RTC Bus Accident: Several People Died in Bus Accident at West Godavari - Sakshi
Sakshi News home page

రెప్పపాటులో 'ఘోరం'.. జల్లేరు వాగులో బస్సు బోల్తా 

Published Thu, Dec 16 2021 2:40 AM | Last Updated on Thu, Dec 16 2021 10:43 AM

Several People Deceased In RTC Bus Accident At West Godavari District - Sakshi

జల్లేరు వాగులో పడిన బస్సును బయటకు తీస్తున్న సహాయక సిబ్బంది, స్థానికులు

సమయం మధ్యాహ్నం 12 గంటలు.. పల్లె వెలుగు బస్సు ఓ వంతెనపై వెళుతోంది.దాదాపు నాలుగు గంటలుగా ప్రయాణం.. సాఫీగానే సాగుతోంది... మరో పావు గం టలో గమ్యస్థానం చేరుకోనుండటంతో ప్రయాణికులంతా సిద్ధంగా ఉన్నారు.. అంతలో.. హఠాత్తుగా పెద్ద కుదుపు.. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి బ్రిడ్జిపైనే ఓవర్‌టేక్‌ చేసి బస్సు ముందుకు దూసుకొచ్చాడు.. అదుపు తప్పిన బస్సు డివైడర్‌ను ఎక్కి వంతెన ఎడమ వైపు రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టింది.. తేరుకునేలోపే బస్సు వాగులో పడిపోయింది.. పది ప్రాణాలు నీటిలో కలిశాయి.. పశ్చిమ గోదావరి జిల్లా వేగవరం వద్ద జల్లేరు వాగులో చోటు చేసుకున్న విషాద ఘటన ఇది.

ప్రముఖుల దిగ్భ్రాంతి 
బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.   

జంగారెడ్డిగూడెం/జంగారెడ్డిగూడెం రూరల్, ఏలూరు టౌన్‌:  కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకోవాల్సిన బస్సు ప్రయాణం కొన్ని కుటుంబాలకు అంతిమయాత్రగా మారింది. మృతుల కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఒక ప్రాణాన్ని రక్షించే క్రమంలో పది  ప్రాణాలు పోయాయి. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివారు జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. అక్కడున్న స్థానికులు తక్షణమే స్పందించగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను కాపాడటంతోపాటు వెంటనే ఆస్పత్రులకు తరలించి వైద్య సాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మరో రూ.2.5 లక్షల చొప్పున అదనంగా పరిహారాన్ని అందించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. 

భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న పల్లె వెలుగు బస్సు (ఏపీ 37 జడ్‌ 0193) జల్లేరు వాగు వంతెనపై ఓ ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ప్రమాదానికి గురైంది. ఉదయం 8 గంటలకు బయల్దేరిన ఈ బస్సులో 47 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో వాగులో నీరు నిండుగా ప్రవహిస్తోంది. క్షతగాత్రుల హాహాకారాలతో స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వీఆర్‌ ఎలీజా, తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ, జేసీ హిమాన్షు శుక్లా, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు సహాయ చర్యలను పర్యవేక్షించారు.   
జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు వద్ద సహాయక చర్యల్లో స్థానికులు 

ఆర్టీసీ తరఫున రూ.2.50 లక్షలు
ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన సేవలు అవసరమైతే తక్షణమే ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. తీవ్ర గాయాలైన బాధితులకు మెరుగైన వైద్యాన్ని ఆర్టీసీ పర్యవేక్షణలోనే అందిస్తామని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి మృతులకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారని, ఆర్టీసీ తరపున మరో రూ.2.50 లక్షలు అందచేస్తామని చెప్పారు. తొలుత వారిద్దరూ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.  

జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రి వద్ద విలపిస్తున్న బాధితులు 

నిమిషాల వ్యవధిలో...
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 20 నిమిషాల్లోనే రెస్క్యూ అక్కడకు చేరుకుంది. క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, డీఎస్పీలు డాక్టర్‌ రవికిరణ్‌ తదితరులు ఆగమేఘాలపై అక్కడకు వెళ్లారు.  సుమారు 4 గంటలకుపైగా శ్రమించిన రెస్క్యూ టీం వాగులో పడిన బస్సును మూడు భారీ  క్రేన్ల సాయంతో వెలికి తీసింది. క్షతగాత్రులకు తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం  కార్పొరేట్‌ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు.   

క్షతగాత్రుల వివరాలు.... 
పసుపులేటి రాజారావు (సూర్యారావుపాలెం–ఉండ్రాజవరం), కె.హరినాథ్‌బాబు (నల్లజర్ల), కవ్వాడి కామరాజు (గోపన్నగూడెం–అశ్వారావుపేట), సత్తెనపల్లి కృష్ణవేణి (తాళ్లపూడి), సత్తెనపల్లి పద్మారావు (తాళ్లపూడి), చోడేదేవి (పూసర్ల–వేలేరుపాడు), చోడే సీతమ్మ (పూసర్ల–వేలేరుపాడు), మల్లిడి సోమశేఖర్‌రెడ్డి (రామవరం–అనపర్తి), కోట మనీషా(కుక్కునూరు), కోట ముత్యాలు (కుక్కునూరు), ఎం.లక్ష్మి (జంగారెడ్డిగూడెం), కె.నాగమ్మ (దేవులపల్లి), పంపన శకుంతలదేవి (గొల్లగూడెం–ద్వారకాతిరుమల), కె.కీర్తి (నాగిగూడెం–కుక్కునూరు), కోట ప్రశాంతి (కుక్కునూరు), తాటి సుబ్బలక్ష్మి (తోటపల్లి–బుట్టాయగూడెం),కె.సులోచన (నాయుడుగూడెం– కుక్కునూరు), పాయం శివ (భద్రాచలం), పాయం రమేష్‌ (పండువారిగూడెం), ఉమ్మడి దుర్గ (టి.నర్సాపురం), జి.రవిశేఖర్‌ (కరిచెర్లగూడెం), పసుపులేటి మంగ (సూర్యారావుపాలెం), కేత వరలక్ష్మి, కండెల్లి స్వప్న (గోపాలపురం), ఉండ్రాజవరపు గీతికాన్షి (జి.కొత్తపల్లి–ద్వారకాతిరుమల).

ఈత రావడంతో..
బస్సు ముందు సీట్లల్లో కూర్చున్నాం. హఠాత్తుగా వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం వేగంగా రావడంతో తప్పించే క్రమంలో వంతెనను ఢీకొని బస్సు వాగులో పడిపోయింది. ఈత రావడంతో వాగులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాం. స్థానికులు, మత్స్యకారులు వెంటనే స్పందించి నాటు పడవలు, తాళ్ల సాయంతో గాయపడ్డ వారిని రక్షించారు.
    – శివ, రమేష్, భద్రాచలం  (ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షులు)  

ఆర్డీవోతో విచారణ కమిటీ
క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే ఆయన వెంటనే జంగారెడ్డిగూడెం చేరుకుని గాయపడ్డవారిని పరామర్శించారు. స్వల్ప గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ 9 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై ఆర్డీవో స్థాయి అధికారితో కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.   

ప్రమాదంపై గవర్నర్‌ దిగ్భ్రాంతి 
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం పట్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 9 మంది ప్రయాణికులు మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.    

సీఎం జగన్‌ సానుభూతి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాకు ఆదేశం  
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ప్రధాని మోదీ బాసట
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి నేషనల్‌ రిలీఫ్‌ ఫండ్‌ (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నట్లు పేర్కొన్నారు.   

బాధాకరం: మండలి చైర్మన్‌ 
సాక్షి,అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ శాసనమండలి చైర్మన్‌ మోషెన్‌ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు వెనువెంటనే ప్రభుత్వం స్పందించి సత్వరంగా రూ.5 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సకోసం జంగారెడ్డిగూడెం, ఏలూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారని పేర్కొన్నారు. ఘటనపై సత్వరమే స్పందించి, విచారణకు ఆదేశించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement