వాజేడు: ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొంది. నాలుగు రోజుల క్రితం చర్ల, వెంకటాపురం సమీపంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని తడపలగుట్ట వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్యన జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతిచెందిన విషయం తెలిసిందే. మావోయిస్టులకు తీవ్ర నష్టం జరగడంతో ఆ పార్టీ ప్రతీకార చర్యలకు పూనుకోవచ్చని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ కూడా టీఆర్‌ఎస్ నాయకులను హెచ్చరిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో పోలీసులు సరిహద్దులో ముమ్మర తనిఖీలను నిర్వహిస్తున్నారు.
వాజేడు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి వద్ద, పేరూరు ఎస్సై స్వామి చండ్రుపట్ల క్రాస్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు. వాహనాలను, అందులోని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడంతోపాటు అపరిచిత వ్యక్తులు, కొత్తవ్యక్తుల సంచారం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. దీనికితోడు ఉన్నతాధికారుల ఆదేశానుసారం టీఆర్‌ఎస్ నాయకులతోపాటు ప్రజాప్రతినిధులను పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిసింది. కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు తరలివెళ్లారు. ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment