అంధకారంలో ఏజెన్సీ | no power in 40 villages | Sakshi
Sakshi News home page

అంధకారంలో ఏజెన్సీ

Published Sat, Feb 1 2014 4:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

no power in 40 villages

 40 గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
 రైతులను కించపరిచిన షిఫ్ట్
 ఆపరేటర్ తీరుకు నిరసనగా విద్యుత్ సబ్ స్టేషన్‌కు తాళం
 బుట్టాయగూడెంలో రాస్తారోకో, ధర్నా
 ఆపరేటర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
 
 జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ :
 విద్యుత్ సరఫరా ఎప్పుడు చేస్తారో చెప్పాలని అడిగిన రైతును కించపరుస్తూ మాట్లాడిన జంగారెడ్డిగూడెం సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ బాబూరావు తీరును నిరసిస్తూ రైతులు బుట్టాయగూడెంలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించి తాళాలు వేశారు. ఆపరేటర్ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో 40 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. పోలీసులు జోక్యం చేసుకున్నా షిఫ్ట్ ఆపరేటర్ వచ్చి సమాధానం చెప్పకపోవడంతో రాత్రి 10.15 గంటల వరకూ రాస్తారోకో కొనసాగింది. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం బుట్టాయగూడెం సబ్‌స్టేషన్‌కు గుత్తుల సురేష్ అనే రైతు వచ్చి ఉదయం 11 గంటలైనా విద్యుత్ ఇవ్వకపోవడంపై షిఫ్ట్ ఆపరేటర్ రమేష్‌ను ప్రశ్నించాడు. ఇక్కడ సరఫరా ఉందని జంగారెడ్డిగూడెంలో తీసేయడం వల్ల బయటకు సప్లై ఇవ్వలేదని, కారణం తెలీదని చెప్పాడు. అయితే విద్యుత్ ఎప్పుడు ఇస్తారో కనుక్కోవాల్సిందిగా కోరడంతో దీనిపై రమేష్ అక్కడ నుంచే జంగారెడ్డిగూడెం 132 కేవీ సబ్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి అక్కడి షిఫ్ట్ ఆపరేటర్ బాబూరావును ఇదే విషయం అడిగాడు.
 
  విద్యుత్ సరఫరాపై ఇక్కడి రైతులు తనను ప్రశ్నిస్తున్నారని, సరఫరా ఎప్పుడు ఇస్తారో మీరే రైతులకు చెప్పాలంటూ కోరాడు. తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, డిపార్ట్‌మెంట్ ఫోన్ నుంచి ఎందుకు ఫోన్ చేశావని గుత్తుల సురేష్‌తో రమేష్ అసభ్యకరంగా మాట్లాడాడు. ఇంతలో మరికొంతమంది రైతులు విద్యుత్ విషయమై కార్యాల యానికి రాగా, వారికి ఈ విషయమై సురేష్ వివరించారు. వారు కూడా జంగారెడ్డిగూడెం షిఫ్ట్ ఆపరేటర్‌కు ఫోన్‌చేసి కరెంటు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించగా, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్టు రైతులు ఆరోపిస్తున్నారు.  బాబూరావు తీరును నిరసిస్తూ రైతులు బుట్టాయగూడెం సబ్‌స్టేషన్‌కు తాళాలు వేసి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై బీఎస్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు శాంతింపచేయడానికి ప్రయత్నించారు
 
 . ఒక దశలో రైతులకు, పోలీసులకు తీవ్రవాగ్వివాదం జరిగింది. జంగారెడ్డిగూడెం సీఐ మురళీ కృష్ణ, ఏడీఈ శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరు కుని రైతులతో చర్చించారు. షిఫ్ట్ ఆపరేటర్ బాబూరావును శనివారం ఇక్కడకు తీసుకొస్తా మని, లేదంటే అతనిపై కేసు నమోదు చేస్తా మని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. రైతులు చిలక సూరిబాబు, కరాటం నాగరాజు, చింతపల్లి వెంకటేశ్వరరావు, షేక్‌జానీ, కణితి ఉమ, ఆలపాటి ఫణికిషోర్, బిక్కిన వెంకటేశ్వరరావు, ఆండ్రు సురేష్, ఎం.రవి, అందుగుల ఫ్రాన్సిస్, కలగర నాని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement