ప్రతీకాత్మక చిత్రం
చిన్నారుల రక్షణ చట్టం ‘పోక్సో’. తగని విధంగా వారిని తాకితే మూడేళ్ల జైలు! అతడు తాకాడు. తగని విధంగానే తాకాడు. కానీ అతడు దోషి కాదని తీర్పొచ్చింది! స్కిన్–టు–స్కిన్ తాకలేదు కనుక..‘పోక్సో’ కింద శిక్షించలేమని ‘వస్త్ర’ భాష్యం! సమాజం దిగ్భ్రాంతి చెందింది. చట్టానికి గ్రిప్ లేదా? న్యాయానికి నిజంగానే చూపులేదా?
పేరొద్దు. ముప్పై తొమ్మిదేళ్ల అతను అందాం. పేరు చెబితే ఆ పేరు గల వాళ్లందరికి తలవంపులుగా ఉండొచ్చు. ఇక ఆ పన్నెండేళ్ల బాలిక పేరు కూడా చట్ట ప్రకారం బయటికి తెలియడానికి లేదు. అతను నిందితుడు. ఆ చిన్నారి బాధితురాలు. 2016 డిసెంబర్‌లో ఓ రోజు అతడు తినేందుకు ఏదో తాయిలం ఇస్తానని ఆశపెట్టి ఆ బాలిక ను తన ఇంటికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లాక తలుపేసి, బాలిక ఛాతీని నొక్కాడు. ఒంటి మీది బట్టలు కూడా తీయబోయాడు. బాలిక పెద్దగా అరిచింది. పెద్దవాళ్లకు తెలిసింది. అతడికి నాలుగు తగిలించి పోలీసులకు అప్పగించారు. అతడిపై ‘పోక్సో’ కేసు నమోదైంది. పోక్సో అంటే ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్’! కఠినమైన చట్టం. లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం 2012లో ఈ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం దోషికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ కేసులో దోషికి కూడా కింది కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్ 354 కేసు కింద కూడా అతడిపై మరో కేసు నమోదైంది. ఈ సెక్షన్ ప్రకారం మహిళపై లైంగిక అకృత్యానికి పాల్పడితే కనీసం రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధిస్తారు. ఈ రెండు కేసులపై అతడు నాలుగేళ్లు గా బాంబే హైకోర్టులో ‘న్యాయం’ కోసం పోరాడుతున్నాడు! చివరికి ఈ జనవరి 19న తీర్పు వెలువడింది.
తీర్పేంటి?
బాంబే హైకోర్టులో తీర్పు కోసం ఈ కేసు నాగపూర్ బెంచ్ పైకి వచ్చింది. సింగిల్ జడ్జి బెంచి అది. ఆ రోజు బెంచిపై జస్టిస్ పుష్పా గనేడివాలా ఉన్నారు. మహిళా జడ్జి! కింది కోర్టు విధించిన శిక్షను తన తీర్పులో ఆమె సమర్థించబోతున్నారనే బాలిక వైపు వాళ్లు అనుకున్నారు. కానీ తీర్పు దోషికి అనుకూలంగా వచ్చింది! ‘‘అతడు దోషే కానీ, అతడు చేసిన నేరం ‘పోక్సో’ పరిధిలోకి రాదు కనుక, ఆ చట్టం నుంచి మినహాయించి, ఐపీసీ సెక్షన్ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా పరిగణించడం జరిగింది’’ అని జస్టిస్ పుష్ప తీర్పు ఇచ్చారు! అంటే.. చిన్నారికి రక్షణ కల్పించే చట్టం కింద అతడికి శిక్ష పడదు. ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు మాత్రమే పడుతుంది. ‘‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో నేరం అవదు. చర్మాన్ని చర్మం తాకాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు’’ అని జస్టిస్ పుష్ప తన తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. చిన్నారుల ఒంటిని తాకకూడని చోట తాకడం, చిన్నారుల చేత తగని చోట ఒంటిని తాకించుకోవడం మాత్రమే పోక్సో చట్టం కింద నేరం అవుతాయి కనుక, అతడు ఆ పని చేయలేదు కనుక ఆ ప్రత్యేక చట్టం ప్రకారం అతడు నిర్దోషే అని జస్టిస్ పుష్ప తీర్పునకు ముగింపు ఇచ్చారు.
తీర్పులో తప్పేంటి?
తీర్పు తీర్పే. అందులో తప్పొప్పులను ఎంచేందుకు ఉండదు. పైకోర్టుకు వెళ్లడం తప్ప! అయితే ఈ కేసుపై స్పందించకుండా మాత్రం ఎవరూ ఉండలేకపోతున్నారు. స్కిన్–టు–స్కిన్ కాంటాక్టు లేదు కనుక ‘పోక్సో’ చట్టం ప్రకారం చిన్నారి ఛాతీని ప్రెస్ చేయడం నేరం అవదన్న జస్టిస్ పుష్ప పరిశీలనను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘అలాగైతే మరి స్కిన్–టు–స్కిన్ తాకక పోయినా, దుస్తుల పైనుంచి తాకినా నేరమేనని పోక్సో చట్టంలో చేర్చండి’ అని అడుగుతున్నవాళ్లూ ఉన్నారు. మరికొందరు ఇంకొంచెం సూక్ష్మంగా ముందుకు వెళ్లి, మరింత తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తీర్పునకు అర్థమేంటి! ఇలాంటి ఒక నీతిబాహ్యమైన చర్యను, మానసిక రుగ్మతను, హీనత్వాన్నీ ఒక మామూలు విషయంగా చూసేందుకు మనం అలవాటు పడబోతున్నామా?!
– ప్రియాంక చతుర్వేది, రాజ్యసభ సభ్యురాలు
తీర్పును గురించిన వార్తను చదివాక ఎలా స్పందించాలో తెలీక మాటల్ని వెతుక్కున్నాను. గాట్ ఇట్ నౌ. హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్‌డే. (ఆవేదనగా, ఆవేశంగా..)
– తాప్సీ, బాలీవుడ్ నటి
ఈ తీర్పు ఫేక్ న్యూస్ అని ఎవరైనా చెప్పండి ప్లీజ్.
– రితేశ్ దేశ్‌ముఖ్, టెలివిజన్ పర్సనాలిటీ
బాంబే హైకోర్టులో సింగిల్ బెంచ్ వచ్చిన తీర్పుపై తక్షణం ‘లెటర్స్ పేటెంట్ అప్పీల్’ను ఫైల్ చేయండి.
– కనూంగో, ఛైర్మన్, నేషనల్ కమిషన్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ (మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం)
Comments
Please login to add a commentAdd a comment