ఏలూరు, న్యూస్‌లైన్ :
సమైక్యాంధ్ర నినాదం జిల్లాలో దశదిశలా మార్మోగుతోంది. సమైక్యాంధ్ర పరి రక్షణ ఆవశ్యకతను వివిధ కళారీతులతో కళాకారులు చాటుతున్నారు. విభజన వల్ల తలెత్తే కష్టాలు, నష్టాలను నాటికలు, నాట కాల రూపంలో కళ్లముందు సాక్షాత్కరింప చేస్తున్నారు. 38వ రోజైన శుక్రవారం కూడా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాలు జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున సాగారుు. కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో వివిధ వేషధారణలతో కొత్తపేట నూకాలమ్మ గుడి నుంచి భారీ ప్రదర్శన ప్రారంభించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో సుమారు గంటసేపు కళా రీతులను ప్రదర్శించి కళాగర్జన చేశారు. రెల్లి కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని విభజన ప్రకటనపై నిరసన తెలిపారు. డీపీవో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన గళమెత్తారు. స్వర్ణకారులు, కుమ్మరి, వడ్రంగి వృత్తిదారులు రోడ్లపైనే పనులు చేసి నిరసన తెలిపారు.
జంగారెడ్డిగూడెంలో లక్ష జనగళ ఘోష.. తాళ్లపూడిలో లక్ష గళార్చన
జంగారెడ్డిగూడెంలో సమైక్యాంధ్ర కోరుతూ లక్ష జనగళ ఘోష కార్యక్రమం నిర్వహిం చారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సమైక్య నినాదాన్ని మారుమోగించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఉద్యమకారులను ఉత్సాహపరిచారు. తాళ్లపూడిలో వర్తక సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు చేసి లక్ష గళార్చన నిర్వహించారు. వేగేశ్వరపురంలో 300 ఆటోలతో ర్యాలీ చేశారు. పాలకొల్లులో యరసింగి శిరీష అనే గృహిణి అమరణ దీక్ష చేపట్టారు. ఆడియో, వీడియో వర్కర్స్ ఆధ్వర్యంలో దీక్షలు జరిగారుు. బీఆర్‌ఎంవీ స్కూల్ విద్యార్థులు రాస్తారోకో చేశారు. పోడూరు మండలం మినిమించిలిపాడులో వంటావార్పు చేపట్టారు. యలమంచిలి మండలం చించినాడ, దొడ్డిపట్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ వద్ద సైనిక దుస్తుల్లో విద్యార్థులు కవాతు నిర్వహించారు. త్యాగధనుల వేషధారణలతో దేశభక్తి గీతాలకు అనుగుణంగా నర్తించారు. గోపన్నపాలెంలోని పార్థసారథి పాఠశాల విద్యార్థులు భిక్షాటన చేసి విభజన ప్రకటనపై నిరసన తెలిపారు.
భీమవరం అర్కెస్ట్రా కళాకారులు, అధ్యాపకులు, న్యాయవాదులు, మునిసిపల్ ఉద్యోగులు, ఎన్జీవోలు రిలే నిరాహార దీక్షలు చేశారు. విద్యుత్ శాఖ విశ్రాంత ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నారాయణ స్కూల్ విద్యార్థులు ప్రకాశం చౌక్‌లో మానవహారం నిర్మించారు. నరసాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షల్లో వైద్యులు పాల్గొన్నారు. పీఎంపీలు, మెడికల్ షాపుల యజమానులు వంటావార్పూ చేశారు. ఆచంటలో రైతు సంఘం నాయకులు దీక్షలో కూర్చున్నారు. పెనుమంట్రలో ఉపాధ్యాయులు రిలే దీక్షలు ప్రారంభించారు. పెనుగొండలో స్వర్ణకారులు దీక్షల్లో పాల్గొన్నారు. తణుకులో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్‌లపై విమర్శనాత్మక పాఠాలు చెప్పారు. అత్తిలిలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు చేపట్టిన నిరాహార దీక్షలను వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య సందర్శించారు. కొవ్వూరు జూని యర్ కళాశాల వద్ద ఉపాధ్యాయ జేఏసీ దీక్షలకు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు సంఘీభావం తెలిపారు.
కొవ్వూరు మండలం కుమారదేవంలో విద్యార్థులు రోడ్డుపైనే పరీక్షలు రాసి నిరసన తెలిపారు. వాడపల్లిలో విద్యార్థులు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. చింతల పూడి పట్టణంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మానవహారం చేపట్టారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బంద్ పాటించి రోడ్డుపై వంటావార్పు చేశారు. బుట్టాయగూడెంలోఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఉండి నియోజకవర్గంలో ఉద్యమాలు ఉవ్వెత్తున సాగాయి. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు పాతపాటి సర్రాజు ఉండి సెంటర్‌లో రోడ్లను ఊడ్చి విభజన ప్రకటనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమైక్య గళం.. గొంతెత్తిన దళం
Published Sat, Sep 7 2013 12:31 AM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM
Advertisement
Advertisement