోధించి, పిల్లల్లో అవగాహన కల్పించాలంటూ ప్రభుత్వానికి సుప్రీమ్ చేసిన సూచన విలువైనది. బిడియపడకుండా తల్లితండ్రులు, గురువులు పిల్ల లకు విషయాలను వివరించడం మేలు. శారీరకంగా, సామా జికంగా, చట్టపరంగా అవగాహన పెరి గితే అకృత్యాల్ని అడ్డుకోవడం సులభమవుతుంది. ఇలాంటి కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న సంకేతం సుప్రీమ్ తాజా తీర్పు అందించడం అన్ని విధాలా ఆహ్వానించదగ్గ పరిణామం. -
జడలు విప్పుతున్న వికృత హింస.. చుట్టూ పరిస్థితులు మారాలి
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో ముక్కు పచ్చ లారని చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. దీనిని చూస్తుంటే ఆడ పిల్లలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా లైంగిక దాడికి గురయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. జడలు విప్పుతున్న ఈ వికృత అమానవీయ హింస ఆడ పిల్లల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లైంగిక దాడులకు ప్రేరేపించే సంస్కృతి మన చుట్టూ విశృంఖల స్థాయిలో విస్తరిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... లైంగిక దాడులు కొనసాగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రక్త సంబంధీకులు, టీచర్లు, డ్రైవర్లు... ఇలా మన చుట్టుపక్కల ఉండే మనకు పరిచయం ఉన్నవారూ, లేనివారి రూపాల్లో లైంగికదాడులు పొంచి ఉంటున్నాయి. ఈ ఘటనలు చోటు చేసుకున్న సందర్భాల్లో పలుకుబడి ఉన్న నిందితులు బెదిరించడం వల్ల చాలామంది బాధిత కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికీ భయపడుతున్నారు. అలాగే లైంగిక దాడి సంగతి బయటికి తెలిస్తే పరువు పోతుందన్న భయం భారతీయ సమాజంలోని తల్లిదండ్రులకు సహజంగానే ఉంటుంది. అందుకే ఎవరికీ చెప్పు కోలేక తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. అటువంటి కుటుంబాలపై దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉంది. అందుకే బాధిత కుటుంబాలు వెంటనే పోలీస్ సహాయం పొందాలి. చిన్నపిల్లల విషయంలో ఆడ, మగ అన్న తేడాను చూపించకుండా ఇద్దరిపైనా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రూరులు మరో అడుగు ముందుకువేసి చైల్డ్ సెక్స్, చైల్డ్ పోర్నోగ్రఫీల రూపంలో ఈ భయంకర సంస్కృతిని ఇంటర్నెట్లో పెట్టి డబ్బు చేసుకునే పనీ చేస్తున్నారు. అంటే వీళ్లు ఈ అసాంఘిక, అమానవీయ కార్యకలాపాలను ‘మార్కెట్ సరుకు’గా మార్చేశారన్న మాట. ‘వర్జిన్ సెక్స్’ పేరుతో టీనేజ్ పిల్లలపై లైంగికదాడులు చేస్తూ అంతర్జాలంలో ఆ వీడియోలు వైరల్ చేసి డబ్బులు సంపాదించడం ఇందులో భాగంగానే చూడాలి. ఈ దాడులకు గురైన పిల్లలు క్రమంగా సెక్స్ వ్యాపారం ఊబిలో కూరుకుపోయి జీవితాలను కోల్పోతున్నారు. ఆధునిక యాంత్రిక ప్రపంచంలో తల్లిద్రండులు పిల్లలకు పట్టించుకునే తీరిక లేకపోవడం వల్ల నేరస్థులు పిల్లలను ట్రాప్ చేయగలుగుతున్నారు. అలాగే పిల్లలకు సెల్‌ఫోన్ అందుబాటులో ఉండటం వల్ల అన్నీ చూసే అవకాశం ఏర్పడుతోంది. మాదక ద్రవ్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా వారు దారితప్పుతున్నారు. టీవీల్లో ప్రసారం అవుతున్న కంటెంట్ కూడా ఈ దురాగతాలకు కారణమవుతున్నది. ఈ పరిస్థితి మారాలంటే పాఠశాల స్థాయిలోనే మోరల్ సైన్స్ క్లాస్‌లను తప్పని సరిగా విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్‌ల గురించిన అవగాహన పిల్లలకు కల్పించాలి. పిల్లలపై లైంగిక దాడుల నియంత్రణ, వాటిని ఎదుర్కోవడానికి రూపొందించిన ‘పోక్సో’ తరహా చట్టాల పట్ల అవగాహన కూడా సమాజాన్ని అప్రమత్తం చేయటంలో ఉపకరిస్తాయి. (క్లిక్ చేయండి: ఆపన్నులకు ఫ్యామిలీ డాక్టర్ భరోసా) - డా. కడియం కావ్య కడియం ఫౌండేషన్ ఛైర్పర్సన్ -
చిన్నారులతో పని చేయించడం నేరం
సాక్షి,మేడ్చల్ జిల్లా: చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని.. ఈ విషయంలో చట్టాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ హరీష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ కమిటీ (జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ), చైల్డ్ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. బడులకు పంపించేలా చర్యలు తీసుకోవాలి.. ♦ చిన్న పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. వారి తల్లిదండ్రులు పాఠశాలల్లో చేరి్పంచాలని ఇన్చార్జ్ కలెక్టర్ కోరారు. చాలా మంది చిన్నారులు ఇటుక బట్టీల్లో కూలీలుగా పని చేస్తున్నారని చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి పనులు మాని్పంచి పాఠశాలలకు వెళ్లేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 1098 సేవలను వినియోగించుకోవాలి.. ♦ బాలల అక్రమ రవాణా, లైంగికదాడులు, బాల్య వివాహాలు, వేధింపులకు గురి చేసినా ఇతర ఇబ్బందికరమైన చర్యలకు పాల్పడినా వారిపై సంబంధిత యాక్టుల ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. పిల్లలకు ఉన్న హక్కులను ఎవరూ దూరం చేయరాదన్నారు. వారి హక్కుల రక్షణతో పాటు వారి అభివృద్ధికి కావాల్సిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. చైల్డ్‌లైన్ 1098 సేవలను వినియోగించుకోవాలని కోరారు. మూడు నెలలకో సమావేశం నిర్వహించాలి... ♦ ప్రతి మూడు నెలలకోసారి ఈ సమావేశం నిర్వహించాలని ఇన్చార్జ్ కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, స్యాంసన్, జిల్లా సంక్షేమాధికారి అంకేశ్వరరావు, రాచకొండ డీసీపీ సలీమా, డీఆర్డీవో పద్మజా, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.మల్లికార్జున్‌రావు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రాజారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చర్మాన్ని చర్మం తాకలేదు గనుక..
చిన్నారుల రక్షణ చట్టం ‘పోక్సో’. తగని విధంగా వారిని తాకితే మూడేళ్ల జైలు! అతడు తాకాడు. తగని విధంగానే తాకాడు. కానీ అతడు దోషి కాదని తీర్పొచ్చింది! స్కిన్–టు–స్కిన్ తాకలేదు కనుక..‘పోక్సో’ కింద శిక్షించలేమని ‘వస్త్ర’ భాష్యం! సమాజం దిగ్భ్రాంతి చెందింది. చట్టానికి గ్రిప్ లేదా? న్యాయానికి నిజంగానే చూపులేదా? పేరొద్దు. ముప్పై తొమ్మిదేళ్ల అతను అందాం. పేరు చెబితే ఆ పేరు గల వాళ్లందరికి తలవంపులుగా ఉండొచ్చు. ఇక ఆ పన్నెండేళ్ల బాలిక పేరు కూడా చట్ట ప్రకారం బయటికి తెలియడానికి లేదు. అతను నిందితుడు. ఆ చిన్నారి బాధితురాలు. 2016 డిసెంబర్లో ఓ రోజు అతడు తినేందుకు ఏదో తాయిలం ఇస్తానని ఆశపెట్టి ఆ బాలిక ను తన ఇంటికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లాక తలుపేసి, బాలిక ఛాతీని నొక్కాడు. ఒంటి మీది బట్టలు కూడా తీయబోయాడు. బాలిక పెద్దగా అరిచింది. పెద్దవాళ్లకు తెలిసింది. అతడికి నాలుగు తగిలించి పోలీసులకు అప్పగించారు. అతడిపై ‘పోక్సో’ కేసు నమోదైంది. పోక్సో అంటే ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్’! కఠినమైన చట్టం. లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం 2012లో ఈ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం దోషికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ కేసులో దోషికి కూడా కింది కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్ 354 కేసు కింద కూడా అతడిపై మరో కేసు నమోదైంది. ఈ సెక్షన్ ప్రకారం మహిళపై లైంగిక అకృత్యానికి పాల్పడితే కనీసం రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధిస్తారు. ఈ రెండు కేసులపై అతడు నాలుగేళ్లు గా బాంబే హైకోర్టులో ‘న్యాయం’ కోసం పోరాడుతున్నాడు! చివరికి ఈ జనవరి 19న తీర్పు వెలువడింది. తీర్పేంటి? బాంబే హైకోర్టులో తీర్పు కోసం ఈ కేసు నాగపూర్ బెంచ్ పైకి వచ్చింది. సింగిల్ జడ్జి బెంచి అది. ఆ రోజు బెంచిపై జస్టిస్ పుష్పా గనేడివాలా ఉన్నారు. మహిళా జడ్జి! కింది కోర్టు విధించిన శిక్షను తన తీర్పులో ఆమె సమర్థించబోతున్నారనే బాలిక వైపు వాళ్లు అనుకున్నారు. కానీ తీర్పు దోషికి అనుకూలంగా వచ్చింది! ‘‘అతడు దోషే కానీ, అతడు చేసిన నేరం ‘పోక్సో’ పరిధిలోకి రాదు కనుక, ఆ చట్టం నుంచి మినహాయించి, ఐపీసీ సెక్షన్ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా పరిగణించడం జరిగింది’’ అని జస్టిస్ పుష్ప తీర్పు ఇచ్చారు! అంటే.. చిన్నారికి రక్షణ కల్పించే చట్టం కింద అతడికి శిక్ష పడదు. ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు మాత్రమే పడుతుంది. ‘‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో నేరం అవదు. చర్మాన్ని చర్మం తాకాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు’’ అని జస్టిస్ పుష్ప తన తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. చిన్నారుల ఒంటిని తాకకూడని చోట తాకడం, చిన్నారుల చేత తగని చోట ఒంటిని తాకించుకోవడం మాత్రమే పోక్సో చట్టం కింద నేరం అవుతాయి కనుక, అతడు ఆ పని చేయలేదు కనుక ఆ ప్రత్యేక చట్టం ప్రకారం అతడు నిర్దోషే అని జస్టిస్ పుష్ప తీర్పునకు ముగింపు ఇచ్చారు. తీర్పులో తప్పేంటి? తీర్పు తీర్పే. అందులో తప్పొప్పులను ఎంచేందుకు ఉండదు. పైకోర్టుకు వెళ్లడం తప్ప! అయితే ఈ కేసుపై స్పందించకుండా మాత్రం ఎవరూ ఉండలేకపోతున్నారు. స్కిన్–టు–స్కిన్ కాంటాక్టు లేదు కనుక ‘పోక్సో’ చట్టం ప్రకారం చిన్నారి ఛాతీని ప్రెస్ చేయడం నేరం అవదన్న జస్టిస్ పుష్ప పరిశీలనను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘అలాగైతే మరి స్కిన్–టు–స్కిన్ తాకక పోయినా, దుస్తుల పైనుంచి తాకినా నేరమేనని పోక్సో చట్టంలో చేర్చండి’ అని అడుగుతున్నవాళ్లూ ఉన్నారు. మరికొందరు ఇంకొంచెం సూక్ష్మంగా ముందుకు వెళ్లి, మరింత తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పునకు అర్థమేంటి! ఇలాంటి ఒక నీతిబాహ్యమైన చర్యను, మానసిక రుగ్మతను, హీనత్వాన్నీ ఒక మామూలు విషయంగా చూసేందుకు మనం అలవాటు పడబోతున్నామా?! – ప్రియాంక చతుర్వేది, రాజ్యసభ సభ్యురాలు తీర్పును గురించిన వార్తను చదివాక ఎలా స్పందించాలో తెలీక మాటల్ని వెతుక్కున్నాను. గాట్ ఇట్ నౌ. హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్‌డే. (ఆవేదనగా, ఆవేశంగా..) – తాప్సీ, బాలీవుడ్ నటి ఈ తీర్పు ఫేక్ న్యూస్ అని ఎవరైనా చెప్పండి ప్లీజ్. – రితేశ్ దేశ్‌ముఖ్, టెలివిజన్ పర్సనాలిటీ బాంబే హైకోర్టులో సింగిల్ బెంచ్ వచ్చిన తీర్పుపై తక్షణం ‘లెటర్స్ పేటెంట్ అప్పీల్’ను ఫైల్ చేయండి. – కనూంగో, ఛైర్మన్, నేషనల్ కమిషన్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ (మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం) -
రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు బుధవారం ఆపరేషన్ ముస్కాన్ (ఆకస్మిక తనిఖీలు) నిర్వహించారు. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు 794 బృందాలు తెల్లవారుజామున 4 గంటల నుంచి తనిఖీలు చేపట్టాయి. పోలీసులు, చైల్డ్‌లైన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, సినిమా హాళ్లు, పార్కుల వద్ద ఆకస్మిక తనిఖీలు జరిపారు. బాలబాలికల అదృశ్య ఘటనలు, చట్ట విరుద్ధంగా బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఘటనలపై పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. మొత్తం 2,774 మంది పిల్లలను గుర్తించగా వారిలో బాలురు 2,378, బాలికలు 396 మంది ఉన్నారు. వారిలో చిరునామా ఉన్న వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. చిరునామా దొరకని వారిని చైల్డ్‌లైన్‌కు అప్పగించినట్టు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. -
గ్రాండ్ పేరెంట్స్ ఘనత ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక సమాజంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ పేరెంట్స్ (తాతలు, అమ్మమ్మలు లేదా బాపమ్మలు) నిర్వహిస్తున్న పాత్ర అంతా ఇంతా కాదు. పిల్లల సంరక్షణ నుంచి వారి పెళ్లిళ్ల వరకు వారు నిర్వహిస్తున్న పాత్ర అమోఘమైనది. పిల్లల సంరక్షణతోపాటు వారికి సామాజిక మార్గనిర్దేశంలో వారి పాత్ర మరువ లేనిది. కుటుంబ పోషణలో కూడా వారి పాత్ర ముఖ్యమైనదే. గ్రాండ్ పేరెంట్స్ పిల్లలను సంరక్షిస్తున్న కారణంగా ఒక్క బ్రిటన్ కుటుంబానికి ఏడాదికి ఏడు వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయంటే ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే ఆ దేశంలో పిల్లల సంరక్షణ చాలా ఖరీదు. అయితే ఆస్ట్రేలియాలోనైతే 200 కోట్ల డాలర్లను ఓ కుటుంబం ఏడాదికి ఆదా చేయవచ్చు. నేడు ప్రపంచ జనాభా 760 కోట్లుకాగా, వారిలో 18 శాతం అంటే, 140 కోట్ల మంది గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. అయితే వారి సంఖ్య ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంది. పెళ్లిళ్ల వయస్సు, తల్లిదండ్రుల్లో సంతానోత్పత్తి శక్తి, ప్రజల ఆయుషు ప్రమాణం అంశాలపై ఆధారపడి వారి సంఖ్య ఉంటుంది. వారి సంఖ్య ఇథియోపియా, కెన్యా, నైజీరియా, పాకిస్థాన్ దేశాల్లో అతి తక్కువగా 15 శాతం ఉండగా, కోస్టారికా, జపాన్, రష్యా, ఉక్రెయిన్‌లో 25 శాతం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ పేరెంట్స్‌లో మహిళల సంఖ్యనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది అవ్వలు ఉండగా, 58 కోట్ల మంది తాతలు ఉన్నారు. ఇక పిల్లలే లేని వద్ధులు 60 లక్షల మంది ఉన్నారు. భారత్, పాకిస్థాన్, ఇండోనేసియా, టర్కీ లాంటి వర్ధమాన దేశాల్లో 40 ఏళ్లకు పైబడి పిల్లలు లేని వారి సంఖ్య ఐదు శాతానికన్నా తక్కువగా ఉంది. అదే అభివద్ధి చెందిన ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో 40 ఏళ్లకు పైబడి పిల్లలులేని తల్లుల సంఖ్య పది శాతానికిపైగా ఉండగా 50 ఏళ్లకు పైబడి పిల్లలులేని తల్లుల సంఖ్య 20 శాతానికిపైగా ఉండడం ఆశ్చర్యం. ఓ కుటుంబంలోని భార్యాభర్తలు ఎప్పుడు గ్రాంట్ పేరెంట్స్‌గా మారుతారన్న విశయం సాధారణంగా మొదటి సంతానం ఎప్పుడయింది అన్నదానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కెనడా, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ లాంటి అభివద్ధి చెందిన దేశాల్లో ఓ మహిళకు తన 30వ ఏటా మొదటి సంతానం కలుగుతుంది. అంటే వారు గ్రాండ్ మదర్ అయ్యే వయస్సు దాదాపు 60 ఏళ్లు. బంగ్లాదేశ్, చాడ్, మాలి, నైగర్, జాంబియాలాంటి దేశాల్లో 20 ఏళ్లలోపే మహిళలకు మొదటి సంతానం కలుగుతుంది. అంటే వారు 40 ఏళ్ల నాటికి గ్రాండ్ మదర్స్ అవుతారు. ఎక్కువ సంతానోత్పత్తి కలిగిన ఉగాండ, కెన్యా, నైజీరియా లాంటి దేశాల్లో 50 ఏళ్లు మించిన వారి సంఖ్య వారి దేశ జనాభాలో పది శాతం కాగా, జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి దేశాల్లో 50 ఏళ్లు పైబడిన వారు వారి జనాభాలో దాదాపు 40 శాతం కావడం విశేషం. ఓ కుటుంబంలో గ్రాండ్ పేరెంట్స్ ఎంతకాలం జీవించి ఉంటారనే అంశం వారి పెళ్లీడు వయస్సు, అక్కడి జీవన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. 20వ శాతాబ్దం ప్రారంభంలో అమెరికాలో మనిషి ఆయుష్సు ప్రమాణం 47 ఏళ్లుకాగా, గ్రాంట్ పేరెంట్స్‌గా 30 ఏళ్లు బతికిన వాళ్లు 20 శాతంకాగా, 77 ఏళ్ల ఆయుష్సు ప్రమాణం కలిగిన నేటి తరంలో గ్రాంట్ పేరెంట్స్‌గా 30 ఏళ్లు బతికే వాళ్లు దాదాపు 80 శాతం ఉంటున్నారు. గ్రాంట్ పేరెంట్స్‌లో కూడా ఎక్కువ కాలం బతుకుతున్న వాళ్లు మహిళలే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా నేడు బతికున్న శాతాధిక వద్ధుల్లో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వీరి సంఖ్య 21వ శాతాబ్దంలో మూడు రెట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా శతాధిక వద్ధుల సంఖ్య నేడు 50 లక్షలుకాగా, వీరి సంఖ్య 2030 నాటికి బాగా పెరగనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని ఎనిమిదేళ్ల పిల్లల్లో 70 శాతం మంది గ్రేట్ గ్రాండ్ పేరంట్స్ (ముత్తాతలు, ముత్తవ్వలు) అయ్యే అవకాశం ఉందని అంచనాలు తెలియజేస్తున్నాయి. ఆధునిక సమాజంలో గ్రాండ్ పేరెంట్స్ పాత్ర విశేషంగా పెరిగింది. భార్యాభర్తల్లో ఇద్దరు ఉద్యోగస్థులైతే పిల్లలను పూర్తిగా గ్రాండ్ పేరెంట్లే చూసుకోవాల్సి వస్తోంది. ఒంటిరి తల్లి లేదా ఒంటరి తండ్రున్న కుటుంబాల్లో కూడా పిల్లల పెంపకం బాధ్యత గ్రాండ్ పేరెంట్స్‌పైనే పడుతోంది. ఇక ఉద్యోగార్థం విదేశాలకు వలసపోయిన కుటుంబాల్లో వీరి పాత్ర మరీ ముఖ్యంగా తయారయింది. చాలా కుటుంబాల్లో గ్రాండ్ పేరంట్స్ పిల్లల పోషణతోపాటు ఆర్థికంగా కూడా అండగా ఉంటుందన్నారు. ఇంత పాత్రను పోషించే గ్రాంట్ పేరెంట్స్ గౌరవార్థం నేడు ప్రపంచంలోని ఎక్కువ దేశాలు ప్రతి ఏటా సెప్టెంబర్ 9వ తేదీన వారి దినోత్సవాన్ని జరుపుతున్నాయి. ఈ సారి కూడా ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఎస్టోనియా, జర్మనీ, ఇటలీ, మెక్సికో, పోలండ్, సింగపూర్, స్పెయిన్, బ్రిటన్ దేశాలు జరుపుకోగా అమెరికా ఈ రోజు అంటే సెప్టెంబర్ 10వ తేదీన జరుపుకుంటోంది. భారత్‌లో ఇది అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. -
లైంగిక వేధింపుల నుంచి కాపాడే బాధ్యత అధికారులదే
పోలీస్ కమిషనర్ కార్తికేయ నిజామాబాద్ క్రైం : బాలికలను వేధింపుల నుంచి కాపాడే బాధ్యత ప్రతి ప్రభుత్వ అధికారిపై ఉందని పోలీస్ కమిషనర్ కార్తికేయ అన్నారు. శనివారం సీపీ కార్యాలయంలో చైల్డ్‌లైన్ 1098 నిజామాబాద్ ఆధ్వర్యంలో బాలల వారోత్సవాల్లో భాగంగా పీఎంసీఎస్వో 2012 యాక్ట్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ కార్తికేయ మాట్లాడుతూ బాలికల విషయంలో ప్రభుత్వ శాఖలు అన్ని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అన్ని డివిజన్లకు పోస్టర్లను పంపాలని 1098 సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ వెంకన్న, సీసీఆర్బీ సీఐ సుధాకర్, ఏవో గులాం మొహినొద్దీన్, ఐటీ కేర్ ఇన్చార్జి గంగాధర్, బాలల సంరక్షణ సమితి ప్రతినిధులు శ్రీరాంచంద్ నాయక్, నరసింహం, 1098 సిబ్బంది కో-ఆర్డినేటర్స్ స్వప్న, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు
నల్లజర్ల : మండలంలోని పోతవరం పంచాయతీ పరిధిలో ముగ్గురు బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా బాలల సంరక్షణ అధికారులు, మండల ఐసీడీఎస్ సిబ్బంది అడుకుని బాలికలను ఏలూరులోని చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్‌కు తరలించారు. కృష్ణాయిగూడెంలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక ను వేగవరం గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవ్వగా అధికారులు అడ్డుకున్నారు. బాలిక తండ్రికి అనారోగ్యం ఉండడంతో కూతురుకు పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డామని తల్లిదండ్రులు వీర్రాజు, లక్ష్మి తెలిపారు. అదే గ్రామానికి చెందిన గెడ్డం తేజస్విని(15)ని గోపాలపురం గ్రామానికి చెందిన వ్యక్తితో శుక్రవారం వివాహం చేసేందుకు నిశ్చయించగా విషయం తెలుసుకున్న అధికారులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పోతవరం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక మల్లవరపు కృష్ణవేణిని అనంతపల్లికి చెందిన యువకుడి కి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమవుతుండగా అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులు సత్యనారాయణ, వెంకటలక్ష్మికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అనంతరం ముగ్గురు బాలికలను జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్, సీడీపీవో రమాదేవి ఏలూరులోని చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్‌కు తరలించారు. అధికారుల వెంట వీఆర్వో అద్దంకి ప్రసాద్, సూపర్వైజర్ స్వర్ణకుమారి, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు పాస్టర్ రాజేష్ ఉన్నారు. కోడిగూడెంలో.. కోడిగూడెం(ద్వారకాతిరుమల) : ద్వారకాతిరుమల మండలం కోడిగూడెంలో బుధవారం జరుగుతున్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన మనుకొండ శ్రీను అనే యువకుడు తన అక్క కూతురైన జంగారెడ్డిగూడేనికి చెందిన 17 సంవత్సరాల బాలికను స్థానిక క్రీస్తు సంఘం చర్చిలో వివాహం చే సుకునేందుకు సిద్ధమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ద్వారకాతిరుమల తహసిల్దార్ సీహెచ్‌వీఎస్‌ఆర్‌ఎల్ ప్రసాద్, ఐసీపీఎస్ అధికారులకు సమాచారం అందించడంతో వారి ఆదేశాల మేరకు ఆర్ఐ నాగరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.లక్ష్మీరాజ్యం, అంగన్వాడీ వర్కర్ పి.హేమలత, ఏఎన్ఎం కిరణ్మయి చర్చి వద్దకు చేరుకుని వివాహాన్ని నిలుపుదల చేశారు. వధూవరులు మేజర్లేనని వారి బంధువులు తొలుత చెప్పుకొచ్చారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు చూపించమని అధికారులు కోరగా యువకుడికి సంబంధించిన రేషన్‌కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులను చూపారు. అయితే బాలికకు సంబంధించి ఏ పత్రం చూపలేదు. తమ కుమార్తెకు 17 ఏళ్లు నిండాయని ఆమె తల్లిదండ్రులు, బంధువులు తెలపడంతో అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఇరువురి తల్లిదండ్రులు, బంధువులు, వివాహాన్ని జరిపిస్తున్న పాస్టర్లను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. వయస్సు నిండకుండా వివాహం చేసేందుకు ప్రయత్నిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని తల్లిదండ్రులను హెచ్చరించారు.