
ములుగు: ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మంగపేట మండలం నరసింహసాగర్ సమీపంలో ఉన్న ముసలమ్మగుట్ట, తిమ్మాపూర్ పరిధి కొప్పుగుట్ట మధ్య మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ దళాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు పక్షాలమధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ పాటిల్ ప్రకటన విడుదల చేశారు. వారిని మణుగూరు ఏరియా దళ సభ్యులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిలో దళకమాండర్ సుధీర్ అలియాస్ రాము ఉన్నాడు. ఈ ఘటనతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా శనివారం ఏటూరునాగారం సబ్‌డివిజన్ పోలీసులు వెంకటాపురం(కె) మండలంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మిలీషియా సభ్యుడు మిడియం చిన్న లక్ష్మయ్యను అరెస్టు చేశారు. అతని నుంచి సేకరించిన సమాచారం మేరకు మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి దాడి చేసినట్లు తెలుస్తోంది.