
డ్రగ్ రాకెట్ వెనుక దావూద్ ఇబ్రహీం?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో ఉన్న జీడిమెట్ల పారిశ్రామికవాడలో మాదకద్రవ్యాల్ని తయారుచేసి పుణే మీదుగా మలేసియాకు ఎగుమతి చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్‌సీబీ), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్‌ఓటీ) పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. గురువారం ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసిన అధికారులు అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2 కోట్లకుపైగా విలువ చేసే 11 కేజీల నిషేధిత మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్ ఆర్థిక లావాదేవీలన్నీ హవాలా మార్గంలోనే సాగడంతో ఇందులో మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ దావూద్ ఇబ్రహీం ముఠా ప్రమేయాన్ని అనుమానిస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఓటీ ఓఎస్డీ కె.గోవర్ధన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన కమ్మ శ్రీనివాస్ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సుభాష్‌నగర్‌లో బాలాజీల్యాబ్స్ పేరుతో కంపెనీ పెట్టాడు. ఎమ్మెస్సీ(ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేసిన శ్రీకాకుళం జిల్లా పూతిగలపాడుకు చెందిన పి.మురళీకృష్ణ గతేడాది బాలాజీ ల్యాబ్స్‌లో చేరాడు. వీరిద్దరూ కలిసి తక్కువ కాలంలో తేలిగ్గా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆరు నెలల నుంచి నిషేధిత మాదకద్రవ్యాలైన ఎఫిడ్రిన్, మెథాఫెటామైన్ తయారు చేయడం ప్రారంభించారు.
లావాదేవీలన్నీ హవాలా మార్గంలోనే
జీడిమెట్లలోని గిరినగర్‌లో ప్లాస్టిక్ వ్యాపారం చేసే శివకుమార్‌కు వీరు మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నారు. అతను వీటిని పుణేలో స్థిరపడిన చెన్నయ్‌వాసి అబ్దుల్ అజీజ్‌కు అమ్ముతున్నాడు. అజీజ్ అక్కడినుంచి చెన్నయ్‌లోని కొందరు వ్యాపారులకు పంపుతుండగా.. వారిద్వారా వివిధ మార్గాల్లో మలేసియాకు చేరుతున్నాయి. మెథాఫెటామైన్ దేశీయంగా కేజీ రూ.5 లక్షలకు చేతులు మారుతోందని, అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర రూ. 20 లక్షల వరకు ఉన్నట్టు సమాచారం. ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతోనే శివకుమార్ జీడిమెట్లలో రూ.కోటి వెచ్చించి ప్లాస్టిక్ పరిశ్రమ నెలకొల్పాడు. ఈ దందాలో ఆర్థిక లావాదేవీలన్నీ హవాలా మార్గంలోనే చేస్తున్న ముఠా అందుకోసం ఆరుగురు ఏజెంట్లను నియమించుకుంది. వారిలో హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో కేశరియా నావెల్టీస్ నిర్వహిస్తున్న అరవింద్ అలియాస్ శంకర్ ఒకడు. ఇతడు హవాలా డబ్బు డెలివరీకోసం లక్కీసింగ్ అనే వ్యక్తిని నియమించుకున్నాడు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల నేపథ్యంలో ఇటీవల డ్రగ్స్ దందాపై నిఘా పెంచిన ఎస్‌ఓటీ బాలాజీ ల్యాబ్స్‌తోపాటు సమీపంలోని కార్మోల్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోని కొన్ని రియాక్టర్లలో మెథాఫెటామైన్ డ్రగ్ తయారవుతోందని గుర్తించింది. వెంటనే ఎన్‌సీబీ ఎస్పీ దినేష్ చవాన్, ఎస్‌ఓటీ ఓఎస్డీ కె.గోవర్థన్‌రెడ్డిల నేతృత్వంలో ఈ రెండు విభాగాల ఇన్‌స్పెక్టర్లు కె.చంద్రశేఖర్, జి.రమేష్, దీపక్‌కుమార్, టి.అనిల్‌కుమార్‌లు గురువారం దాడులు నిర్వహించారు. శివకుమార్, అబ్దుల్ అజీజ్, ఇతడి సహాయకుడు ఇస్మాయిల్ షేక్, శ్రీనివాస్, మురళీకృష్ణల్ని పట్టుకున్నారు. అదే సమయంలో శివకుమార్‌కు రూ.15 లక్షల హవాలా సొమ్ము డెలివరీ ఇవ్వడానికి వచ్చిన లక్కీసింగ్‌నూ అరెస్టు చేశారు. వీరి నుంచి 11 కేజీల మెథాఫెటామైన్, కారు, రూ.15 లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాలాజీ ల్యాబ్స్‌ను సీజ్ చేసిన అధికారులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు కార్మోల్ డ్రగ్స్ దందాపైనా ఆరా తీస్తున్నారు.