కాళ్లీడ్చాలిందే
కాళ్లీడ్చాలిందే
Published Mon, Jan 2 2017 11:39 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
పింఛను సొమ్ముల కోసం పండుటాకుల పాట్లు
గత నెలలో బ్యాంకుల చుట్టూ.. ఇప్పుడు జన్మభూమి సభల చుట్టూ ప్రదక్షిణలు
జంగారెడ్డిగూడెం :
ఈ నెలలోనూ పింఛను బాధలు తప్పడం లేదు. ప్రభుత్వం జన్మభూమిమా ఊరు పేరిట పేరిట నిర్వహించే గ్రామ సభల్లో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించడంతో ఈనెల 11వ తేదీ వరకు పింఛనుదారులకు సొమ్ము అందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఈ నెలలోనూ పింఛను కోసం అవస్థలు ఎదుర్కోవాల్సిన దుస్థితి దాపురించింది. డిసెంబర్ నెల పింఛను సొమ్ముల కోసం వారంతా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చాలామందికి నేటికీ ఆ నెల పింఛను అందలేదు. తాజాగా, జనవరి నెల పింఛను సొమ్మును జన్మభూమి సభల్లో ఇవ్వనుండటంతో కష్టాలు తప్పడం లేదు.
ఎక్కడిస్తారు.. ఎప్పుడిస్తారు
పింఛను సొమ్మును ఏ వార్డులో, ఎప్పుడు ఇస్తారనేది లబ్దిదారులకు స్పష్టంగా తెలియజేయకపోవడంతో వారంతా ఎక్కడ జన్మభూమి సభ జరిగితే అక్కడకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. వృద్ధులైతే నడవలేని స్థితిలో కాళ్లీడ్చుకుంటూ జన్మభూమి సభలు నిర్వహించే ప్రాంతాలకు వెళుతున్నారు. తీరా అక్కడికి వెళితే మీ వార్డులో జరిగే జన్మభూమి సభలో సొమ్ములిస్తారంటూ వెనక్కి పంపేస్తున్నారు. గతంలో ప్రతినెలా 5వ తేదీలోగా పింఛన్‌దారులందరికీ ప్రభుత్వ సిబ్బంది సొమ్ములు పంపిణీ చేసేవారు. నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన అనంతరం పింఛన్‌దారుల పరిస్థితి మారిపోయింది. నవంబర్ నెలకు పింఛన్ అందడంతో పెద్ద నోట్ల రద్దు ప్రభావం కనిపించకపోయినా.. డిసెంబర్ నెలలో లబ్దిదారులు నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. వారి ఖాతాల్లో పింఛను సొమ్ము జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. పెన్షనర్లంతా బ్యాంకుల నుంచి సొమ్ము తీసుకోవచ్చని భావించారు. చాలామందికి ఖాతాలు లేకపోవడంతో, ఉన్నా లావాదేవీలు నిర్వహించకపోవడంతో రద్దు కావడం.. బ్యాంకుల చుట్టూ తిరిగినా ఖాతాల పునరుద్ధరించకపోవడం.. ఖాతా ఒక బ్యాంకులో ఉంటే మరో బ్యాంకులో సొమ్ము జమ చేయడం వంటి సమస్యలతో సతమతమయ్యారు. ఖాతాలు ఉన్న లబ్దిదారులకు సొమ్ములు జమ కాలేదు. దీంతో అనేకమంది వృద్ధులు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ నెలంతా కాళ్లరిగేలా తిరిగారు. అయినా చాలా మందికి నేటికీ పింఛను డబ్బు అందలేదు.
నడవలేని వారికి గ్రామసభలు ముగిశాకే..
లబ్దిదారుల్లో చాలామందికి ఈ నెల 11వ తేదీ వరకు పింఛను సొమ్ము అందదు. గతంలో 5వ తేదీలోగా పింఛను సొమ్ము తీసుకునేందుకు రాలేని వారిని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారిని, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారిని గుర్తించి.. 5వ తేదీ తరువాత సిబ్బంది ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి జన్మభూమి సభలు పూర్తయ్యాక అయినా ఇళ్లకు వెళ్లి సొమ్ములు అందిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలావుంటే.. జన్మభూమి సభలకు పింఛనుదారులు మాత్రమే వస్తున్నారు. చాలాచోట్ల 50 నుంచి 100 మంది పింఛనుదారులతో గ్రామసభలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు.
Advertisement