ఏజెన్సీలో మావోయిస్టుల బంద్‌ సంపూర్ణం | Maoist bandh is completed in the agency | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో మావోయిస్టుల బంద్‌ సంపూర్ణం

Published Sat, May 5 2018 1:52 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

Maoist bandh is completed in the agency - Sakshi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు పేల్చివేసిన కల్వర్టు

చర్ల: ఏజెన్సీలో మావోయిస్టుల బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లకు నిరసనగా శుక్రవారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉత్కంఠ నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం–వెంకటాపురం మధ్యలో జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును మావోయిస్టులు గురువారం రాత్రి మందుపాతరలతో పేల్చివేశారు. ఈ సంఘటనతో సమీప ఆర్‌. కొత్తగూడెం, సత్యనారాయణపురం, కుదు నూరు, కలివేరు, పెద్దిపల్లి, శివలింగాపురం, దానవాయిపేట గ్రామాలకు చెందిన జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన మినహా బంద్‌ ప్రశాంతంగా జరిగింది. పేల్చివేత ఘటన జరిగిన ప్రాంతానికి అర కిలోమీటరు దూరంలో సీఆర్‌పీఎఫ్‌ 151వ బెటాలియన్‌కు చెందిన ఒక క్యాంపు, మరో అర కిలోమీటరు దూరంలో కలివేరులో మరో బేస్‌ క్యాంపు ఉన్నాయి. 

బంద్‌ పాటించాలంటూ పోస్టర్లు  
పేల్చివేతకు ముందు ఈ ప్రాంతానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో గోగుబాకలో ప్రధాన రహదారిపై, మావోయిస్టులు బంద్‌ పాటించా లంటూ వాల్‌పోస్టర్లు వేసినట్లు తెలుస్తోంది. మహా రాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు 42 మంది విప్లవకారులకు విషాహారమిచ్చి హత్య చేశారని అందులో పేర్కొ న్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌ను ఖండించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టుల ఏరివేత పేరు తో ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్‌ సమాధాన్‌ను ఓడించాలంటూ ప్రజలను కోరారు. 

బ్యాంకులు, పెట్రోల్‌ బంకులు మూత 
ఏజెన్సీలో మావోయిస్టుల బంద్‌ సంపూర్ణంగా జరిగింది. భద్రాద్రి జిల్లా చర్ల, భూపాలపల్లి జిల్లాల్లో వెంకటాపురం, వాజేడు మండలాల్లో సంపూర్ణంగా బంద్‌ కొనసాగగా, దుమ్ముగూడెం (భద్రాద్రి) మండలంలో పాక్షికంగా జరిగింది. బ్యాంకులు, పెట్రోల్‌బంక్‌లు, హోటళ్లు, సినిమా హాళ్లు మూతబడ్డాయి. దుకాణాలు, మొబైల్‌ షాపులు తెరుచుకోలేదు. భద్రాచలం–వెంకటాపురం మధ్య ఆర్టీసీ బస్సు లు యథావిధిగా తిరిగాయి.  ఆటోలు, ప్రైవేటు వాహనాలు తిరగలేదు. మీ సేవ కేంద్రాలు మూతబడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement