పరిశ్రమలకు కోతలు పెంపు
రెండు రోజులు పవర్‌హాలిడే
ఈ నెల 9 నుంచి అమలు ఎన్పీడీసీఎల్ ప్రకటన
వరంగల్ : కరెంటు కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఖరీఫ్ పంటలు చేతికి వచ్చే సమయంలో కోతలు పెరగడంలో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఇదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఇంకా ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌లో కోత మరింత పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపి ణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్) నిర్ణయించింది. పరిశ్రమలకు ఇప్పటికే వారంలో ఒక రోజు పూర్తిగా కరెంటు కోతలు విధిస్తున్నారు. ఈ నెల 9 నుం చి దీన్ని రెండు రోజులకు పెంచనున్నారు. పరి శ్రమలకు రెండు రోజులపాటు విధించే కరెంటు కోతలను అధికారికంగా పేర్కొంటూ ఎన్‌పీడీసీఎల్ మంగళవారం ప్రకటన జారీ చేసింది.
ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాల మేరకు పరిశ్రమలకు విద్యుత్ కోతలపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో డివిజన్ల వారీగా కోతలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. ఐదు జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించి ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో వారంలో రెండు రోజులు పరిశ్రమలకు కరెంటు కోతలు విధించనున్నారు. వరంగల్ సర్కిల్‌లో ప్రస్తుతం బుధవారంపవర్ హాలిడే ఉండగా... ఈ నెల 9వ తేదీ నుంచి బుధవారంతోపాటు గురువారం కూడా పరిశ్రమలకు విద్యుత్ కోత అమలు కానుంది.