
'అన్నీ ఫ్రీ.....ఫ్రీ... ఆల్ ఫ్రీ.... అట!'
జంగారెడ్డి గూడెం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సినీనటుడు పవన్ కల్యాణ్పై విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇస్తే జగనన్న తన జీవితాన్ని అంకితం చేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఓటు వేసే ముందు వైఎస్ రాజశేఖరరెడ్డిని తలచుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు పాలక పక్షంతో కుమ్మక్కై రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. విభజనలో కాంగ్రెస్తో పాటు చంద్రబాబు నాయుడు ప్రధాన కారకులని షర్మిల విమర్శించారు. పవన్ కల్యాణ్కు లెక్కలేనంత తిక్క అని ఆయనే చెప్పుకుంటారు అని ఆమె ఎద్దేవా చేశారు. సొంతమామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, పూర్తి మద్యపానం నిషేధం అన్నారని, అయితే ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని షర్మిల వ్యాఖ్యానించారు.
ఏనాడు పేదల పక్షాన మాట్లాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అధికార దాహంతో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ... మహిళలకు బంగారు మంగళసూత్రాలు, అమ్మాయి పుడితే రూ.5వేలు నగదు, బాలికలకు సైకిళ్లు, పీజీ వరకూ ఉచిత విద్య, యువతకు కోటి ఉద్యోగాలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఇంటికో ఉద్యోగం, ఫ్రీగా సెల్ఫోన్లు ....అంటూ అన్ని ఉచితం...ఉచితం.. అంటూ చంద్రబాబు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.