తండ్రీ కొడుకుల దుర్మరణం | Father and son died | Sakshi
Sakshi News home page

తండ్రీ కొడుకుల దుర్మరణం

Published Mon, Jun 9 2014 12:42 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

తండ్రీ కొడుకుల దుర్మరణం - Sakshi

తండ్రీ కొడుకుల దుర్మరణం

 అనంతపల్లి (నల్లజర్ల రూరల్), న్యూస్‌లైన్ : అనంతపల్లి ఎర్రకాలువ బ్రిడ్జి సమీపంలో ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో తండ్రీ కొడుకులు మరణించారు. అదే బైక్‌పై తాత ఒడిలో ఉన్న ఇద్దరు చిన్నారులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు ఇవి.. మం డలంలోని అచ్చన్నపాలెం గ్రామానికి చెందిన జాలపర్తి శ్రీరామమూర్తి(62) రైతు. అతని కుమారుడు నాగేంద్రబాబూరావు(40) నల్లజర్ల ఏకేఆర్జీ కళాశాలలో ఎంబీఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. స్థానిక పాల సొసైటీ కి డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. బాబూరావు తన 9 నెలల కుమారుడికి నామకరణం చేయించేందుకు తండ్రి శ్రీరామమూర్తి, పెద్ద కుమారుడు మూడేళ్ల  రోహిత్‌తో కలిసి బైక్‌పై ఆదివారం అనంతపల్లిలోని స్వర్ణదుర్గాశ్రమానికి వెళ్లారు. నామకరణం చేయించి  ఇంటికి బయలుదేరారు. బాబూరావు బైక్ నడుపుతుండగా వెనుక కూర్చున్న శ్రీరామమూర్తి మనవలిద్దరిని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అనంతపల్లి శివారులో ఈ బైక్ మట్టి లోడు ట్రాక్టరును ఓవర్‌టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని అదపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో శ్రీరామమూర్తి, నాగేంద్ర బాబూరావుకు తీవ్ర గాయాలయ్యాయి.
 
 వీరిద్దరి మధ్యలో ఉన్న పిల్లలు ఒకరు బస్సుకింద, మరొకరు బయటకు పడ్డారు. వారిద్దరూ సురక్షితంగా ఉన్నారు. బైక్‌ను డీకొన్న బస్సులో శ్రీరామ్మూర్తి భార్య సూర్యకాంతం మరో ముగ్గురు బంధువులతో చాగల్లు సమీపంలోని ఊనగట్లలో జరిగే దిన కార్యక్రమానికి వెళుతోంది. బస్సు దిగిన ఆమె కళ్లెదుటే భర్త, కొడుకు క్షతగాత్రులై ఉండటం చూసి నిశ్చేష్టురాలైంది. గ్రామ పెద్దలు కలం నాగేశ్వరరావు, బళ్ల ప్రభాకరరావు, జమ్ముల సతీష్, ప్రత్తి శ్రీనుబాబు తదితరులు ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో రాజమండ్రి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దుద్దకూరు సమీపంలో శ్రీరామమూర్తి, రాజమండ్రి బ్రిడ్జి సమీపంలో  నాగేంద్రబాబూరావు మృతి చెందారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శవపంచనామా చేశారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే కుటుంబంలో ఒకేసారి  ఇద్దరు మృతి చెందడం గ్రామస్తులను కలచి వేసింది. అనంతపల్లి ఎస్‌హెచ్‌వో జుల్ఫికర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement