మందుపాతర కలకలం
ఏవోబీలో తెగబడ్డ మావోయిస్టులు
అవుట్‌పోస్ట్‌పై మందుపాతరతో దాడి
భయాందోళనలో మన్యం వాసులు
సీలేరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు తెగబడ్డారు. ఎన్నో ఏళ్లుగా బీఎస్‌ఎఫ్ బలగాలపై ప్రతీకారంతో రగులుతున్న దళసభ్యులు అదను చూసి దెబ్బతీశారు. బుధవారం నాటి ఈ ఘటనలో ముగ్గురు జవాన్లతో పాటు, ఓ గిరిజనుడి ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు నిరసన దినాలు, వారోత్సవాలప్పుడు స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు మందుపాతరతో దాడికి పాల్పడ్డారు. దీంతో సరిహద్దులోని మారుమూల గ్రామాల గిరిజనులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఒడిశాలో సీఆర్పీఎఫ్ బలగాల స్థానంలో బీఎస్‌ఎఫ్ బలగాలతో గాలింపు చేపట్టినప్పటి నుంచి మావోయిస్టుల దూకుడుకు కళ్లెం పడింది. ఇది మింగుడుపడని మావోయిస్టులు ఒడిశా మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరుకుబంద అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జాన్‌బై అవుట్‌పోస్ట్(104 బీఎస్‌ఎఫ్ బెటాలియన్)ను మందుపాతరతో పేల్చేశారు.
ఈ ఘటనలో ఏఎస్‌ఐ ఆర్.సిద్ధయ్యతో పాటు హెడ్‌కానిస్టేబుళ్లు ఎం.రవిచంద్ర, జి. అవినాష్ అనే ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు. అలాగే గుంటువాడ కాట్మన్ గూడెం పంచాయతీకి చెందిన కిల్లో హరి ఈ దాడిలో మృతి చెందాడు. పొలంలో పనిచేసుకుంటున్న ఇతడు పేలుడు ప్రభావంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకుంటున్న ప్రాంతాల్లో భద్రత బలగాలు మూడు నెలలుగా గాలిస్తున్నాయి. హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే చేపడుతున్నాయి. ఈ విధానం కొనసాగితే మున్ముందు ఉద్యమం దెబ్బతింటుందని గ్రహించిన దళసభ్యులు పక్కా సమాచరంతో దాడి చేశారు. ఒడిశాలో బీఎస్‌ఎఫ్ బలగాలు స్థావరం ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి మావోయిస్టులు ఇన్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. ఈ తరుణంలో ఈ సంఘటనతో గిరిజనులు తీవ్రభయాందోళనలకు గురవుతున్నారు. దీంతో సరిహద్దు పోలీసు స్టేషన్లను జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. చిత్రకొండ, సీలేరు, డొంకరాయి, జీకేవీధి పోలీసు స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు.