![Bombay High Court judge quashes another POCSO Act - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/29/nagpur-b.jpg.webp?itok=DqB6e_-1)
నాగపూర్: శరీరానికి శరీరం తాకకుండా బట్టలపైనుంచే బాలిక శరీర భాగాలను నొక్కినా ‘పోక్సో’ చట్టం కింద దాన్ని లైంగిక వేధింపులుగా పరిగణించలేమంటూ జనవరి 19న తీర్పునిచ్చి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం జడ్జి జస్టిస్ పుష్పా గణేడివాలా మరోసారి వార్తల్లోకెక్కారు. నిందితుడు ఐదేళ్ల బాలిక చేతులను బంధించి, తన ప్యాంట్ జిప్ విప్పినా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం కింద లైంగిక వేధింపులుగా నిర్ధారించలేమని జస్టిస్ పుష్పా గణేడివాలా జనవరి 15న ఇచ్చిన తీర్పు తాజాగా బయటికొచ్చింది. కామ వాంఛతో శరీరానికి శరీరం తాకిస్తేనే(స్కిన్ టు స్కిన్ కాంటాక్టు) ఈ చట్టం కింద లైంగిక వేధింపులుగా గుర్తిస్తామని జడ్జి పేర్కొన్నారు. నిందితుడికి కేసు నుంచి విముక్తి కలిగించారు.
అసలేం జరిగింది?
2018 ఫిబ్రవరి 12న మహారాష్ట్రలో లిబ్నస్ కుజూర్ అనే 50 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల చిన్నారి ఒంటరిగా ఉన్నపుడు ఇంట్లోకొచ్చి బాలిక చేతులను బంధించాడు. తన ప్యాంట్ జిప్ విప్పాడు. ఇంతలో ఆమె తల్లి రావడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసువేశారు. నేరం నిరూపణ కావడంతో సెషన్స్ కోర్టు 2020 అక్టోబర్‌లో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ లిబ్నస్ కుజూర్ బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌ను ఆశ్రయించాడు. అతడు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పుష్పా గణేడివాలా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం 2021 జనవరి 15న విచారణ జరిపింది. బాలిక పట్ల శారీరక వాంఛతోనే నిందితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించాడన్న ప్రాసిక్యూషన్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇక్కడ శరీరానికి శరీరం తాకలేదు కాబట్టి పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులు కాదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment